BJP Janasena : జనసేనను పరిగణనలోకి తీసుకోని బీజేపీ పెద్దలు ! మిత్రుల మధ్య దూరం పెరిగిందా ?
టాలీవుడ్ హీరోలను పిలిచి మాట్లాడుతున్నారు కానీ పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్‌కు మత్రం సమయం ఇవ్వడం లేదు బీజేపీ పెద్దలు. పవన్‌కు బీజేపీకి మధ్య దూరం పెరిగిందా ?
BJP Janasena : భారతీయ జనతా పార్టీ ఏపీ రాజకీయాలను టార్గెట్ చేసిందో.. తెలంగాణ ఓటు బ్యాంకును లక్ష్యంగా పెట్టుకుందో కానీ సినిమా హీరోలను దువ్వుతోంది. ఎన్టీఆర్‌ను పిలిచి మాట్లాడారు. నితిన్‌తోనూ సంప్రదింపులు జరిపారు. అయితే పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు. బీజేపీ ఎందుకిలా వ్యవహరిస్తోంది? పవన్ ను అవమానిస్తున్నారా లేకపోతే పార్టీకి సంబంధం లేని వారితోనే చర్చలు జరుపుతున్నామని సందేశం పంపుతున్నారా ?
పవన్ కల్యాణ్‌ను ఇటీవలి కాలంలో కలవని అమిత్ షా !
బీజేపీ అగ్రనేతలకు సినిమాలంటే ఇష్టమో లేదో కానీ.. సినీ నటులంటే మాత్రం చాలా ఇష్టం. ఈ ఇష్టం మామూలు ఫ్యాన్స్ టైప్ కాదు. వారి వల్ల కలిగే రాజకీయ లాభం కోణంలో ఇష్టం ఉంటుంది. అందుకే ఎన్టీఆర్, నితిన్ లాంటి వాళ్లను ప్రత్యేకంంగా పిలిచి మరీ చర్చించారు అయితే ఇప్పుడు అందరికీ వస్తున్న సందేహం ఏమిటంటే.. తమతో పొత్తులో ఓ సూపర్ స్టార్ ఉండగా... పట్టించుకోకుండా మరో నటుడి వెంట ఎందుకు పడుతున్నారనేదే ! జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపగలరు. ఆ ప్రభావం ఫలితాలను మారుస్తుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. అలాంటి ఓ స్టార్ యాక్టర్ బీజేపీతో నేరుగా బంధంలో ఉన్నారు. అయితే ఆయనను అమిత్ షా పట్టించుకోవడం లేదు. అపాయింట్‌మెంట్ ఇస్తున్న సందర్భాలు కూడా తక్కువే. పవన్ కల్యాణ్ అమిత్ షాను కలిసింది చాలా తక్కువ. మంచి ప్రజాదరణ ఉన్న స్టార్.. కలవాలని వస్తే పెద్దగా ఆసక్తి చూపని అమిత్ షా.. పార్టీతో సంబంధం లేని స్టార్లకు మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారు.
పవన్ ను బీజేపీ ఎందుకు లైట్ తీసుకుంటోంది ?
పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టినా ఆయన తన రాజకీయంలో అంత సీరియస్ నెస్ చూపించలేకపోతున్నారని బీజేపీ భావిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. పార్ట్ టైమ్ రాజకీయాలు చేయడం.. స్పీచ్‌లలో క్లారిటీ లేకపోవడం.. అదే సమయంలో పవన్ రాజకీయ వ్యూహాలు గందరగోళంగా ఉండటం వల్ల బీజేపీ లైట్ తీసుకుంటోందన్న వాదన వినిపిస్తోంది.పవన్ కు ఉన్న అభిమాన గణం.. సామాజిక బలం.. ఎన్టీఆర్‌తో సమానంగా ఉంటాయి. కానీ పొత్తులో ఉన్న పవన్‌ను పట్టించుకోకుండా ఎన్టీఆర్‌వైపు అమిత్ షా మొగ్గు చూపడానికి కారణం.. ఇప్పటికి తన రాజకీయం ఏమిటో పవన్ కల్యాణ్ చూపించడమే. అందులో తేలిపోవడమనని భావిస్తున్నారు.
వాళ్లెవరూ బీజేపీలో చేరరు .. కానీ పవన్ మాత్రం బీజేపీకి బలం !
అమిత్ షా పిలిచి విందు ఇచ్చినంత మాత్రాన ఎన్టీఆర్ లేదా నడ్డా పిలిచారని నితిన్ బీజేపీలో చేరుతారనో.. బీజేపీకి మద్దతుగా మారుతాడనో అనుకోలేరు. కానీ బీజేపీ అగ్రనేతలు ఏది చేసినా తాత్కాలిక ప్రయోజనాల కోసం చేయరు. దూరదృష్టితోనే చేస్తారు. ఈ రాజకీయాల్లో అంతే స్టార్ డం ఉన్న పవన్‌ను మాత్రం లైట్ తీసుకుంటున్నారు. కానీ ఆ స్టార్ల కన్నా పవన్ కల్యాణ్ వల్లే బీజేపీకి ఎక్కువ లాభం ఉంటుంది. ఆ విషయం బీజేపీ పెద్దలకు తెలియనిది కాదు. కానీ బీజేపీ.. జనసేన మధ్య ఉన్న ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటం వల్లే వారి మధ్య దూరం పెరిగిపోతోందన్న వాదన ఎక్కువ వినిపిస్తోంది.