Andhra Politics : చంద్రబాబు మరణం గురించి మాట్లాడితే మేలు జరుగుతుందా ? గీత దాటుతున్న నేతల్ని వైసీపీ హైకమాండ్ కట్టడి చేయడం లేదా ?
చంద్రబాబు ప్రాణఆనికి ముప్పు తలపెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతల ప్రకటనలూ అలాగే ఉంటున్నాయి. వైసీపీ హైకమాండ్ ఎందుకు కట్టడి చేయడం లేదు ?
Andhra Politics : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎవరూ ఊహించని స్థాయికి దిగజారిపోతున్నాయి. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం, కుటుంబాలను కించ పర్చుకోవడం దగ్గర్నుంచి ఇప్పుడు చావులు, మరణాలు ప్రకటనల వరకూ వచ్చాయి. ఇవి సంచలనంగా మారుతున్నాయి. సామాజిక సాధికార బస్సు యాత్రలో వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రసంగాలు వివాదాస్పదంగా ఉంటున్నాయి. ప్రధానంగా చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై విమర్శలు గుప్పించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబు జైల్లోనే చస్తాడని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్పటికే టీడీపీ నేతలు చంద్రబాబు ప్రాణానికి హాని తలపెడుతున్నారని ఆరోపణలు చేస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.
73 ఏళ్ల చంద్రబాబును రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా వ్యక్తిగత శత్రువుగా చూస్తున్నారా ?
రాజకీయాలు రాజకీయాలే.. వ్యక్తిగత సంబంధాలు వ్యక్తిగత సంబంధాలే అని అనుకువేవారు. చాలా రాష్ట్రాల్లో అలాగే ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం రాజకయాలు.. వ్యక్తిగత సంబంధాలు వేర్వేరు కాదు. రాజకీయ ప్రత్యర్థులు ... పొలిటికల్ గేమ్ లో పోటీపడే వారు మాత్రమే కాదు.. వ్యక్తిగత శత్రువులు కూడా. రాజకీయంగా విబేధిస్తే.. వారిపై ఎలాంటి భాషతో విరుచుకుపడతారో చెప్పడం కష్టం.దాడులు కూడా కామన్ అయిపోయాయి. ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీరపీ అధినేత అసెంబ్లీలో తనపై.. తన కుటుంబంబపై చేసిన వ్యాఖ్యలతో కన్నీరు పెట్టుకున్నారు. ఆయనపై ఆ దాడి తగ్గడం లేదు. వరుసగా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రాణాలు గురించి చావడం గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు ప్రజల్లో ఎలాంటి స్పందన తెస్తాయో అధికార పార్టీ నేతలు గుర్తిస్తున్నారో లేదో కానీ.. రాజకీయాల్లో ఇలాంటివి మంచిది కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల్ని వ్యక్తిగత శత్రువుల్లా చూసి ఉంటే పరిస్థితి వేరేగా ఉండదన్న వాదన టీడీపీ నేతలు వినిపిస్తున్నారు.
తన ప్రాణానికి ప్రమాదం ఉందని చంద్రబాబు ఆందోళన !
జైల్లో తన భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ.. ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాశారు. అందులో జైల్లో తన కదలికల్ని రహస్యంగా చిత్రీకరిస్తున్నారని.. ఓ ఖైదీ పెన్ కెమెరా పెట్టుకుని దృశ్యాలు చిత్రీకరించారని.. తన ఫోటోలు బయటకు వచ్చాయని.. అలాగే జ్రోన్లు తిరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. తనను చంపేందుకు కోట్ల రూపాయలు చేతులు మారాయని ఓ లేఖ జైలుకు వచ్చిందని కూడా చెప్పారు. వీటిపై ప్రెస్ మీట్ పెట్టిన జైలు అధికారులు అవన్నీ నిజమే కానీ.. తాము దర్యాప్తు చేశామని చెబుతున్నారు. కానీ తేలిగ్గా తీసుకుంటున్నారు. బటన్ కెమెరా పెట్టుకుని ఓ ఖైదీ లోపలికి వచ్చాడు కానీ.. పట్టేసుకున్నామని బటన్ కెమెరాలో ఆ ఖైధీ ఫ్యామిలీ ఫోటోలు ఉన్నాయన్నారు. అసలు బటన్ కెమెరాతో ఖైదీ జైల్లోకి ఎలా వస్తారో చెప్పలేదు. చంద్రబాబుపై హత్యకు కుట్ర పన్నినట్లుగా లేఖ వచ్చింది కానీ అది ఫేక్ అని పోలీసులు చెప్పారు. ఎవరు రాశారు.. ఎందుకు రాశారు.. వారిని పట్టుకున్నారా అన్న డీటైల్స్ చెప్పలేదు. డ్రోన్లు ఎగిరాయి కానీ.. ఎవరు ఎగరేశారో తెలియదని దర్యాప్తు చేస్తున్నామనిఅంటున్నారు. జైలులో తన దృశ్యాలు వైఎస్ఆర్‌సీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అయితే ఆ దృశ్యాలు బయటకు ఎలా వెళ్లాయో కూడా విచారణ చేస్తున్నామనే చెబుతున్నారు. ఇలా ప్రతి అంశాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నాం.. భద్రతకు ఢోకాలేదంటున్నారు కానీ.. ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నట్లుగా చెప్పడం లేదు. మరో వైపు వైసీపీ నేతల హెచ్చరికలు .. జైలు అధికారుల ప్రకటనలు కలిపి .. ప్రజల్లో అనేక చర్చలకు కారణం అవుతున్నాయి.
గీత దాటుతున్న వైసీపీ నేతల్ని హైకమాండ్ ఎందుకు కట్టడి చేయడం లేదు ?
అధికారంలో ఉన్న పార్టీ బాధ్యతాయుతంగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. అధికారం చేతిలో ఉంది కదా అని చంపేస్తామని బెదిరిస్తే.. అది ప్రజల్లో నెగెటివ్ గా వెళ్తుంది. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తాము దుర్వినియోగం చేయలేదని.. పద్దతిగా పరిపాలించామని ప్రజలకు జవాబుదారీగా ఉండి ఓట్లు అడగాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో వైసీపీ నేతలు గీత దాటి చేసే ప్రకటనల వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయి. అంతిమంగా అధికార పార్టీకే నష్టం జరుగుతుంది. అయినా ఎందుకు ఆ పార్టీ పెద్దలు వివాదాస్పదంగా మాట్లాడే నేతల్ని కట్టడి చేయడం లేదన్నది రాజకీయవర్గాలకు అంతు చిక్కని విషయంగా మారింది.