Telangana Phone Tapping Case: ఏ1గా కేసీఆర్, ఏ2గా కేటీఆర్ పేర్లతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఛార్జ్‌షీట్ రెడీ? - తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెగ!
SIT Final Additional Chargesheet : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తుది అదనపు ఛార్జ్‌షీట్‌పై కీలక ప్రచారం జరుగుతోంది. ఏ1గా కేసీఆర్, ఏ2గా కేటీఆర్, హరీష్ రావుల పేర్లు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది.

BRS vs Congress Phone Tapping Controversy : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు అత్యంత కీలక దశకు చేరుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం రూపొందిస్తున్న తుది అదనపు ఛార్జ్‌షీట్‌లో బీఆర్ఎస్ అగ్రనేతల పేర్లను చేర్చనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నివేదికల ప్రకారం, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ను ఏ1 గా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ2గా పేర్కొంటూ సిట్ అభియోగపత్రాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మాజీ మంత్రి టి. హరీష్ రావు, ఎమ్మెల్సీ కె. నవీన్ రావుల పేర్లను కూడా ఈ అదనపు ఛార్జ్‌షీట్‌లో చేర్చే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి.
618 ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్లుగా గుర్తింపు
ఇప్పటివరకు ఈ కేసులో మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ టి. ప్రభాకర్ రావు సహా ఆరుగురు పోలీసు అధికారుల ప్రమేయంపైనే ప్రధానంగా విచారణ సాగింది. అయితే, తాజాగా దర్యాప్తు పరిధిని రాజకీయ నాయకత్వం వైపు విస్తరిస్తూ సిట్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఎస్ఐబీలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి, రాజకీయ ప్రత్యర్థులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులకు చెందిన సుమారు 618 ఫోన్ నంబర్లను అక్రమంగా ట్యాప్ చేశారని, దాదాపు 2,500 సంభాషణలను నిఘా ఉంచారని దర్యాప్తు సంస్థలు సేకరించిన ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా ఈ ఛార్జ్‌షీట్ రూపొందుతున్నట్లు సమాచారం.
సిద్ధిపేటలో కొత్తగా కేసు
మరోవైపు, ఇటీవల సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తదితరులపై కొత్తగా నమోదైన ఎఫ్‌ఐఆర్ క్రైమ్ నంబర్ 496/2026 కూడా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామాలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందిస్తూ, అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ కక్షసాధింపు ఆరోపణలు చేశారు. గతంలోనే తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేసిన కేసును మళ్లీ తిరగదోడుతూ, 18 నెలల తర్వాత హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు కేసును బదిలీ చేసి కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం న్యాయవ్యవస్థలో ప్రభుత్వ జోక్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాలను, భూ కబ్జా ఆరోపణలను ప్రశ్నిస్తున్నందుకే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం ఆపేది లేదని, న్యాయస్థానాల్లోనే ఈ ఆరోపణలను ఎదుర్కొంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. మరోవైపు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దర్యాప్తులో వెలుగుచూసిన ఆధారాల ప్రకారమే సిట్ చర్యలు ఉంటాయని అధికార పక్షం వాదిస్తోంది.
రాజకీయ దుమారం రేగడం ఖాయమే
న్యాయపరమైన కోణంలో పరిశీలిస్తే, రాజకీయ నేతలపై వస్తున్న ఈ ఆరోపణలు ఇంకా న్యాయస్థానంలో నిరూపితం కావాల్సి ఉందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు సమర్పించే సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టులు, సాక్షుల వాంగ్మూలాలు కోర్టు విచారణలో ఏ మేరకు నిలబడతాయనేది అత్యంత కీలకం కానుంది. ఒకవేళ సిట్ దాఖలు చేసే తుది ఛార్జ్‌షీట్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల పేర్లు అధికారికంగా నమోదైతే, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను దుమారం రేగడం ఖాయంగా కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల వేడి రాబోయే రోజుల్లో మరింత ముదిరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















