పలాస వైసీపీలో తారాస్థాయికి విభేదాలు- టీడీపీ వైపు మంత్రి సీదిరి ప్రత్యర్థులు చూపు
పలాస వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. సొంత పార్టీ నాయకులనే వేధిస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజుపై ఇప్పటికే పలాస లీడర్లు కోపంగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి వారంతా భేటీ అయ్యారు.
శ్రీకాకుళం జిల్లాలోని పలాస రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ వాతావరణం అక్కడ ఉంది. అధికారం అండతో రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు దూకుడుగా వ్యహరిస్తుండగా ప్రజాసమస్యలే అజెండాగా టీడీపీ ఇన్‌ఛార్జి గౌతు శిరీష అదే స్థాయిలో దూసుకువెళ్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో పలాస పేరు వినిపిస్తూనే ఉంటుంది.
అయితే ఇప్పుుడు వైసీపీలోనే ఏర్పడ్డ విభేదాలతో మరోసారి పలాస టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచే గ్రూపుల గోల ఉండనే ఉంది. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న వారంతా ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఉనికి చాటుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్లంతా మంత్రి సీదిరి అప్పలరాజును టార్గెట్ చేస్తున్నారు. మంత్రి వైఖరితో నాలుగేళ్లు విసిగిపోయామంటున్నారు.
వైసీపీకి మొదటి నుంచి దన్నుగా ఉన్న నాలుగు మండలాల్లోని కీలక నాయకులంతా మంత్రికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. పార్టీలో ఉంటూనే మంత్రికి ప్రత్యర్థులుగా పని చేస్తున్నారు. పార్టీ కోసం మొదట నుంచి పని చేసిన వారికి విలువ ఇవ్వడం లేదని వాపోతున్నారు. కక్ష కట్టి అణిచివేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు అండ్ టీంపై ఆరోపణలు చేస్తున్నారు.
పలాస పరిధిలో మండలాలు, మున్సిపాల్టీలో కూడా అసమ్మతి నేతలంతా మంత్రి సీదిరి అండ్ టీంపై అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. మంత్రి అప్పలరాజు అనుచరులు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇలా రెండు గ్రూపుల మధ్య విభేదాలు పీక్స్‌కు చేరాయి.
మంత్రి చేతిలో అధికారులు ఉన్నారన్న కారణంతో అసమ్మతి నేతలంతా కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యారు. అధిష్ఠానం కూడా అప్పలరాజుకే అనుకూలంగా ఉండడంతో ఏం చేయలేకపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న టైంలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు వారి చూపు తెలుగుదేశం పార్టీ వైపు పడినట్లుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన నాయకులు వైసీపీలో అసమ్మతి నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్టు చర్చ జరుగుతుంది. ఆ పార్టీకి దూరంగా ఉంటున్న నేతలతో రాయబారాలు సాగిస్తున్నారట.
వైసీపీకి చెందిన సీనియర్ కౌన్సిలర్, అసమ్మతి నేత దువ్వాడ శ్రీకాంత్‌ను టీడీపీ నేతలు కలుసుకున్నారు. వారి మధ్య తాజా రాజకీయాలపై చర్చ జరిగింది. టీడీపీలోకి ఆహ్వానించినట్టుగా సమాచారం. మంత్రి సీదిరి అప్పలరాజుని వ్యతిరేకించి వైసీపీకి దూరంగా ఉంటున్నారో వారితో టీడీపీ టీం మాట్లాడుతోంది. అటువంటి వారు టీడీపీలో చేరితే సీదిరి అప్పలరాజుకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అసమ్మతినేతలను కలుపుకునేందుకు సిదిరి నుంచి ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదని తెలుస్తోంది.