TRS Sentiment Politics : మళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని అందుకునే పనిలో టీఆర్ఎస్ - మోదీ మాటలతో రాజకీయ కార్యాచరణ !
రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లను మరోసారి తెలంగాణ సెంటిమెంట్ అస్త్రంతో అధిగమించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలనే అందుకు అస్త్రంగా ఉపయోగించుకుంటోంది. మరి మారిన పరిస్థితుల్లో వర్కవుట్ అవుతుందా ?
రాజకీయంగా పెను సవాళ్లు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి అచ్చి వచ్చిన అస్త్రాన్ని అందుకునే ప్రయత్నాలు చేస్తంది. అదే తెలంగాణ సెంటిమెంట్ ( Telangana Sentiment ). తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటి వరకూ సాధించిన విజయాలన్ని తెలంగాణ సెంటిమెంట్ పునాదుల మీదనే వచ్చాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యేక రాష్ట్ర నినాదంతో టీఆర్ఎస్ భారీ విజయాలు నమోదు చేసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అదే సెంటిమెంట్ వర్కవుట్ అయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ టీఆర్ఎస్‌ను ( TRS ) సెంటిమెంటే గట్టెక్కిందనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఇటీవల సెంటిమెంట్ తగ్గిందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో మరోసారి అ అస్త్రాన్ని తన అమ్ములపొదిలో చేర్చేందుకు టీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేయడం ప్రారంభించారు.
విభజనపై మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు - అందిపుచ్చుకున్న టీఆర్ఎస్ !
పార్లమెంట్‌లో రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్‌కు కలసి వస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి తారస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలను టీఆర్ఎస్ ( TRS ) ప్రారంభించింది. బుధవారం అంతా నిరసనలు చేపట్టారు... గురువారం ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. తెలంగాణను మోదీ అవమానించారని .. తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. విభజనకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడారన్న అభిప్రాయాన్ని ప్రజల్ోలకి బలంగా పంపేందుకు టీఆర్ఎస్ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
బీజేపీ గెలిస్తే ఉమ్మడి రాష్ట్రం చేస్తారనే ప్రచారం !
బీజేపీ గెలిస్తే ఏపీ, తెలంగాణను మళ్లీ కలిపేస్తారన్న ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు ఉధృతం చేస్తున్నారు. తలసాని, హరీష్ రావు లాంటి వాళ్లే మళ్లీ బీజేపీ వస్తే ఏపీ, తెలంగాణలను కలిపేసినా కలిపేస్తారన్న ఓ ప్రచారాన్ని ప్రజల్లోకి పంపేందుకు పదే పదే ఆ ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతోంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ అస్త్రం కాదు . అది పాతబడిపోయింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. స్వయం పాలన జరుగుతోంది. ఇటీవల ఏ ఎన్నికల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ వర్కవుట్ కావట్లేదు. నిజానికి టీడీపీ కాస్తో కూస్తో బలహీనంగా ఉన్నా.. ఆ పార్టీని చూపించి సెంటిమెంట్ రేపడానికి చాన్స్ ఉండేది. ఇప్పుడా పార్టీకి ఉనికి లేకుండా పోయింది. దీంతో టీఆర్ఎస్‌కు పెట్టని కోట లాంటి సెంటిమెంట్ అస్త్రం ఉపయోగపడటం లేదు.
టీఆర్ఎస్ చేతికి మోదీ సెంటిమెంట్ అస్త్రం ఇచ్చారా?
తమ సెంటిమెంట్ అస్త్రాన్ని ఎలాగోలా తెచ్చుకోవడానికి ప్రధాని మోడీ ( PM Modi )బ్రహ్మాండమైన అస్త్రాన్ని ఇచ్చారని టీఆర్ఎస్ గట్టి నమ్మకంతో ఉంది. అందుకే శక్తి మేర ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కొత్తగా రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తారని కూడా చెబుతోంది. టీఆర్ఎస్‌కు అంతకు మించిన గొప్ప సెంటిమెంట్ అస్త్రం దొరకదు. అయినా ముందుకెళ్తోంది. ఎంత మేర ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయితే అంత ఫలితం వస్తుంది. రాజకీయాల్లో విజయాలు అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే వస్తాయి. అలాంటి అవకాశం వచ్చిందని టీఆర్ఎస్ భావిస్తోంది. మరి అందిపుచ్చుకుంటుందా ?