Vasundhara Raje: బీజేపీ పరివర్తన యాత్రకు వసుంధర రాజే డుమ్మా ! అధిష్టానం తీరుపై అలక
Vasundhara Raje: బీజేపీ పరివర్తన యాత్రకు ఆ పార్టీ నాయకురాలు వసుంధర రాజే డుమ్మా కొట్టారు. ఝలావర్ నియోజకవర్గంలో గురువారం సాయంత్రం జరిగిన బీజేపీ పరివర్తన యాత్రకు ఆమె గైర్హాజరయ్యారు.
Vasundhara Raje: బీజేపీ పరివర్తన యాత్రకు ఆ పార్టీ నాయకురాలు వసుంధర రాజే డుమ్మా కొట్టారు. గత 33 ఏళ్లుగా ఎంపీగా, ఎమ్మెల్యేగా వసుంధర రాజే ప్రాతినిధ్యం వహిస్తున్న ఝలావర్ నియోజకవర్గంలో గురువారం సాయంత్రం జరిగిన బీజేపీ పరివర్తన యాత్రకు ఆమె గైర్హాజరయ్యారు. తన సొంత గడ్డ హదోటి ప్రాంతంలో కోటా, బుండి, ఝలావర్ జరిగిన యాత్రలో ఆమె పాల్గొనలేదు. దీంతో ఆ పార్టీలో పలు సందేహాలను రేకెత్తిస్తోంది. పార్టీలో ఆమె భవిష్యత్తు ఏంటనే దానిపై విస్తృత చర్చ నడుస్తోంది.
యాత్రకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, వసుంధర రాజే తనయుడు దుష్యంత్ సింగ్ హాజరయ్యారు. కానీ వసుంధర రాజే గైర్హాజరు అయ్యారు. మామూలుగా ఈ ప్రాంతంలో వసుంధర రాజేకు భారీ ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె ఎప్పుడు బహిరంగ సభ పెట్టినా ప్రజలు భారీ ఎత్తున వస్తారు. అయితే ఈ సారి యాత్రలో ఆమె పాల్గొనకపోవడంతో అక్కడ నిర్వహించిన యాత్ర జనాలు లేక బోసిపోయింది. దీని ప్రభావం రానున్న ఎన్నికల్లో పడుతుందనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.
పార్టీ ప్రచారానికి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉదాహరణకు అస్సాంకు చెందిన హిమంత బిశ్వా శర్మ వంటి నేతలు యాత్రలో పాల్గొనడంతోనే వసుంధర రాజే ఈ కార్యక్రమానికి వెళ్లలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ వ్యక్తిగత కారణాలతో ఆమె గురువారం న్యూఢిల్లీలో ఉన్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
వసుంధర రాజే గైర్హాజరు గురించి హిమంత బిశ్వా శర్మను అడగ్గా ఆయన ఆ విషయాన్ని తోసిపుచ్చారు. భారత్ మాతా కి జై అని చెప్పినప్పుడు మనమంతా ఒక్కటేనని అన్నారు. ఆ సమయంలో అందరం కలిసి నిలబడతామంటూ బదులిచ్చారు. పరివర్తన్ యాత్రకు రాజే గైర్హాజరు కావడానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోవడమేనంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ అధికార ప్రతినిధి వికాస్ బర్హత్ ఖండించారు. ఎమ్మెల్యే రాజే ఢిల్లీలో ఉన్నారని, పార్టీ హైకమాండ్‌తో సమావేశాల్లో పాల్గొన్నారని అన్నారు.
వసుంధర రాజే విధేయులైన కోట నార్త్ మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజాల్, రాజావత్ మాజీ ఎమ్మెల్యే భవానీ సింగ్ రాజావత్ పరివర్తన్ రథం కోటలోకి ప్రవేశించినప్పుడు స్వాగతం పలికారు. అయితే వారిద్దరూ ఉమ్మాయిద్ సింగ్ వద్ద జరిగిన బహిరంగ సభకు వెళ్లలేదు. అస్సాం ముఖ్యమంత్రి శర్మ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. వేదికపై మాజీ మంత్రి ప్రభులాల్ సైనీ, కల్పనా రాజే, ఇతర స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కోటను బీజేపీకి కంచుకోటగా పరిగణిస్తారు. అయితే అక్కడ జరిగిన పరివర్తన్ యాత్రకు స్పందన లభించలేదు. ఇది పార్టీలో సఖ్యతలేదని సంకేతాలను అధిష్టానానికి పంపినట్లైంది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజస్థాన్ బీజేపీలో లుకలుకలు మొదలయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ చీలిపోయిందని ప్రచారం జరుగుతోంది. కొద్ది కాలంగా వసుంధర రాజే బీజేపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారట. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించకపోవడంతో హైకమాండ్‌పై అసహనంతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. తాజాగా బీజేపీ చేపట్టిన పరివర్తన్ యాత్ర ఇటీవలే రాజే సొంత నియోజకవర్గం, ఆమె అనుచరుల నియోజకవర్గాల్లో జరిగింది. అధిష్టానంపై ఉన్న ఆగ్రహంతోనే బీజేపీ చేపట్టిన యాత్ర, బహిరంగ సభల్లో వసుంధర రాజే పాల్గొనలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది.