AP TDP Plan : ఓటర్లకు ముందుగానే పథకాల కార్డులు - ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్ !
టీడీపీ ప్రకటించిన పథకాలు అందుకునేవారికి ముందుగానే కార్డులు పంపిణీ చేయనున్నారు నేతలు. ఇది ఓ రకంగా ఓట్ల వెల్లువ తెస్తుందని నమ్ముతున్నారు.
AP TDP Plan : ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇస్తారు. తీరా గెలిచిన తర్వాత రకరకాల అర్హతలు ఖరారు చేసి .. అర్హులైన వారికి మాత్రమే ఇస్తామని చెబుతూంటారు. ఈ కారణంగా ఉచిత హామీల విషయంలో ప్రజలు పార్టీలను నమ్మడం కష్టం. అందుకే తెలుగుదేశం పార్టీ వినూత్నమైన మార్గాన్ని అవలంభిస్తోంది. లబ్దిదారులను ముందుగానే గుర్తించి కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. ఇలా చేయడం ద్వారా టీడీపీ ప్రభుత్వం వస్తే తమకు పథకాలు రావనే భయం ఉంటే పోతుందని.. అదే సమయంలో.. ఆ కార్డు పథకం గ్యారంటీగా వస్తుందనే భరోసా వస్తుంది.. ఓట్ల వర్షం కురుస్తుందని టీడీపీ నేతలు గట్టిగా ఆశలు పెట్టుకుంటున్నారు.
టీడీపీ వస్తే పథకాలు ఆగిపోతాయన్న ప్రచారానికి బ్రేక్
తెలుగుదేశం పార్టీ వస్తే పథకాలు ఆపేస్తారన్న వైసీపీ కొంత కాలంగా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారానికి ప్రచారానికి టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోతో తెరపడింది. అదే సమయంలో చంద్రబాబు ఇవ్వలేరనే వాదనను కూడా వైసీపీ నేతలు గట్టిగా చేయలేకపోతున్నారు. జగన్ ఇవ్వగా లేనిది సంపద సృష్టి చేసే చంద్రబాబు ఎందుకు ఇవ్వలేరని ప్రశ్నిస్తున్నారు. మేనిఫెస్టో విషయంలో టీడీపీ మాత్రం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. తమ పథకాల లబ్దిదారులకు ముందుగానే ఎంపిక చేసి వారికి కార్డులు పంచబోతోంది. ఈ కార్డులు భరోసా అని..ఈ కార్డులు ఉన్న వారందరికీ ఖచ్చితంగా పథకాలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం చేసే అవకాశం ఉంది.
సంక్షేమ పథకాల్లో అర్హులు అనేది అసలు కిటుకు
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో అర్హులు అనే మాట చాలా మందిని నిరాశకు గురి చేస్తోంది. చాలా పథకాలకు నియోజకవర్గానికి వెయ్యి మంది కూడా లబ్దిదారులు ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. విదేశీ విద్యా దీవెన పథకానికి ప్రపంచంలోని టాప్ 50 యూనివర్శిటీల్లో సీటు రావాలనే నిబంధన పెట్టడంతో రెండు, మూడు వందల మందికి కూడా లబ్ది చేకూరడం లేదన్న విమర్శలు ఉన్నాయి. బడుగు, బలహీనవర్గాల పెళ్లిళ్లకు ఇచ్చే సాయానికి కూడా పదో తరగతి చదవాలనే నిబంధన పెట్టడంతో లబ్దిదారులు 90శాతం వరకూ తగ్గిపోయారు. అందుకే టీడీపీ కొత్తగా ఆలోచించింది. అర్హుల పేరుతో ఎవర్నీ ఎలిమినేట్ చేయబోమని… నమ్మకం కలిగించేందుకు ముందుగానే కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆ కార్డులు అందుకున్న వారందరికూ తమకు ప్రభుత్వ పథకాలు వస్తాయన్న నమ్మకం ఉంటుందని ఇది ఓట్ల పంటపండిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.
లోకేష్ ఆలోచన
నగదు బదిలీ అనే కాన్సెప్ట్ మొదట తెలుగుదేశం పార్టీ అమలు చేసింది. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ఈ హామీలను ఇచ్చింది. నారా లోకేష్ ఈ మేనిఫెస్టో తయారీలో కీలక పాత్ర పోషించారు. అప్పటికీ పార్టీలో యాక్టివ్ కాకపోయినప్పటికీ ఆయన చేసిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది. టీడీపీ అధికారంలోకి వస్తే.. నగదు బదిలీ చేస్తామని కుప్పంలో ఇలా లబ్దిదాుల కార్డుల్ని కూడా పంచారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఈ సారి మాత్రం టీడీపీ పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగుతోంది. మెజార్టీ ఓటర్లకు.. లబ్దిదారులకు కార్డులు పంపిణీ చేసి నమ్మకం కలిగించబోతున్నారు. మరి వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.