Nagarjuna YSRCP : నాగార్జున విజయవాడ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థా ? నిజం ఏమిటి ?
నాగార్జున వైఎస్ఆర్‌సీపీ తరపున విజయవాడ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందంటే?
Nagarjuna YSRCP : వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ఆర్‌సీపీ తరపున హీరో అక్కినేని నాగార్డున బరిలోకి దిగబోతున్నారన్న ఓ ప్రచారం రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతోంది. వైఎస్ఆర్‌సీపీకి చెందిన కొంత మంది నేతలు ఈ అంశంపై హింట్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో ఈ వార్త విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. నాగార్జున పోటీ చేస్తే విజయవాడలో పరిస్థితి ఎలా ఉంటుందా అని విశ్లేషణలు కూడా చేస్తున్నారు. గత రెండు సార్లు విజయవాడ నుంచి టీడీపీ తరపున కేశినేని నాని ఎంపీగా గెలిచారు. రెండు సార్లు పారిశ్రామికవేత్తలను వైఎస్ఆర్‌సీపీ బరిలోకి దింపింది. కానీ గెలవలేకపోయారు. తర్వాత వారు రాజకీయాల్లో అంత చురుగ్గా లేరు.
విజయవాడలో బలమైన అభ్యర్థి అవుతారని వైఎస్ఆర్‌సీపీ అధినేత ఆలోచన !
వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే కసరత్తు చేస్తున్న సీఎం జగన్ .. అభ్యర్థుల ఎంపికపై ఓ అవగాహనకు వస్తున్నారు. ఇప్పటికే కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించడంతో పాటు కొత్తగా ఎవరెవర్ని ఎక్కడెక్కడ పోటీ పెట్టాలో డిసైడ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ సీటు విషయంలో మరింత గట్టిగా ప్రయత్నించాల్సి ఉందని.. స్టార్ హీరో అయితే ప్లస్ అవుతుందన్న అంచనాల్లో వైసీపీ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే నాగార్జున పేరును పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. పరిశీలన దశలోనే ఉందని.. ఇంకా ఖరారు కాలేదని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని నాగార్జున
అయితే నాగార్జున ఇంత వరకూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ రాలేదు. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డికి ఆప్తమిత్రుడు.ఈ విషయాన్ని ఆయనే ప్రకటించుకున్నారు. సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం ఏర్పడినప్పుడుఓ సారి నాగార్జున ఒంటరిగానే సీఎం జగన్ ను కలిశారు. చూసి చాలా రోజులు అయిందని అందుకే కలిశానని చెప్పారు. జగన్, నాగార్జున మధ్య సన్నిహిత సంబంధాలు.. ఉన్నాయని..జగన్ అడిగితే నాగార్జున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే నాగార్జునకు రాజకీయాలపై ఆసక్తి ఉందో లేదో స్పష్టత లేదు. ఆయన వైపు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.
జగన్‌తో మంచి స్నేహ సంబంధాలు ఉన్న నాగార్జున
నిజానికి గతంలోనూ నాగార్జునను లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెడతారని ప్రచారం జరిగింది. కానీ కార్యరూపంలోకి రాలేదు. వైఎస్ఆర్‌సీపీకి నాగార్జున పరోక్ష మద్దతు ప్రకటించి ఉంటారు కానీ ప్రత్యక్షంగా ఎప్పుడూ మద్దతివ్వలేదు. మోహన్ బాబు తన ఫ్యామిలీతో కలిసి అధికారికంగా వైఎస్ఆర్‌సీపీలో చేరారు కానీ నాగార్జున ఎప్పుడూ చేరలేదు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర వరకూ సమయం ఉంది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అటు వైఎస్ఆర్‌సీపీ కానీ.. ఇటు నాగార్జున కానీ స్పందించే అవకాశాలు లేవు .