Warangal Politics : సిట్టింగ్ లకే సీట్లైతే గులాబీ పార్టీలో ముసలం తప్పదా? ఓరుగల్లులో మారనున్న రాజకీయ సమీకరణాలు
Warangal Politics : ఈసారి కూడా సిట్టింగ్ లకే సీట్లు అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఉమ్మడి వరంగల్ రాజకీయ సమీకరణాలు మారుతున్నారు.
Warangal Politics : ఓరుగల్లులో రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. గులాబీ దళపతి నిర్ణయం గుబులు రేపుతుంది. సిట్టింగ్ లకే సీట్లని సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆశావాహులను ఆందోళనకు గురిచేస్తుందా? ఆశావాహులు ఎదురుతిరిగితే అధికార పార్టీకి ఎదురీత తప్పదా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ ఏడాదిలో జరగనున్న ఎన్నికలపై అప్పుడే చర్చ మొదలయ్యింది. భవిష్యత్తుకు బాటలు వేసుకునే పనిలో ఆశావాహులు నిమగ్నంకాగా, ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టేందుకు విపక్షాలు సిద్దమవుతున్నాయి. మారనున్న రాజకీయ సమీకరణాలపై పొలిటికల్ సర్కిల్ లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఉద్యమ ఖిల్లా లో రసవత్తరంగా రాజకీయాలు
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. రాబోయే కాలానికి కాబోయే లీడర్ నేనేనని తిరిగే నాయకులకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారు గులాబీ దళపతి సీఎం కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకే సీట్లని ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో ప్రకటించడం సిట్టింగ్ లకు కాస్త ఊరటనిచ్చినా, ఆశావాహులను మాత్రం ఆందోళనకు గురిచేస్తుంది. గులాబీ శ్రేణుల్లో గుబులుపుట్టిస్తుంది. సీఎం ప్రకటన బాగానే ఉన్నా, ఎప్పటి నుంచో టిక్కెట్ ఆశిస్తున్న వారి సంగతేంటన్న ప్రశ్న తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా టిక్కెట్లపైన చర్చించుకుంటున్నారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ కు వెన్నంటి ఉండి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పలు మార్లు పోటీకి దూరమైన నేతలను ఆలోచనలో పడేసి ఆందోళనకు గురిచేస్తుందట. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమవుతున్నారట.
12 నియోజకవర్గాల్లో 11 మంది అధికార పార్టీ ఎమ్యెల్యేలే
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో ములుగు మినహా 11 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. పదకొండులో ఏడు చోట్ల గులాబీ పార్టీలో పోటీ తప్పని పరిస్థితి నెలకొంది. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, వర్థన్నపేట, నర్సంపేటలో మాత్రమే పోటీ లేదు. మిగతా అన్ని చోట్ల సిట్టింగ్ లకు పోటీగా ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉద్యమనాయకులు మేమున్నామంటూ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పలు చోట్ల గతకొంతకాలం నుంచి రాజకీయంగా కత్తులు దూసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్గతంగా ఉన్న విబేధాలు పలు మార్లు బయట పడ్డాయి కూడా. ఎత్తుకు పై ఎత్తులతో టిక్కెట్ సాధించుకునే పనిలో గులాబీ నేతలు ఉండగా సిట్టింగ్ లకే మళ్లీ అవకాశం ఇస్తామని కేసీఆర్ ప్రకటించడం ఆశావాహులకు మింగుడుపడడం లేదు.
కొన్ని నియోజకవర్గాల్లో పోటా పోటీగా అభ్యర్థులు
స్టేషన్ ఘనపూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉండగా ఆయనకు పోటీగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి లేదా ఆయన కూతురు కావ్య టిక్కెట్ ఆశిస్తున్నారు. రాజయ్య, కడియం మధ్య నువ్వానేనా అన్నట్లు రాజకీయాలు నడుస్తున్నాయి. సీఎం నిర్ణయం మళ్లీ ఇద్దరి మధ్య వివాదానికి ఆజ్యం పోసినట్లయిందని స్థానిక నాయకులు భావిస్తున్నారు. అటు వరంగల్ తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా నన్నపనేని నరేందర్ కొనసాగుతున్నారు. అక్కడి నుంచి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాజ్యసభసభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మేయర్ గుండు సుధారాణి టికెట్ ఆశిస్తున్నారు. భూపాలపల్లిలో గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ లో చేరిన గండ్ర వెంకటరమణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కాగ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి టికెట్ రేసులో ఉన్నారు. అటు డోర్నకల్ లో సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఉండగా అక్కడి నుంచి మంత్రి సత్యవతి రాథోడ్ టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మహబూబాబాద్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ ఉండగా అక్కడ ఎంపీ కవిత టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వారి మధ్య విబేధాలు బజారుకెక్కాయి. ఇక పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా అక్కడి నుంచి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రైతువిమోచన కమిటీ చైర్మెన్ నాగుర్ల వెంకటేశ్వర్లు టిక్కెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. జనగాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉండగా అక్కడి నుంచి అవకాశం వస్తే పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ పోచంపల్లితోపాటు మరోనాయకుడు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
సిట్టింగ్ కే ఛాన్స్... ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభం
గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సీఎం కేసీఆర్ సిట్టింగ్ లకే సీట్లని ప్రకటించి కొండ సురేఖకు మొండి చేయి చూపించారు. వరంగల్ తూర్పు నుంచి నరేందర్ కు అవకాశం కల్పించారు. ఈసారి సైతం రెండు మూడు చోట్ల అభ్యర్థులను మార్చే అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అదే నిజమైతే సిట్టింగ్ లో సైతం గుబులు లేకపోలేదు. ఆశావాహుల ఆశలు సన్నగిల్లడం లేదు. సందెట్లో సడేమియాలా విపక్షపార్టీలు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కాచుకుని కూర్చున్నాయి. టిక్కెట్ రాక ఆలకబూనేది ఎవరని ఆరా తీస్తు వారిపై ప్రత్యేక దృష్టి సారించే పనిలో నిమగ్నమయ్యాయి. ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టి ఆశావాహులను తమ వైపు తిప్పుకునే వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఎన్నికల నాటికి గులాబీ గూటిలో ఉండేదెవరో ఊడిపోయే నేతలెవ్వరోనని జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ పదేపదే సిట్టింగ్ లకు టికెట్లు ఇస్తామని చెబుతున్నా, అది ఎంత వరకు నిజమౌతుందోనని ఓరుగల్లు ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.