Tirupati Bank Elections : తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో యథేచ్చగా రిగ్గింగ్ - సెల్ఫీ వీడియో వైరల్ !
తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయి. రిగ్గింగ్ చేస్తూ కొంత మంది యువకులు సెల్ఫీ వీడియో తీసుకున్నారు.
Tirupati Bank Elections : తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు గందరగోళంగా జరిగాయి. బ్యాలెట్ పేపర్లను కట్టలుగా దగ్గర పెట్టుకుని దొంగ ఓట్లు వేస్తూ కొంత మంది యువకులు సెల్ఫీ వీడియో తీసుకోవడం కలకలం రేపుతోంది. బ్యాలెట్ పేపర్లతో కొంత మంది యువకులు..స్వస్తిక్ ముద్రలతో సహా .. ఓటింగ్ వేసే ఇంక్ దగ్గర పెట్టుకుని ఓట్లు గుద్దుకోవడం వీడియోలో స్పష్టంగా ఉంది. వీడియో కూడా వారే తీసుకున్నట్లుగా తెలస్తోంది. ఈ వీడియో ..పోలింగ్ ప్రారంభమైన కాసేపటి నుంచే వైరల్ అయింది.
టౌన్ బ్యాంక్ ఎన్నికలు మొత్తం దొంగ ఓట్లతోనే నిర్వహించారని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎస్.జి.ఎస్ ఆర్ట్స్ కళాశాల వద్ద ధర్నా చేశారు. టౌన్ బ్యాంక్ ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు నిర్వహించిన రిటర్నింగ్ అధికారికి .. టీడీపీ మద్దతు ఉన్న అభ్యర్థులందరూ వినతి పత్రం అందించారు. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైసిపి ఖూనీ చేసిందని.. అప్రజాస్వామికంగా జరిగిన టౌన్ బ్యాంకు ఎన్నికలను రద్దు చేయాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల రద్దు కోసం ఖాతాదారులతో కలిసి టిడిపి పోరాటం చేస్తుందని ప్రకటించారు.
తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో మొత్తం 88 శాతం ఓటింగ్ జరిగింది. ఇది ఎలా సాధ్యమని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఓటర్లు ఈ స్థాయిలో ఓట్లు వేయలేదన్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతల అక్రమాల వల్లనే ఈ స్థాయి ఓటింగ్ జరిగిందని మండిపడ్డారు. టౌన్ బ్యాంక్ డిపాజిట్లపై సీఎం జగన్ కన్ను పడింది.. టౌన్ బ్యాంక్ డిపాజిట్లు దోచుకునేందుకే వైసిపి నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చారని టీడీపీ నేతలు నేతలు ఆరోపిస్తున్నారు. డిపాజిటర్లతో కలిసి ఎన్నికల రద్దుకు ఉద్యమం చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో న్యాయపోరాటం కూడా చేస్తామని అంటున్నారు.
తిరుపతి సహకార బ్యాంక్ ఎన్నికలు ఉదయం నుంచి ఉద్రిక్తంగా సాగాయి. టీడీపీ మద్దతు ఉన్న అభ్యర్థులు.. టీడీపీ నేతల్ని పోలీసులు గృహనిర్బంధం చేశారు. పలు చోట్ల పోలీసులు దూకుడుగా ప్రవర్తించారు. ఇలా అయితే అసలు ఎన్నికలు పెట్టడం ఎందుకని.. నేరుగా విజేతగా ప్రకటించుకోవచ్చు కదా అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అయినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. టీడీపీ నేతలే అక్రమాలకు పాల్పడి వైఎస్ఆర్‌సీపీపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. గెలుపు తమ మద్దతు దారులదేనన్నారు.