Padayatra Tension : వద్దన్న పోలీసులు - చేస్తామంటున్న బీజేపీ ! పాదయాత్ర రాజకీయంలో టెన్షన్ టెన్షన్ !
ప్రజాసంగ్రామ యాత్ర ఆపాలని పోలీసులు నోటీసులిచ్చారు. ఆపేది లేదని బీజేపీ నేతలంటున్నారు. రేపేం జరగబోతోంది ?
Padayatra Tension : తెలంగాణ రాజకీయాల్లో పాదయాత్ర టెన్షన్ ప్రారంభమయింది. అనుమతులు లేవని.. రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ ఆరు నూరైనా సరే పాదయాత్ర చేసి తీరుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తే లేదని.. పాదయాత్ర వ్యవహారాలను చూస్తున్న జి.మనోహర్ రెడ్డి, జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ ప్రకటించారు. పోలీసుల అనుమతితోనే గత మూడు విడతలుగా పాదయాత్ర కొనసాగిస్తున్నామని స్ఫష్టం చేశారు. అప్పుడు లేని అభ్యంతరాలు... ఇప్పుడెందుకు? ఎన్ని అడ్డంకులు ఎదురైనా... ఎన్ని ఆంక్షలు పెట్టినా పాదయాత్ర కొనసాగించి తీరుతామని తెలిపారు.
ఆరు నూరైనా పాదయాత్ర చేస్తామంటున్న బీజేపీ
మూడో విడత పాదయాత్ర యాదాద్రి నుంచి ప్రారంభించామని అనుకున్న షెడ్యూల్ ప్రకారం భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు పాదయాత్ర కొనసాగిస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. ఈనెల 27న హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామని.. పాదయాత్ర ముగింపుకు సభకు జేపీ నడ్డా హాజరుకాబోతున్నారని బీజేపీ నేతలు ప్రకటించారు. పోలీసుల తీరుపై తెలంగామ గవర్నర్‌ను ఫిర్యాదు చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈ ఉదయమే బండి సంజయ్‌ను స్టేషన్ ఘన్‌పూర్ నుంచి అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఇంటి వద్ద విడిచి పెట్టిన పోలీసులు కాసేపటికే పాదాయత్ర నిలిపివేయమని నోటీసులు ఇచ్చారు.
పాదయాత్ర చేస్తే చట్టపరమైన చర్యలు ఖాయమన్న పోలీసులు
వరంగల్ కమిషనరేట్ నుంచి పాదయాత్ర నిలిపివేత నోటీసులు జారీ అయ్యాయి. జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసులో పోలీసులు తెలిపారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని, ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేశారు. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరించారు.
బుధవారం పాదయాత్ర ఉద్రిక్తత ఏర్పడనుందా ?
ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయంగా ఉద్రిక్త పరిస్థిులు ఏర్పడ్డాయి. .ఈ క్రమంలో బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన అంశం ఢిల్లీ స్థాయికి చేరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. అయితే సంజయ్‌ను అరెస్ట్ చేసినా... కేసులేమీ లేకుండా.. ఇంటి దగ్గర విడిచి పెట్టారు. ఇప్పటికే యువత అంతా పాదయాత్రకు తరలి రావాలని.. పాదయాత్ర ఆగదని..బండి సంజయ్ కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో మరిన్ని ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బండి సంజయ్‌తో పాటు బీజేపీ నేతల్ని కూడా హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బిస్తర్ పట్టుకుని పాదయాత్రకు వచ్చేయండి - తెలంగాణ యువతకు బండి సంజయ్ పిలుపు !