KCR Birthday Special : కేసీఆర్ అంటే తెలంగాణ - తెలగాణ అంటే కేసీఆర్ !
అసాధ్యమనుకున్న స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సారి పుట్టిన రోజు మరింత సంబరంగా చేస్తున్నారు. ఆయన జాతీయ రాజకీయాలపై గురి పెట్టడమే దీనికి కారణం.
కేసీఆర్ .. ఈ మూడు అక్షరాలే తారక మంత్రం. తెలంగాణ సాధించారు. ప్రజల స్వప్నాల్ని నెరవేర్చారు. మాటలతో మాయ చేయగలరు. ప్రజల గుండెల్లో గూడు కట్టుకోగలరు. తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ ( KCR ) అంటే తెలంగాణ అన్నట్లుగా ఎదిగిన కేసీఆర్ పుట్టిన రోజును టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా చేసుకుంటున్నాయి.
తెలంగాణ ప్రజలకు ఏం కావాలో కేసీఆర్‌కు బాగా తెలుసు !
తెలంగాణ ( Telangana) ప్రజలకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే వినూత్నమైన పథకాలు అమల్లోకి తెచ్చారు. రైతుబంధు లాంటి పథకాలను కేంద్రం కూడా వేరే పేర్లతో ప్రకటించాల్సి వచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనైతే కేసీఆర్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ( Kaleswaram ) కేసీఆర్ పట్టుదలకు నిదర్శనంగా కనిపిస్తోంది. తానే ఇంజినీర్ అయి ప్రాజెక్టు ఆనుపానులన్నీ అధ్యయనం చేసి ప్రాజెక్టులను రీడిజైన్ చేసి ... ఐదేళ్లలోనే ఓ రూపునకు తీసుకు రావడం అసాధారణమైన విషయం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఓ ఇంజనీరింగ్ అద్భుతం. గోదావరిని రివర్స్ పంపింగ్ చేయ డం.. భారీ పంపులు.. మోటర్లు బిగించడం, సొరంగాలను తవ్వడం , విద్యుత్ సౌకర్యం కల్పించడం. ఓ పద్దతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది చివరి దశకు వచ్చింది.
విద్యుత్, నీరు లాంటి సమస్యలు లేకుండా చేసిన పాలనా దక్షత !
విద్యుత్ వ్యవస్థలో ( Power Sector ) ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలైతే ఎవరూ ఊహించలేదు. రాష్ట్రం ఆవిర్భవించిన ఆరు నెలల్లోనే ఉన్న ఉత్పత్తికి రెట్టింపు డిమాండ్ ఉన్నచోట కోతలులేని కరంట్‌ని ఇస్తున్నారు. దేశంలోనే వ్యవసాయరంగానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకోగలో.. అంతే పట్టుదలగా అమలు చేయగలరు కేసీఆర్. ఆయన అడుగులో ఆలోచనలో ఆవరించింది బంగారు తెలంగాణ స్వప్నమే. అది సాకారం చేసుకోవడం కోసమే ఆయన తపన. ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాలి. రాష్ర్టానికి వస్తున్న సంపదను ప్రజలకు పంచగలగాలి. అదే కేసీఆర్ చేస్తున్నారు. ప్రజల మన్ననలు పొందుతున్నారు.
విమర్శలెన్ని వచ్చినా ఆయన పాలనా స్టైల్ అంతే !
పాలన విషయంలో.. ఆయనపై ఎన్నో విమర్శలు ఉండవచ్చు. సెక్రటేరియట్ కు వెళ్లరని రాజకీయ ప్రత్యర్థుల్ని వేధిస్తారని ఏదైనా రాజకీయ కోణంలోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని.. ఇలా రకరకాల విమర్శలు ఉన్నాయి. అయితే ఏం చేసినా ప్రజల ఆదరణ పొందే విషయంలో వారి మద్దతు పొందేందుకు ఆయన తెలంగాణ ప్రజల మనసుల్ని చదివినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు. అదే ఆయనను తెలంగాణలో ఎవరూ అందుకోని ఇమేజ్ ఉన్న మాస్ లీడర్‌గా ( Mass Leader KCR ) నిలబెడుతోంది.
ఈ సారి కేసీఆర్‌కి ఇది స్పెషల్ బర్త్ డే !
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సారి ప్రత్యేకమైన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సారి ఆయన ఢిల్లీకి గురి పెట్టారు. బీజేపీకి ( BJP ) వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి కట్టే ప్రయత్నంలో ఉన్న ఆయనకు ఎదురొచ్చిన తొలి బర్త్ డే ఇది. రాజకీయాల్లో ప్రజల మద్దతు ఉంటేనే ఎవరికైనా విజయాలు. ఈ విషయం కేసీఆర్‌కు తెలుసు. అందుకే తెలంగాణ ప్రజలు పంపిస్తే ఢిల్లీ కోటను బద్దలు కొడతానని చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రజలు తనకు మద్దతు ఇచ్చేలాగా ట్యూన్ చేసుకుంటున్నారు. ఇప్పటికి ఆ విషయంలో ముందడుగు వేశారు. ప్రజలు తనకు మద్దతుగా ఉన్నారని నిరూపించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ బర్త్ డే ను చాలా స్పెషల్‌గా నిర్వహిస్తున్నాయి. జాతీయ నేత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్‌కు ఈ ఏడాది అత్యంత కీలకం. ఈ పుట్టిన రోజు ముగిసిన తర్వాతి నుండే ఆయన జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టబోతున్నారు. గతంలో ఎన్నో సాధించిన పుట్టిన రోజులు చేసుకున్నారు కానీ.. ఈ సారి సాధించడానికి సన్నద్ధమయ్యే దశలో పుట్టినరోజు చేసుకుంటున్నారు.
సీఎం కేసీఆర్‌కు ఆర్భాటంగా పుట్టిన రోజులు జరుపుకోవడం అలవాటు లేదు. ఆయన కుటుంబసభ్యులతో ప్రత్యేక పూజలు మాత్రమే చేస్తారు. అయితే పార్టీ నేతలు మాత్రం ప్రతీ గల్లీలో తమ అభిమాన నేత పుట్టిన రోజును పండుగలా చేస్తున్నారు.