బస్సు యాత్రకు సిద్ధమైన కాంగ్రెస్- స్క్రీనింగ్ కమిటీలో యాష్కీ, కోమటిరెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా...కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అందుకోసం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశారు. పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారం నుంచే యాత్రను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఎన్నికల ముందు జరుగుతున్న బస్సుయాత్రలో...పార్టీ కీలక నేతలంతా పాల్గొననున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సుయాత్రలో ఆరు గ్యారంటీ పథకాలను... ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు నేతలు. అదే సమయంలో బీఆర్‌ఎస్ పాలనా వైఫల్యాలను ఎండగట్టాలని తీర్మానించింది కాంగ్రెస్ పార్టీ. అక్టోబర్ మొదటి వారంలోనే యాత్ర మొదలు పెట్టి 10–12 రోజుల్లోనే...వీలయినన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో సాగేలా రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నారు. బస్సుయాత్ర రూట్‌మ్యాప్, షెడ్యూల్‌ను...రెండు మూడు రోజుల్లోనే పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
మరోవైపు అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఇవాళ సాయంత్రం సమావేశం కానుంది. స్క్రీనింగ్ కమిటీ సభ్యులైన ఎంపీలు ఉత్తమ్, రేవంత్ ఢిల్లీలోనే ఉండటంతో, అక్కడే కసరత్తు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల షార్ట్ లిస్ట్ జాబితాను ఏఐసీసీకి ఇవ్వనున్నారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు ఠాక్రే, భట్టి తదితరులతో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచనలతో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను స్క్రీనింగ్ కమిటీ సభ్యులుగా నియమించారు.
కుటుంబానికి రెండు సీట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు...రెండు సీట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, అమె తనయుడు, కరీంనగర్ స్థానానికి కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు., ఆమె కొడుకు గాంధీభవన్ లో దరఖాస్తులు సమర్పించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏకంగా మూడు స్థానాలకు అప్లికేషన్ పెట్టుకున్నారు. జానారెడ్డి తనయుడు రఘువీర్, జై వీర్ లు రెండు స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్ నగర్ నుంచి ఉత్తమ్, కోదాడ స్థానం నుంచి పద్మావతి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసిన పద్మావతి...బొల్లం మల్లయ్య యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. హుజూర్ నగర్ నుంచి గెలుపొందిన ఉత్తమ్...2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఉత్తమ్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో...అదే స్థానం నుంచి పద్మావతి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఉప ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. మొదటి విడతలో 40 నుంచి 50 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులనే ప్రకటించేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే ఛాన్స్ ఉంది.