Seven Bypolls In Six States: నేడు దేశ వ్యాప్తంగా 7 స్థానాలకు ఉప ఎన్నికలు, పై చేయి ఎవరిది?
Seven Bypolls In Six States: ఆరు రాష్ట్రాల్లో ఏడు స్థానాల్లో సెప్టెంబర్ 5న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై I.N.D.I.A తన బలం, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని తహతహలాడుతోంది.
Seven Bypolls In Six States: ఆరు రాష్ట్రాల్లో ఏడు స్థానాల్లో సెప్టెంబర్ 5న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A) తన బలం, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని తహతహలాడుతోంది. త్వరలో జరుగనున్న 6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకోవాలని యత్నిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, కేరళలోని పుతుపల్లి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్, ధన్‌పూర్‌లో ఈరోజు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 8న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణాల కారణంగా ధూప్‌గురి, పుతుపల్లి, బాగేశ్వర్, డుమ్రీ, బోక్సానగర్‌లలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఘోసి, ధన్‌పూర్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆయా స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) ఎమ్మెల్యే పదవికి దారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఘోసిలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. చౌహాన్ రాజీనామా తర్వాత బీజేపీలో చేరారు. ఉప ఎన్నికలకు SP తరఫున సుధాకర్ సింగ్ పోటీ చేస్తుండగా బీజేపీ చౌహాన్‌ను రంగంలోకి దింపింది. సింగ్ గతంలో ఘోసీలో 2012 నుంచి 2017 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తన మిత్రపక్షమైన ఎస్పీకి మద్దతిస్తోంది.
ఘోసీ ఉపఎన్నికను SP, BJP ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. I.N.D.I.A కూటమి ఏర్పడిన తరువాత ఎన్డీఏ పరస్పరం తలపడుతున్న ఉప ఎన్నిక ఇది. త్రిపురలోని ధన్‌పూర్‌లో బీజేపీకి చెందిన ప్రతిమా భూమిక్ రాజీనామా చేయడంతో అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ధన్‌పూర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి కౌశిక్ చందాపై భూమిక్ సోదరుడు బిందు దేబ్‌నాథ్‌ను బీజేపీ బరిలోకి దింపుతోంది.
సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సంసుల్ హక్ మరణంతో ఖాళీ అయిన త్రిపురలోని బోక్సానగర్ స్థానంలో సీపీఐ(ఎం), బీజేపీ పోటీ చేయనున్నాయి. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ సీటులో ఎస్‌పీ, కాంగ్రెస్, బీజేపీ పరస్పరం పోటీ పడనున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే చందన్ రామ్ దాస్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి బసంత్ కుమార్, ఎస్పీకి చెందిన భగవతీ ప్రసాద్‌లపై చందన్ రామ్ దాస్ భార్య పార్వతిని బీజేపీ పోటీకి దింపుతోంది.
కాంగ్రెస్ కురువృద్ధుడు ఊమెన్ చాందీ మృతితో కేరళలోని పుతుపల్లి స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ (యుడీఎఫ్) ఊమెన్ చాందీ తనయుడు చాందీ ఊమెన్‌ను బరిలోకి దించగా, అధికార పార్టీ సీపీఎం ఈ నియోజకవర్గం నుంచి జైక్ థామస్‌ను రంగంలోకి దించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే జాగర్నాథ్ మహ్తో మరణంతో జార్ఖండ్ డుమ్రీ సీటు ఖాళీ అయింది. ఇందులో I.N.D.I.A తరఫున జాగర్నాథ్ మహ్తో భార్య బేబీ దేవి పోటీచేస్తున్నారు.
NDA తరఫున యశోదా దే, AIMIM తరఫున అబ్దుల్ రిజ్వీ ఉప ఎన్నిక బరిలో దిగుతున్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో డుమ్రీ స్థానాన్ని గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని ధుప్‌గురి అసెంబ్లీ స్థానం బీజేపీకి చెందిన బిష్ణు పద రే మరణంతో ఖాళీ అయింది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ చంద్రరాయ్, సీపీఐ(ఎం) అభ్యర్థి ఈశ్వర్ చంద్రరాయ్‌పై బీజేపీ తాపసీ రాయ్‌ను బరిలోకి దింపుతోంది.