Vijayawada TDP MP : బెజవాడ బరిలో నిలిచేదెవరు? టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్త పేరు!
Vijayawada TDP MP : బెజవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిపై జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఎంపీ కేశినేని నాని పోటీకి విముఖత చూపడంతో గద్దె రామ్మోహన్ పేరు తెరపైకి వచ్చింది.
Vijayawada TDP MP : బెజవాడ టీడీపీ ఎంపీ పదవిపై ఆసక్తి నెలకొంది. ఇంతకు ముందు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన గద్దె రామ్మోహన్ ను తిరిగి పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయించాలనే ప్రతిపాదన తెరమీదకు వస్తోంది. ఇప్పటికే గద్దె విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఎంపీ కేశినేని వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న కారణంగా ఎంపీ అభ్యర్థి కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. బెజవాడలో టీడీపీ పటిష్టంగానే ఉన్నప్పటికీ నాయకుల మధ్య విభేదాలతో క్యాడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో అందరినీ కలుపుకొని వ్యూహత్మకంగా వ్యవహరించే నాయకుడు ప్రస్తుతం పార్టీకి అవసరం అన్న భావన కార్యకర్తల్లో కూడా ఉంది. దీంతో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న గద్దె రామ్మోహన్ అయితే, సౌమ్యుడిగా పనిచేస్తారనే అభిప్రాయం నేతల నుంచి వ్యక్తం అవుతోంది. అంతే కాదు గతంలో గద్దె ఎంపీగా ప్రాతినిద్యం వహించారు. ఆ అనుభవం ఇప్పుడు పార్టీకి అవసరం అనే భావనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీకి మెుదటి నుంచి విధేయుడిగా
గద్దె రామ్మోహన్ తొలి నుంచి పార్టీకి విధేయుడిగానే కొనసాగుతున్నారు. పార్టీ నుంచి పదవులు పొందిన అతి తక్కువ మందిలో గద్దె కూడా ఉన్నారు. ఒకేసారి భార్యా భర్తలకు పదవులు కూడా లభించాయి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గద్దె భార్య అనురాధకు కూడా జిల్లా పరిషత్ సీటును కేటాయించారు. ఎన్నికల్లో ఆమె విజయం సాధించటంతో కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని పార్టీ కట్టబెట్టింది. దీంతో ఒకేసారి భార్యా భర్తలు ఇరువురు పదవులను దక్కించున్నారు.
ఇప్పుడు అంత ఈజీ కాదు
వాస్తవానికి గడిచిన రెండు సార్లు టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వచ్చే 2024 ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసి విజయం సాధిస్తే హ్యాట్రిక్ అవుతుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వీచినప్పటికీ విజయవాడ తూర్పులో గద్దె విజయం సాధించారు. దీంతో బెజవాడలో టీడీపీకి కాస్త ఊరట లభించింది. అదే సమయంలో ఎంపీ స్థానంలో నిలబడిన కేశినేని నాని కూడా విజయం సాధించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రస్తుతం రాజకీయ వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. వైసీపీ బలంగా ఉన్న సమయంలో విజయవాడ ఎంపీ స్థానం దక్కించుకోవటం ఆషామాషీ కాదు. అయితే ఇప్పుడు బెజవాడ వైసీపీ ఎంపీ స్థానం ఖాళీగా ఉంది.
కొత్త అభ్యర్థి అయితే చిక్కులు!
2019లో వైసీపీ విజయవాడ ఎంపీగా పోటీ చేసిన, పొట్లూరి వర ప్రసాద్ పరాజయం తరువాత ఎక్కడా కనిపించకుండాపోయారు. దీంతో ఇప్పుడు వైసీపీ కూడా ఎంపీ అభ్యర్ది కోసం వేటలో ఉంది. అధికార పార్టీ కాబట్టి ఎంపీ స్థానం కోసం అభ్యర్థులు పోటీపడుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బెజవాడ టీడీపీకి ఎంపీ అభ్యర్థిగా కొత్త అభ్యర్థి అయితే ఇబ్బందులు తప్పవని టీడీపీ పార్టీ నాయకులు భావిస్తున్న తరుణంలో గద్దె రామ్మోహన్ వంటి వివాదరహితుడు అయితేనే మళ్లీ పార్టీ నెగ్గుకు వస్తుందని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
Also Read : Gorantla Madhav: ఒరిజినల్ వీడియో నాదగ్గరే ఉంది! టీడీపీకి ఆ దమ్ముందా? వాళ్ల మార్ఫింగ్ వీడియోలిస్తా? - గోరంట్ల