Kesineni Nani Vs Chinni : విజయవాడ టీడీపీలో బ్రదర్స్ వార్, ఈసారి అన్న సీటు తమ్ముడికిస్తారా?
Kesineni Nani Vs Chinni : విజయవాడ టీడీపీలో బ్రదర్స్ వార్ జరుగుతోంది. ఎంపీ కేశినేని నాని సోదరుడు చిన్ని స్థానికంగా యాక్టివ్ అవ్వడంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు సమాచారం.
Kesineni Nani Vs Chinni : విజయవాడ టీడీపీ(TDP)లో కొత్త నాయకుడి పేరు వినబడుతోంది. ఎంపీ సోదరుడిగా ఎంట్రీ ఇచ్చిన కేశినేని చిన్ని(Kesineni Chinni) ఇప్పుడు ఏకంగా ఎంపీ స్థానానికే గాలం వేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. పాతసీసాలో కొత్త నీరులా తయారయ్యింది బెజవాడ టీడీపీ పరిస్థితి. ఈ వ్యవహరం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బెజవాడ టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని(Kesineni Nani)కి కేశినేని శివనాద్ అలియాస్ చిన్ని స్వయాన సోదరుడు. ఎంపీగా కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని పోటీ చేసిన సమయంలో చిన్ని కీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులు, అన్న నాని గెలుపు అవకాశాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ, నాని గెలుపులో కీలకంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు తాజాగా చిన్ని పేరు తెర మీదకు వచ్చింది. ఇద్దరి మధ్య విభేదాలు రావటంతో కేశినేని నానికి దూరంగా ఉంటున్నారు చిన్ని.
స్టిక్కర్ గొడవ
ఇటీవల తన ఎంపీ కారు స్టిక్కర్ ను దుర్వినియోగం చేస్తున్నారంటూ విజయవాడ(Vijayawada) పటమట పోలీసులకు నాని ఫిర్యాదు చేశారు. దీంతో నాని, చిన్ని మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఆ తరువాత చిన్ని ప్రెస్ మీట్ పెట్టి నానికి కౌంటర్ ఇచ్చారు. ఇక కేశినేని నాని కుమార్తె వివాహం హైదరాబాద్ లో జరిగింది. ఆ వివాహానికి కూడా బాబాయి వరుస అయిన చిన్ని హాజరుకాలేదు. దీంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు బయటకు వచ్చాయి. ఈ వివాదం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశగా మారింది.
దూకుడు పెంచిన కేశినేని చిన్ని
మరోవైపు కేశినేని చిన్ని రాజకీయంగా దూకుడు పెంచారు. ఇందులో భాగంగానే ఎంపీ(MP) నియోజకవర్గం పరిధిలో ఉన్న శాసనసభ స్థానాలపై గురి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. టీడీపీకి పట్టు ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తిరువూరు, నందిగామ నియోజకవర్గాల పరిధిలో చిన్ని స్వయంగా పర్యటిస్తున్నారు. పార్టీ క్యాడర్ ను కలిసి ఇకపై యాక్టివ్ కావాలని పిలుపు నివ్వటంతో పాటు, తాను ఉన్నాననే భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదంతా ఎంపీ నానికి వ్యతిరేకంగా జరుగుతుందా అంటే మాత్రం పార్టీ నేతలు నోరు మెదపడం లేదు.
చిన్ని లైన్ క్లియర్
ఇప్పటికే తనకు పోటీ చేసే ఆలోచన, ఇష్టం రెండూ లేవని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. దీంతో చిన్నికి లైన్ క్లియర్ అయ్యిందని అంతా భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీలోని అగ్రనేతలతో పాటు, సామాజిక వర్గాల వారీగా ఉన్న నాయకులను కూడా చిన్ని కలుస్తున్నారు. చిన్ని కేశినేని నానిని విభేదించిన వర్గంతో ఎక్కువగా టచ్ లోకి వెళ్తున్నట్లు సమాచారం. పార్టీని బలోపేతం చేయటంతో పాటు ఎన్నికల్లో తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చిన్ని పావులు కదుపుతున్నారని స్థానిక నేతలు అంటున్నారు. ఎన్నికల నాటికి టీడీపీ బెజవాడ ఎంపీ స్థానంలో ఎవరు ఉంటారనేది, ప్రస్తుతానికి వేచి చూడాలి.