Telangana September 17th Heat: తెలంగాణలో సెప్టెంబర్ 17 హీట్- మూడు పార్టీల పోటాపోటీ సభలు
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. సెప్టెంబర్ 17న మూడు పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలతో టెన్షన్ నెలకొంది. BJP విమోచన వేడుక అంటుంటే.. BRS సమైక్యత అంటోంది. ఇక, 17న భారీ బహిరంగసభకు సిద్ధమవుతోంది కాంగ్రెస్.
తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్ 17 సెగ రాజుకుంది. అధికార, ప్రతిపక్షాలన్నీ.. బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించాయి. బీజేపీ హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో సభ నిర్వహిస్తోంది. ఇందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాని ముఖ్య అతిథిగా తీసుకురావాలని యోచిస్తోంది. ఇక, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం పేరుతో వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్న ఆ పార్టీ.. సోనియాగాంధీ నేతృత్వంలో తుక్కుగూడలో ఈ నెల 17న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఇప్పుడు బీఆర్‌ఎస్ కూడా.. జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. మూడు పార్టీల పోటాపోటీ సభలతో... సెప్టెంబర్ 17న.. ఏం జరగబోతోందన్న టెన్షన్ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
సెప్టెంబరు 17న జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించబోతున్న బీఆర్‌ఎస్... పార్టీ పరంగా ఈ వేడుకలు నిర్వహించాలని నాయకులకు పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ముఖ్యులు జాతీయ జెండా ఎగురవేయనున్నారు. మరోవైపు, ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుగనుంది.
కమలం పార్టీ నేతలు కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తలపెట్టిన సభను వీలైన మేరకు భారీగా నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న... తెలంగాణ విమోచన దినోత్సవానికి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పంపినట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న వేడుకకు అందరూ హాజరుకావాలని ఆయన కోరారు. ఇక, సెప్టెంబర్17ను తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం పేరుతో వేడుకలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు తుక్కుగూడలో తలపెట్టిన భారీ సభను సుమారు పది లక్షల మందితో నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇదే సభ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలకు సోనియాగాంధీ కాంగ్రెస్‌పార్టీ తరఫున ఐదు గ్యారంటీలను ప్రకటించనున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్... మూడు పార్టీల సభలకు హైదరాబాద్ వేదికకానుంది.
సీపీఎం ఈనెల పదో తేదీ నుంచి 17 వరకు వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తోంది. సీపీఐ కూడా ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తోంది. 17న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ జరుపనుంది. మజ్లిస్ పార్టీ కీలక కూడా కీలక నిర్ణయం తీసుకుంది. భారత యూనియన్‌లో హైదరాబాద్ విలీనం అయిన సెప్టెంబరు 17వ తేదీని జాతీయ సమైక్యత దినంగా జరపాలని నిశ్చయించింది. ఆ రోజు హైదరాబాద్‌లో బైక్ ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించేందుకు విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో... సెప్టెంబర్ 17 అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ సమావేశాలు, సభలతో... టెన్షన్ నెలకొంది. ఒకే రోజు... మూడు ప్రధాన పార్టీల సభలు ఉండటంతో... పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.