Telangana Phone Tapping Case: త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
Pegasus Spyware: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుందని, త్వరలో సంచలనాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది.

SIT Investigation Phone Tapping Case : తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుందని, త్వరలోనే ఈ కేసులో అనూహ్య పరిణామాలు, సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా ప్రకటన మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తన ఫోన్‌ను ఎవరైనా ట్యాప్ చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేస్తూనే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నిఘా వ్యవహారం విచారణ ముగింపు దశకు వచ్చిందని కీలక సంకేతాలు ఇచ్చారు. బదిలీ అయిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పర్యవేక్షణలోని ప్రత్యేక దర్యాప్తు బృందం పలువురు రాజకీయ ప్రముఖులు, నిందితుల వాంగ్మూలాలను నమోదు చేసి తుది చార్జిషీట్ సిద్ధం చేసింది. సజ్జనార్ బదిలీ దర్యాప్తుపై ప్రభావం చూపదని .. త్వరలోనే కీలక పరిణామాలుంటాయని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు.
ఐ ఫోన్ల హ్యాకింగ్ ఆధారాలు లభించడం కష్టమే!
అయితే, రాజకీయంగా ఈ కేసు చుట్టూ ఎన్ని ప్రకంపనలు రేగుతున్నా.. సాంకేతిక, న్యాయపరమైన కోణంలో దర్యాప్తు సంస్థలకు పెను సవాళ్లు పొంచి ఉన్నాయని సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో బాధితులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు, ప్రతిపక్ష నేతలు, న్యాయమూర్తులు, ప్రముఖ వ్యాపారవేత్తల్లో అత్యధికులు వినియోగించేది అత్యంత కట్టుదిట్టమైన ఎన్‌క్రిప్షన్ భద్రత ఉండే యాపిల్ ఐఫోన్లు . సాధారణ ఫోన్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్‌లను సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ట్యాప్ చేయడం సులభమే అయినప్పటికీ, వాట్సాప్, ఫేస్‌టైమ్, ఐమెసేజ్ వంటి ఎన్‌క్రిప్టెడ్ మాధ్యమాల ద్వారా ఐఫోన్లలో జరిగే సంభాషణలను హ్యాక్ చేయడం సాధారణ సాఫ్ట్‌వేర్లతో సాధ్యం కాదు.
ఆధారాలన్నీ ఇప్పటికే ధ్వంసం చేసినట్లుగా గుర్తింపు
ఇక్కడే అసలైన సాంకేతిక చిక్కు ఎదురవుతోంది. ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ వంటి అత్యున్నత స్థాయి మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ వినియోగించి ఉంటే తప్ప ఐఫోన్ల డేటాను తస్కరించడం అసాధ్యమని సైబర్ భద్రతా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ, నిందితులుగా ఉన్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు తదితరులు అప్పట్లో ఆధారాలు దొరక్కుండా హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసి మూసీ నదిలో పడేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలైన సర్వర్ లాగ్స్ , టెలికాం సంస్థల సాంకేతిక ఆధారాలు లేదా స్పైవేర్ జాడలు లేకుండా, కేవలం నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా మాత్రమే ఐఫోన్ ట్యాపింగ్ జరిగిందని న్యాయస్థానంలో నిరూపించడం దర్యాప్తు సంస్థలకు కత్తిమీద సాములా మారనుంది.
వాంగ్మూలాలకు విలువ ఉండదు!
భారత సాక్ష్యాధారాల చట్టం ప్రకారం, పోలీసుల ఎదుట నిందితులు ఇచ్చే వాంగ్మూలాలకు కోర్టులో నేరుగా విలువ ఉండదు. వాటిని బలపరిచే బలమైన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తప్పనిసరి. ఒకవేళ సాంకేతిక ఆధారాలు బలహీనంగా ఉంటే, ట్రయల్ సమయంలో ఈ కేసు నిలబడటం కష్టమవుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే, సిట్ అధికారులు ఇప్పుడు విదేశీ టెక్నాలజీ నిపుణుల సహాయంతో ధ్వంసమైన హార్డ్ డిస్క్‌ల నుంచి డేటా రికవరీ చేయడం, లేదా ఇజ్రాయెల్ సంస్థల నుంచి కొనుగోలు చేసిన నిఘా పరికరాల ఇన్‌వాయిస్‌లు, విదేశీ సర్వర్ల లాగ్స్‌ను సేకరించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. మరోవైపు, సాంకేతిక సవాళ్లు ఎలా ఉన్నప్పటికీ.. రాజకీయంగా మాత్రం ఈ కేసును తుది అంకానికి తీసుకెళ్లడం ద్వారా బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.
ముఖ్యంగా విచారణ ముగింపు దశలో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఈ ట్యాపింగ్ జరిగిందనే కోణంలో కీలక నేతలకు నోటీసులు జారీ చేయడం లేదా సప్లిమెంటరీ చార్జిషీట్‌లో పెద్ద తలకాయల పేర్లను చేర్చడం వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సంచలనాలు ఉంటాయి అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. సిట్ దాఖలు చేయబోయే తుది చార్జిషీట్‌లో కేవలం పోలీసు అధికారుల పాత్రే ఉంటుందా, లేక గత పాలకుల ప్రమేయంపై బలమైన సాంకేతిక ఆధారాలను బయటపెట్టి సంచలనం సృష్టిస్తారా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















