KCR National Politics : కొత్త జాతీయ పార్టీ వైపు కేసీఆర్ మొగ్గు ! ప్లీనరీలో ప్రకటించబోతున్నారా?
టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే సుదీర్ఘమైన కసర్తతును కేసీఆర్ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం జరుపుకుంటోంది. అయితే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముద్ర ఎక్కడా కనిపించడం లేదు. అంతా కేటీఆరే కనిపిస్తున్నారు. పార్టీ లక్ష్యాలు.. భవిష్యత్ కార్యాచరణ.. అలా అన్నింటినీ కేటీఆరే వివరిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ పూర్తి స్థాయిలో చార్జ్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. మరి కేసీఆర్ ఏం చేస్తున్నారు ? ఏం చేయబోతున్నారు ? ప్లీనరీలోనే క్లారిటీ ఇస్తారా ?
జాతీయ రాజకీయాల్లో తన పాత్రపై స్పష్టత ఇవ్వనున్న కేసీఆర్ !
తెలంగాణలో కేసీఆర్ స్థానంలో రాజకీయం చేయబోయేది కేటీఆర్ అని చాలా కాలం క్రితమే స్పష్టత వచ్చింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత కేటీఆర్ మెల్లగా తండ్రికి తగ్గ తనయుడిగా సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. పార్టీని ఒంటి చేత్తో నడుపుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్నారని చెబుతున్నారు. ఆ క్రమంలో చాలా కాలంగా కసరత్తు చేస్తున్న కేసీఆర్ ప్లీనరీ వేదికగా టీఆర్ఎస్ సరికొత్త ప్రస్థానాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జాతీయ రాజకీయాలు. తెలంగాణ వాదంతో ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్. ఆ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లడం కన్నా కొత్త జాతీయ పార్టీని ప్రకటించి.. ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ విషయాన్ని ప్లీనరీ వేదికగా ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి.
జాతీయ పార్టీని ప్రకటించి ప్రజల్లోకి వెళ్తారా?
కేసీఆర్ కొంత కాలంగా కేవలం జాతీయ రాజకీయాలపై మాట్లాడాతున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని కోరుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు దేశాన్ని భ్రష్టు పట్టించాయని పాలన తీరు మారాలని.. తానే మారుస్తానని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెసేతర..బీజేపీయేత కూటమి కోసం ప్రయత్నించారు. కానీ వర్కవుట్ కాలేదు. అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ లేదా బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాయి. ఏ పార్టీతో కలవని పార్టీలు ఎన్నికల ఫలితాల తర్వాత తమకు లభించే సీట్లు.. అవి ఢిల్లీ నెంబర్ గేమ్‌లో ఎంత కీలకం అవుతాయి అన్న అంశాన్ని బేరీజు వేసుకుని రాజకీయం చేయాలనుకుంటున్నాయి. దీంతో కేసీఆర్ కూటమి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే కేసీఆర్ ఇలా కూటమి కంటే జాతీయ పార్టీ పెట్టడం మేలని చాలా కాలంగా ఆలోచిస్తున్నారు.
రైతు ఎజెండాతో జాతీయ స్థాయిలో కేసీఆర్ రాజకీయాలు చేయబోతున్నారా ?
"నయా భారత్" పేరుతో కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నట్లుగా కొంత కాలం కిందట ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ ఖండించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన జాతీయ రాజకీయాల్లోకి జాతీయ పార్టీ ద్వారానే వెళ్లాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వివిధ రాష్ట్రాల పర్యటనలకు వెళ్లినప్పుడు " దేశ్ కీ నేత " అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు . ఢిల్లీ రైతు దీక్షలోనూ అదే నినాదం వినిపించింది. కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో హిందీలో ప్రసంగించి ఉత్తరాది ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కొత్త పార్టీ ప్రకటించి రైతు ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై బుధవారం ప్లీనరీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.