Vijayawada Ysrcp Politics : బెజవాడ వైసీపీలో వర్గ విభేదాలు, మేయర్ ను అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గం!
Vijayawada Ysrcp Politics : బెజవాడ వైసీపీ వర్గవిభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే మల్లాది విష్ణు వర్గం మేయర్ ను ఉద్దేశపూర్వకంగా అవమానించారని మేయర్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తు్ంది.
Vijayawada Ysrcp Politics : బెజవాడ వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే వర్గం మేయర్ ను అడ్డుకునేందుకు యత్నించింది. దీంతో మేయర్ తీవ్ర మనస్థాపానికి గురై, అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనిపై బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. మేయర్ కు జరిగిన అవమానంపై వైసీపీ అధిష్టానం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బెజవాడ వైసీపీ నేతల్లో అంతర్గతంగా విభేదాలు ఉన్నా ఇప్పటి వరకు అవి బయటకు రాలేదు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో నేతల మధ్య గ్యాప్ స్పష్టం గా కనపడుతోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి విడదల రజనీతో పాటు స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. గతంలోనే ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో మేయర్ కు విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే పాల్గొనే కార్యక్రమాల్లో మేయర్ కూడా ప్రోటో కాల్ ప్రకారం హాజరు కావటం పరిపాటి. అయితే తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు మేయర్ ను ఆహ్వానించకూడదని గతంలోనే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రోటోకాల్ పాటించకపోతే అధికారులకు ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఎమ్మెల్యేకు నచ్చచెప్పుకొని అధికారులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్యే విష్ణు, మేయర్ కు మధ్య గ్యాప్ ఎందుకు?
అయితే ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మేయర్ రాయన భాగ్య లక్ష్మికి మధ్య విభేదాలపై వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చజరుగుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలు జరిగిన సమయంలో మేయర్ సమయాన్ని పాటించకపోవటం, ఎమ్మెల్యే వచ్చినా, కలెక్టర్ వచ్చినా మేయర్ ఆలస్యంగా రావటం, ఆమె కోసం ఎదురుచూపులు చూడాల్సి రావటం నేతలకు ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని మొదట్లోనే మేయర్ కు వివరించారు. అయితే ఆమె ఈ విషయాలను లైట్ తీసుకున్నారు. మేయర్ గా తనకు నగరం మెత్తం మీద అనేక కార్యక్రమాలు ఉంటాయని, ఎమ్మెల్యేగా మీకు మీ నియోజకవర్గంలోనే పనులు ఉంటాయని మోహమాటం లేకుండా అన్నారని ప్రచారం. దీంతో ఎమ్మెల్యే విష్ణుకు, మేయర్ కు మధ్య గ్యాప్ పెరిగింది. తప్పని పరిస్థితుల్లో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వాల్సిరావటంతో లోలోపల ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారిందట.
మేయర్ కు అవమానం ఎందుకు జరిగింది?
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి విడదల రజని, ఎమ్యెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి వచ్చేసరికి ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. దీంతో మేయర్ కార్యక్రమంలో పాల్లొనేందుకు వెళ్తుండగా ఎమ్మెల్యే వర్గం ఆమెకు దారి ఇవ్వకుండా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారని మేయర్ వర్గం చెబుతుంది. దీంతో ఆమె అక్కడ నుంచి వెనుతిరిగి వెళ్లిపోవాల్సి వచ్చిందట. అయితే మేయర్ ను అక్కడున్న అధికారులు కానీ, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు కానీ కనీసం ఆపేందుకు ప్రయత్నించకపోవటం కూడా మేయర్ అవమానకరంగా భావిస్తున్నారని చెబుతున్నారు.
మేయర్ కు జరిగిన అవమానంపై బీసీ సంఘాలు ఆగ్రహం
మేయర్ కు జరిగిన అవమానంపై స్థానిక జనసేన నాయకులు కూడా జోక్యం చేసుకున్నారు. వైసీపీలో బీసీలను కేవలం ఎన్నికలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారని, మేయర్ కు అవమానం జరిగినా వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడరని జనసేన నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. వైసీపీలో ఉంటే ఇలాంటివి రిపీట్ అవుతాయనటంలో సందేహం లేదని ఎద్దేవా చేశారు. మేయర్ కు జరిగిన అవమానంపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అగ్ర నాయకులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.