CM Jagan Saval : విపక్షాలు కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందేనా ? జగన్ ఒంటరి పోటీ సవాల్ దేనికి సంకేతం ?
టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఏమవుతుంది ?ఒంటరి పోటీపై జగన్ సవాల్ దేనికి సంకేతం ?రాజకీయాల్లో పొత్తులు కామన్ - జగన్ కంగారు పడుతున్నారా?జగన్ సవాల్‌పై నెగెటివ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి ?
CM Jagan Saval : దమ్ముంటే టీడీపీ, జనసేన రెండు పార్టీలు విడివిడిగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని సీఎం జగన్ తెనాలిలో సవాల్ చేశారు. టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతున్న సమయంలో జగన్ ఇలాంటి సవాల్ చేయడంతో.. వెంటనే.. వైఎస్ఆర్‌సీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ఈ సవాల్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే చాలా మందికి విపక్షాలు ఎలా పోటీ చేయాలనేది వారి రాజకీయ వ్యూహం ...సీఎం జగన్ ఎందుకు ఇలా సవాల్ చేశారు.. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే నెగ్గలేమని భావించడం వల్లే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని విమర్శించడం ప్రారంభించారు. ఓ రకంగా ఇదే కోణంలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది.
ఎంత మంది కలసి వచ్చినా రెడీ మొన్నటిదాకా సవాల్ చేసిన వైఎస్ఆర్‌సీపీ నేతలు !
మొదటి సారి చంద్రబాబు, పవన్ విజయవాడలోని ఓ హోటల్‌లో కలిసినప్పుడు ఎంత మంది కలిసి వచ్చినా సరే వార్ వన్ సైడే అని.. వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రకటించారు. టీడీపీ, జనసేన అసలు విడిపోలేదని మొదటి నుంచి కలిసే ఉన్నాయన్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వైసీపీ నేతలు కూడా ఓ క్లారిటీకి వచ్చారు. దీంతో రెండు పార్టీలను కలిపే విమర్శించడం ప్రారంభించారు. దీంతో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నదాన్ని వైఎస్ఆర్‌సీపీ పట్టించుకోవడం లేదని.. తమ ఓటు బ్యాంక్ తమకు ఉంటుందన్న ధైర్యంతో ఉందని అనుకుంటూ వచ్చారు.
ఇటీవల పవన్ ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ !
అయితే అనూహ్యంగా ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలనే సవాల్ చేస్తూ వస్తున్నారు. టీడీపీతో కలిస్తే చంద్రబాబు సీఎం అవుతారని పవన్ సీఎం అవుతారా అి ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ టీడీపీతో కలుస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిస్తే సీఎం ఎవరు అనే చర్చ కూడా పెట్టారు. కానీ ఈ చర్చలో అటు టీడీపీ కానీ.. ఇటు జనసేన కానీ జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే.. రెండు పార్టీలు ఇంకా అధికారికంగా ఎలాంటి పొత్తుల చర్చలు కూడా ప్రారంభించలేదు. జనసేన పార్టీ ఇప్పటికీ బీజేపీతో పొత్తులో ఉన్నామని చెబుతోంది. అయితే జరుగుతున్న పరిణామాలు మాత్రం.. ఆ పార్టీ టీడీపీ వైపు మొగ్గు చూపుతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. వైసీపీ నేతలూ నమ్ముతున్నారు. అందుకే ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు.
జగన్ కూడా ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ !
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒంటరిగా పోటీ చేయాలని రెండు పార్టీలకు సవాల్ చేశారు. ఒంటరిగా పోటీ చేయాలా.. కలిసి పోటీ చేయాలా అన్ని ఆయా రాజకీయ పార్టీల ఇష్టం. పొత్తులనేవి రాజకీయ పార్టీల్లో సహజం. కేంద్రంలో మోదీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ కూటమిని ఏర్పాటు చేసుకుంది. కానీ బీజేపీ ఎప్పుడూ ఒంటరిగా రావాలని కాంగ్రెస్ పార్టీని సవాల్ చేయలేదు. కూటమిగా పోటీ చేయడం వల్ల.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవు. మనది మెజార్టీ ప్రజాస్వామ్యం. మొత్తం వంద ఓట్లు ఉంటే.. యాభై ఒక్క ఓట్లు తెచ్చుకున్న వారికే గెలుపు రాదు. ఐదుగురు పోటీలో ఉండి.. ముగ్గురిరికి ఇరవై, ఒకరికి 19, మరొకరికి21 వస్తే .. 21 వచ్చిన వారిదే విజయం. మిగతా 79శాతం మందివ్యతిరేకంగా ఉన్నారు కదా అనే లాజిక్ మన ప్రజాస్వామ్యంలో ఇన్ వ్యాలీడ్. అందుకే పొత్తులు పెట్టుకుంటాయి. ఓట్లు చీలిపోవడం ద్వారా గెలుస్తామని సీఎం అనుకోవడం వల్లనే ఇలా సవాల్ చేస్తున్నారన్న అభిప్రాయం అంతకంతకూ బలపడుతోంది.
జగన్ సవాల్‌తో వైఎస్ఆర్‌సీపీపై నెగెటివ్ ప్రచారం!
సీఎం జగన్ ఉద్దేశం ఏదైనప్పటికీ.. టీడీపీ, జనసేన పార్టీ కలిస్తే గెలుపు కష్టమని నివేదికలు రావడం ద్వారానే జగన్ ఇలా సవాళ్లు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. వైఎస్ఆర్‌సీపీపై వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే.. రెండు పార్టీలు కలిసి పోటీ చేయడంపై ఎక్కువ కామెంట్స్ చేయకపోవడమే మంచిదన్న అభిప్రాయం రాజకీయ నిపుణుల్లో వినిపిస్తోంది.