(Source: Poll of Polls)
Andhra Special Status Issue : ఏపీకి ప్రత్యేకహోదా రాదు - తేల్చేసిన కేంద్ర మంత్రి - ఇక ఏపీ పార్టీలదే నిర్ణయం !
Special Status Politics : ఏపీకి ప్రత్యేక హోదా రాదని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తేల్చేశారు. తీర్మానాలు చేస్తే ఇచ్చేది కాదన్నారు. ఇప్పటికే ఏపీలో హోదా కోసం డిమాండ్ పెరుగుతోంది.
Union Minister Srinivasa Varma On Special Status : ప్రత్యేకహోదా అంశంపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్పందించారు. బీహార్‌కే కాదు ఏపీకి కూడా హోదా అనేది మంజూరు చేసే అంశం కాదన్నారు. తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం హోదా కాదని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియతో మాట్లాడిన ఆయన ప్రత్యేకహోదాకు బదులుగా కేంద్రం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేకంగా హోదా ఇవ్వాలంటే ప్రధాని నిర్ణయం తీసుకోవాలన్నారు. వైసీపీ వల్ల పోలవరం ప్రాజెక్టులో సమస్యలు వచ్చాయని .. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకారం ఉంటుందన్నారు.
టీడీపీ ప్రత్యేకహోదా డిమాండ్ చేయాలంటున్న ఇతర పార్టీలు
బీహార్ అధికార పక్షం జేడీయూ .. తమ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. దాంతో ఏపీ సీఎం చంద్రబాబు కూడా హోదా కోసం డిమాండ్ చేయాలని ఇతర పార్టీలు ప్రశ్నించడం ప్రారంభించాయి. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల ఈ అంశపై వరుసగా రెండు రోజుల పాటు స్పందించారు. చంద్రబాబు స్పందించాలని.. హోదా ఇవ్వకపోతే కేంద్రానికి మద్దతు ఉపసంహరించాలని అంటున్నారు. వైసీపీ నేతలు బహిరంగంగా మాట్లాడకపోయినా చంద్రబాబు హోదా అడగడం లేదని.. మాజీ సీఎం జగన్ పార్టీ నేతల అంతర్గత సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
హోదా ముగిసిపోయిన అధ్యాయమని సైలెంట్ గా ఉంటున్న టీడీపీ
మరో వైపు ఈ డిమాండ్లపై అధికార తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం స్పందించడం లేదు. ప్రత్యేకహోదా ముగిసిపోయిన అధ్యాయమన్నట్లుగా ఆ పార్టీ నేతలు ఉన్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ ప్రత్యేకహోదా హామీ ఇవ్వలేదు. అసలు ఆ టాపిక్ గురించి ప్రస్తావించకుండానే ఎన్నికలకు వెళ్లింది. అందుకే ఇప్పుడు హోదా అనేది పరిష్కారం కాని రాజకీయ సమస్య అని ఆ ట్రాప్‌లో చిక్కుకోవడం దండగ అని సైలెంట్ గా ఉంటోంది. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నందున వీలైనంత ఎక్కువగా ఆర్థిక సహకారం పొంది రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోవడమే లక్ష్యమని చెబుతున్నారు.
హోదా కోసం కాంగ్రెస్, వైసీపీ, ఇతర పార్టీలు ఉద్యమాలు చేస్తాయా ?
ప్రత్యేకహోదాను టీడీపీ డిమాండ్ చేయాలని.. కాంగ్రెస్, వైసీపీ ఇతర పార్టీలు ఉద్యమాలు చేయాలని అనుకుంటున్నాయి. రాక రాక అవకాశం వచ్చిందని టీడీపీ ఈ అంశంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని వారు కోరుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామంటున్న షర్మిల ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆమె హోదా అంశంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే వైసీపీ మాత్రం బహిరంగంగా ఏమీచేయలేకపోతోంది. హోదా అంశంపై పోరాడితే బీజేపీని ఇరుకున పెట్టినట్లే కాబట్టి సైలెంట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. పరిస్థితులు మారితే.. జగన్ కూా హోదా పోరాటం ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.