Nallamilli Ramakrishna Reddy: టీడీపీ నేత నల్లమిల్లి కంటతడి - టిక్కెట్ దక్కకపోవడంపై ఆవేదన, ఫోన్ చేసిన చంద్రబాబు!
Andhrapradesha News: తూ.గో జిల్లా అనపర్తి టిక్కెట్ బీజేపీకి కేటాయించడంపై టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి బుజ్జగించారు.
Tdp Leader Nallamilli Tears For Not Getting Ticket: ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ - జనసేన పొత్తు నేపథ్యంలో టిక్కెట్ దక్కని పలువురు కీలక నేతలు అసంతృప్తికి లోనవుతున్నారు. బుధవారం బీజేపీ తన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి (Anaparthy) నియోజకవర్గానికి అభ్యర్థిగా బీజేపీ నేత శివకృష్ణంరాజును ప్రకటించింది. దీంతో ఇక్కడ టిక్కెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallamilli RamaKrishnaReddy) తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఓ దశలో ఆయన కార్యకర్తల సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. వాస్తవానికి, పొత్తులకు ముందు అనపర్తి స్థానాన్ని టీడీపీ నల్లమిల్లి కృష్ణారెడ్డికే కేటాయించింది. అయితే, మారిన రాజకీయ పరిణామాలు, పొత్తుల్లో భాగంగా ఆ స్థానం బీజేపీకి కేటాయించారు.
'ప్రజల్లోకి వెళ్తాను'
అయితే, తనకు అధిష్టానం టిక్కెట్ కేటాయించక పోవడంపై ప్రజల్లోకే వెళ్లి తేల్చుకుంటానని నల్లమిల్లి స్పష్టం చేశారు. 'నాకు టిక్కెట్ రాకుండా పెద్ద కుట్ర చేశారు. నాకు జరిగిన అన్యాయం ప్రజలకు వివరిస్తాను. శుక్రవారం నుంచి నా కుటుంబ సభ్యులతో కలిసి ప్రజల్లోకి వెళ్తాను. ప్రజల నిర్ణయం మేరకు పోటీ చేస్తాను.' అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అనపర్తి నియోజకవర్గంలో ఏమాత్రం బలం లేని బీజేపీకి సీటు ఎలా కేటాయిస్తారు.? అని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అటు, నల్లమిల్లి తల్లి సైతం తన కుమారుడికి టిక్కెట్ దక్కకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడిని హత్తుకుని విలపించారు.
అనుచరుల ఆందోళన
అటు, నల్లమిల్లికి టిక్కెట్ దక్కకపోవడంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా.. వారిని నల్లమిల్లి అడ్డుకున్నారు. కొందరు కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనై టీడీపీ కరపత్రాలు, జెండాలను కుప్పలుగా పోసి అందులో ఓ సైకిల్ వేసి తగలబెట్టారు. ఈ క్రమంలో కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించాలని.. అధిష్టానంతో మాట్లాడతానని.. అప్పటి వరకూ వేచి ఉండాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఇక్కడ సీటును నల్లమిల్లికి ఇవ్వకపోతే రాజీనామాలకు సిద్ధమంటూ పలువురు టీడీపీ నేతలు హెచ్చరించారు. రామకృష్ణారెడ్డికి టిక్కెట్ ఇవ్వకుంటే వైసీపీ గెలుపు ఖాయమంటూ జోస్యం చెప్పారు. కార్యకర్తల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చంద్రబాబు ఫోన్
అయితే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని శాంతింపచేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఫోన్ చేసి బుజ్జగించారు. ఈ క్రమంలో చంద్రబాబుకు నల్లమిల్లి తన ఆవేదనను తెలియజేశారు. నియోజకవర్గ పరిస్థితి, కార్యకర్తల ఆవేదనను వివరించారు. పార్టీ కోసం తెగించి పోరాడిన నేతల్లో తానూ ఒకడినని.. ప్రాణాలొడ్డి పోరాడితే తనను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు వైసీపీలో చేరాలని ఆఫర్ వచ్చినా.. తమ కుటుంబం టీడీపీ వెంటే నడిచిందని గుర్తు చేశారు. 40 ఏళ్లుగా తమ పోరాటాన్ని, టీడీపీ కార్యకర్తల పోరాటాన్ని గుర్తించాలని చంద్రబాబును కోరారు.
Also Read: Chandrababu : జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్