Khammam News: నేను గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లే- తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్స్
Tummala On Naidu: మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి, ఖమ్మం (Khammam assembly) కాంగ్రెస్ అభ్యర్థి (Congress Candidate) తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara rao)సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో తాను గెలిస్తే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో చంద్రబాబు గెలిచినట్లేనన్నారు. తెలుగు గడ్డ మీద పచ్చ జెండా ఎగరాలి అనేదే తన ఆలోచన అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి మీరు నాకు చేస్తున్న సాయాన్ని ఉంచుకోనన్నారు. తెలుగుదేశం పార్టీకి తాను చాలా రుణపడి ఉన్నానని స్పష్టం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు. గులాబీ బాస్ కేసీఆర్ పాలేరు సీటుని కందాల ఉపేందర్ రెడ్డికి ఇచ్చారు. తుమ్మలకు మొండిచేయి చూపించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఓడించడమే లక్ష్యంగా తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వి నీచ రాజకీయాలు
ఎమ్మెల్యేని చేసి, మంత్రి పదవి ఇస్తే.. బీఆర్ఎస్ కు ద్రోహం చేశారు అంటూ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలను తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తుమ్మల ఫైర్ అయ్యారు. 40 ఏళ్ల రాజకీయం గురించి మాట్లాడటం కేసీఆర్ కు తగదన్నారు. సీఎం కేసీఆర్ తన స్థాయిని మరిచి, తన గురించి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. నువ్వు నాకు పదవి ఇవ్వడం ఏంటి? నేనే నీకు పదవి ఇప్పించా అంటూ హాట్ కామెంట్స్ చేశారు తుమ్మల. నీ రాజకీయాలు తాచుపాము లాంటివని, తన గుడ్లు తానే మింగినట్టు, నీ రాజకీయాలే నిన్ను బొంద పెడతాయన్నారు. పాలేరులో మూడు పంటలు పండించే స్థాయికి తీసుకొచ్చిన తనను అవమానించావంటూ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు ప్రజలు కేసీఆర్ ను క్షమించరని అన్నారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు తనకు తెలుసని, తన స్థాయి ఏంటో తెలుసన్నారు తుమ్మల నాగేశ్వరరావు.
ఐదుసార్లు శాసనసభకు ఎన్నిక
తుమ్మల నాగేశ్వరరావు...ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1985,1994,1999,2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 2016లో బీఆర్ఎస్ లో చేరి...తెరాస పార్టీ నుంచి అసెంబ్లీకి పాలేరు ఉపఎన్నికలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితపై 45,684 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాలేరు నుంచి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1985 ఎన్నికల్లో తొలిసారి గెలుపొందిన తుమ్మల...ఎన్టీఆర్ మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1994 నుంచి 1999 వరకు ఎన్టీఆర్, చంద్రబాబుల మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల , ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు కేబినెట్ లో భారీ నీటి పారుదల, రోడ్లు, భవనాల శాఖల మంత్రిగానూ పని చేశారు. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత... కెసిఆర్ మంత్రివర్గంలో 2015 నుంచి 2018 వరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, రోడ్డు, భవనాలు శాఖల మంత్రిగా పనిచేశారు.