TDP Support NDA : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఎన్డీఏకే - శుక్రవారం అమిత్ షాను చంద్రబాబు కలిసే అవకాశం !
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ ఎంపీల మద్దతు ఎన్డీఏ అభ్యర్థికే ప్రకటించారు. శుక్రవారం చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
TDP Support NDA : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ప్రకటించింది. ఆ పార్టీకి లోక్‌సభలో ముగ్గురు, రాజ్యసభలో ఒక ఎంపీ ఉన్నారు. వీరంతా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌కడ్‌కు మద్దతుగా ఓటేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ నుంచి వంద శాతం ఓట్లు ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకే పడ్డాయి. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఏపీకి సంబంధించిన ఓట్లన్నీ ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌పై పడతాయి. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ కూడా ఎన్డీఏఅ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు బుధవారం హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు నాయుడు శనివారం అమిత్ షాతో భేటీ అయ్యే చాన్స్ ఉంది.
ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరవాత బీజేపీపై తీవ్ర విమర్శలు
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి గత ఎన్నికలకు ముందు బయటకు వచ్చిన తర్వాత బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఎన్నికల్లో ఓడిపోవడతో సైలెంట్ అయ్యారు. బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. వీలైనప్పుడు మద్దతు పలుకుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ టీడీపీ మద్దతును బీజేపీ నేతలు అడగకపోయినప్పటికీ సామాజిక న్యాయం కోసం తాము మద్దతు ప్రకటిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత ఏపీ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము.., తెలుగుదేశం పార్టీ నేతలతో ఆత్మీయ సమావేశంలో కూడా పాల్గొన్నారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీపై విధానం మార్చుకున్న టీడీపీ
ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ టీడీపీ మద్దతు ఎన్డీఏకు ప్రకటించింది. బీజేపీ నేతలు అడిగారో లేదో స్పష్టత లేదు. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికిప్పుడు వేసుకున్న రాజకీయ ప్రణాళికల ప్రకారం బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లాలని అనుకోవడం లేదు. ఇతర విపక్ష పార్టీలతో కానీ.. కాంగ్రెస్ పార్టీ కూటమి అయిన యూపీఏతోనూ కలిసే అవకాశాలు లేవు. బీజేపీతో గత శుత్రుత్వాన్ని వీలైనంతగా తగ్గించుకుని సుహృద్భావ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి పలు అంశాల్లో మద్దతు పలుకుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఏపీలో అన్ని పార్టీలదీ బీజేపీ మద్దతు బాటే
ఏపీలో బీజేపీ బలంగా లేకపోయినప్పటికీ ఆ పార్టీకిచాలా పరిమితమైన ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ ఢిల్లీ స్థాయిలో ఆ పార్టీకి అడ్వాంటేజ్ వస్తూనే ఉంది. ఏ పార్టీ ఉన్నా.. కేంద్రంలో బలమైన ప్రభుత్వంగా ఉన్న బీజేపీకి అనుకూలంగానే ఉంటున్నారు. బీజేపీ ఎవరికీ ప్రత్యర్థి కాదు కాబట్టి రాష్ట్రంలో ఆయా రాజకీయ పార్టీలకు సమస్యలు కూడా లేవు.