KCR Babu Same To Same : చంద్రబాబును గుర్తు చేస్తున్న కేసీఆర్ - బీజేపీపై సేమ్ టు సేమ్ పోరాటం ! చివరికేమవుతుంది ?
అప్పట్లో చంద్రబాబు చేసినట్లుగానే ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీపై ఒకే తరహా పోరాటం చేస్తున్నారు. చివరికి ఏమవుతుంది ?
KCR Babu Same To Same : నీకు పోలీస్ ఉంది.. నాకు పోలీస్ ఉంది.. తేల్చుకుందాం ! ఈ డైలాగ్ రాజకీయాల్ని డీప్‌గా ఫాలో అయ్యే వారికి గుర్తుండే ఉంటుంది. ఏపీ రాజకీయాల విషయంలో హైదరాబాద్‌లో పోలీసులు ఐటీ గ్రిడ్ లాంటి కేసులు పెడుతున్న సందర్భంలో తలెత్తిన వివాదాలతో కేసీఆర్ ను ఉద్దేశించి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. కేంద్రానికేనా దర్యాప్తు సంస్థలు ఉన్నది.. తెలంగాణకు లేవా అనే శారు. కేంద్రానికీ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి... రాష్ట్రానికీ ఉన్నాయి. చూసుకుందాం అని పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పేశారు. ఆయన మాటలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎలా అనిపించాయో కానీ చాలా మందికి గతంలో జరిగిన పరిణామాలు కళ్ల ముందు కనిపించాయి. ఒక్క ఈ అంశంలోనే కాదు.. చాలా వాటిల్లో గతంలో చంద్రబాబు చేసినట్లుగానే చేస్తున్నారు కేసీఆర్ . సేమ్ టుసేమ్ సీన్ రిపీట్ అవుతోందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది.
మోదీ పర్యటనలపై అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు కేసీఆర్ ఒకే తరహా నిరసనలు !
2018 తర్వాత నరేంద్రమోదీ ఏపీ పర్యటనల్లో కామన్‌గా వినిపించిన పదం ఒక్కటే... రాష్ట్రానికి ద్రోహం చేసి రాష్ట్రానికి ఎలా వస్తారని. అంతే కాదు టీడీపీ నేతలు యాక్టివ్‌గా నిరసనల్లో పాల్గొనేవారు. ఇప్పుడు మోదీ ఏపీకి వస్తే అన్ని పార్టీలూ రెడ్ కార్పెట్ వేసి.. సార్.. సార్ అని పిలిచాయనే సంగతిని పక్కన పెడితే.. అప్పట్లో ఏపీలో జరిగిన నిరసనలు ఇప్పుడు తెలంగాణలో రిపీట్ అవుతున్నాయి. "ఏమీ ఇయ్యకుండా ఎట్లొస్తారు తెలంగాణకు" అని టీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. మోదీ పర్యటనను వ్యతిరేకించింది. అప్పట్లో చంద్రబాబు కూడా మోదీకి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం చెప్పేందుకు వెళ్లలేదు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే పని చేస్తున్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ కూటమి కోసం నాడు చంద్రబాబు ఆరాటం.. నేడు కేసీఆర్‌దీ అదే ప్రయత్నం !
టీడీపీ లాగే టీఆర్ఎస్ కూడా మొదట్లో బీజేపీతో సన్నిహితంగానే ఉండేది. కానీ ఇప్పుడు శత్రవయింది. టీడీపీ కూడా అంతే. ఉన్నంత కాలం బాగా ఉండి.. ఒక్క సారిగా రూటు మార్చారు. తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీలను ఏకం చేస్తానని చంద్రబాబు ఉబలాటపడ్డారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చేస్తున్నారు. పెద్దగా కలసి రావడం లేదని నేరుగా జాతీయ పార్టీ పెడుతున్నారు. జాతీయ పార్టీ పెట్టినా.. అందర్నీ కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడు ఏ పార్టీ కలిసి వస్తామన్నా.., కలుపుకునేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు.
అప్పట్లో ప్రతీ దానికి మోదీపైనే చంద్రబాబు నిందలు.. ఇప్పుడు కేసీఆర్ కూడా !
అప్పట్లో చంద్రబాబు కూడా ప్రతీ చిన్న దానికి మోదీని నిందించేవారు. ఇప్పుడు కేసీఆర్ అదే్ పని చేస్తున్నారు. బీజేపీని ఓడించితీరుతామన్న గట్టి నమ్మకంతో చంద్రబాబు ఉండేవారు. ఎంత నమ్మకం అంటే.. ఆయన మరోసారి ఢిల్లీలో చక్రం తిప్పడం ఖాయమని నమ్మేవారు. ఇప్పుడు కేసీఆర్‌దీ అదే్ పరిస్థితి. బీజేపీని ఓడించడం ఖాయమని నమ్ముతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించినప్పుడు బీజేపీని ఓడించలేమా అంటున్నారు.
సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు కూడా చంద్రబాబు చేసినట్లే !
చివరికి సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసే విషయంలోనూ సేమ్ టు సేమ్.. వ్యవహరించారు. చంద్రబాబు చేసినట్లే చేశారు., అయితే ఇక్కడ కొసమెరుపేమిటంటే.. అప్పట్లో చంద్రబాబు చేసిన పనులను.. బీజేపీతో సన్యంగా ఉన్న టీఆర్ఎస్ అధినేత ఎగతాళి చేసేవారు. సీబీఐ అనుమతి రద్దు చేయడంపైనా వెటకారం చేశారు. కానీ ఇప్పుడు అదే చేయాల్సి వస్తోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు చేసినట్లే కేసీఆర్ చేస్తున్నారు. ఎంతగా పోలికలు వద్దనుకున్నా అదే చేస్తున్నారు. ఇప్పుడు మోదీ పర్యటనకు స్కిప్ చేయడం .. మోదీ సభకు నిరసనలు వ్యక్తం చేయడం మాత్రమే కాదు.. చివరికి … దర్యాప్తు సంస్థల దాడులపై మీకు పోలీస్.. నాకు పోలీస్ అన్న తరహాలో ఎదురుదాడి చేస్తున్నారు. ఫామ్ హౌస్ కేసు ఫైల్స్‌తో కేంద్ర పెద్దలను కూడా ఇరికిస్తామన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు కూడా ఇలాగే చేశారు.
యాధృచ్చికంగా ఉపఎన్నిక కూడా మ్యాచ్ అయిపోయిందే !
చంద్రబాబు స్టోరీనే రిపీట్ అవుతున్నట్లుగా కనిపిస్తున్న దాంట్లో. యాధృచ్చికంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉపఎన్నిక కూడా మ్యాచ్ అయింది. అప్పట్లో చంద్రబాబు నంద్యాల ఉపఎన్నికల్ని ఎదుర్కొన్నారు. గెలవరేమో అనుకున్న పరిస్థితి నుంచి ఘన విజయం సాధించారు. ఇక పాజిటివ్ వేవ్ ఖాయమనుకున్నారు. తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. టీఆర్ఎస్ విజయం సాధించింది.
మరి తర్వాతేం జరగబోతోంది ?