Telangana 22A land list : 22A భూముల వివాదం.. నిజమైన సంక్షోభమా? బీఆర్ఎస్ మైండ్ గేమా?
22A land Issue: తెలంగాణలో నిషేధిత భూముల జాబితాపై రాజకీయ వివాదం జరుగుతోంది. కోటి ఎకరాల భూముల 22Aలో ఉన్నాయని కేటీఆర్ అంటున్నారు. అంత భారీగా ఉంటే ప్రజలు సైలెంట్ గా ఉంటారా?

BRS vs Congress land disputes: తెలంగాణ రాజకీయాల్లో రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22A నిషేధిత భూముల జాబితా అంశం తీవ్ర దుమారం రేపుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏకంగా కోటి 16 లక్షల ఎకరాలను 22A పరిధిలోకి నెట్టేశారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. మరోవైపు, 22A కింద పొరపాటుగా చేరిన ప్రైవేట్ భూములు కేవలం కొన్ని వేల ఎకరాలు లేదా కొన్ని లక్షల ఎకరాలేనని, గత ప్రభుత్వ హయాంలో ఉన్న రికార్డులను సవరించే క్రమంలో డిజిటల్ డేటా అప్డేట్లో జరిగిన సాంకేతిక పొరపాట్లను మాత్రమే బీఆర్ఎస్ పెద్దది చేసి చూపిస్తోంది అని ప్రభుత్వ వర్గాలు, చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ ఖండిస్తున్నారు. ఎవరి లెక్కల్లో నిజముంది, అసలు సమస్య తీవ్రత ఎంత అనే అంశంపై రాజకీయ పరిశీలన ఆసక్తికరంగా మారింది.
సాంకేతిక సమస్య అంటున్న ప్రభుత్వం
సాంకేతికంగా పరిశీలిస్తే, తెలంగాణ మొత్తం వైశాల్యం దాదాపు 2.75 కోట్ల ఎకరాలు కాగా, అందులో దాదాపు 1.5 కోట్ల ఎకరాలకు మాత్రమే పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఉన్నాయి. మిగిలిన భూమి ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, ఇనాం, దేవాదాయ, వక్ఫ్ మరియు వివిధ వివాదాల్లో ఉన్న భూములు. రెవెన్యూ రికార్డులను ధరణి నుంచి కొత్తగా తెచ్చిన భూభారతి సిస్టమ్‌లోకి డిజిటలైజ్ చేసే సమయంలో, చట్టబద్ధమైన క్లారిటీ లేని నిరుపయోగ లేదా అసైన్డ్, ప్రభుత్వ భూముల కేటగిరీలన్నింటినీ సిస్టమ్ ఆటోమేటిక్‌గా 22A డ్రావర్లోకి నెట్టేసింది. కేటీఆర్ చెబుతున్న కోటి ఎకరాల లెక్కలో అటవీ భూములు, ప్రభుత్వ రిజర్వ్ కేటగిరీలు, చెరువులు, కుంటలు , పాత అసైన్డ్ భూములు ఉన్నాయి. అయితే, సాధారణ ప్రజలకు సంబంధించిన ప్రైవేట్ పట్టా భూములు ఇందులో చిక్కుకోవడం వల్లనే అసలు వివాదం రాజుకుంది.
హైదరాబాద్ చుట్టుపక్కల లేఔట్లకు ఇబ్బంది
వాస్తవానికి క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రత ఉందా అంటే.. ఖచ్చితంగా హైదరాబాద్ చుట్టుపక్కల మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనూ, ఉమ్మడి జిల్లాల పట్టణ ప్రాంతాల్లోనూ లేఅవుట్లు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన సామాన్యులకు రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లూ క్రయవిక్రయాలు జరిగిన భూములు ఉన్నట్టుండి 22A లోకి మారడంతో ప్లాట్ల యజమానులు అభద్రతాభావానికి గురయ్యారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా అసెంబ్లీ వేదికగానూ, ప్రెస్ మీట్లలోనూ స్పందిస్తూ సాంకేతిక పొరపాట్ల వల్ల కొన్ని ప్రైవేట్ ఆస్తులు 22Aలోకి వచ్చాయి, బాధితులకు క్షమాపణలు చెబుతున్నాం అని ప్రకటించాల్సి వచ్చింది. ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి విజ్ఞప్తులు స్వీకరిస్తుండటం ప్రభుత్వం సమస్య ఉనికిని అంగీకరించినట్లే స్పష్టం చేస్తోంది.
ఈ సమస్యను బీఆర్ఎస్ ఎంతవరకు వాడుకుంటోంది?
అసెంబ్లీ ఎన్నికల ఓటమి, పార్లమెంట్ ఎన్నికల దెబ్బ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లోకి నెట్టేందుకు బీఆర్ఎస్ కు '22A' ఒక బలమైన ఆయుధంగా దొరికింది. తెలంగాణలో భూమి అనేది అత్యంత భావోద్వేగపూరితమైన అంశం. గతంలో తాము తెచ్చిన ధరణిని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించినందున, ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చిన రెవెన్యూ మార్పుల లోపాలను ఎండగట్టడానికి కేటీఆర్, హరీశ్‌రావు ఈ అంశాన్ని ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజా పోరాటాలుగా కంటే, ప్రతిపక్ష పార్టీగా బాధితుల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం భూములను కాజేయడానికే 22A ని వాడుతోంది అనే నెరేటివ్‌ను సెట్ చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
బీఆర్ఎస్ ప్రజల్ని రోడ్లపైకి తీసుకు రాగలదా?
బాధితులు ఎందుకు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడం లేదనే దానికి కారణం.. ఈ ఇబ్బంది పడుతున్న వారిలో ఎక్కువ మంది పట్టణాల్లోని మధ్యతరగతి చెందిన ప్లాట్ల యజమానులు కావడమే. వీరు ప్రజా ఉద్యమాల కంటే చట్టపరమైన పరిష్కారాలకో లేదా కలెక్టరేట్లలో దరఖాస్తులు చేసుకునే మార్గానికో ప్రాధాన్యత ఇస్తారు. పైగా, ప్రభుత్వం సవరణ ప్రక్రియను వేగవంతం చేసి, అభ్యంతరాలను స్వీకరిస్తుండటంతో మా భూమి మాకు వస్తుందిలే అనే ఆశతో చాలామంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. 22A వివాదంలో కోటి ఎకరాలు ఆక్రమణలకు గురవుతున్నాయి అన్నది బీఆర్ఎస్ రాజకీయంగా పెంచి చూపుతున్న అంకె అయితే, ఏమీ లేదంతా సాధారణమే అనడం కాంగ్రెస్ డిఫెన్సివ్ టాక్టిక్. రాత్రికి రాత్రే ప్రైవేట్ ఆస్తులు నిషేధిత జాబితాలోకి వెళ్లడం వల్ల సామాన్య ప్రజల్లో ఆందోళన కలగడం పచ్చని నిజం. ఈ సమస్యను ఎంత త్వరగా క్లియర్ చేసి, నిజమైన హక్కుదారులకు క్లియరెన్స్ ఇస్తే.. అంత త్వరగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ విసురుతున్న రాజకీయ బాణాల నుంచి బయటపడగలదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















