Five Congress Leaders : కాంగ్రెస్‌కు గుడ్ బై చెబుతున్న సీనియర్లు ! ఆపడం లేదా ? ఆగడం లేదా ?
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఐదు నెలల్లో ఐదుగురు గుడ్ బైచెప్పారు. వారిని ఆపేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు.
కాంగ్రెస్ పార్టీ ఓ వైపు చింతన్ శిబిరం నిర్వహించి. ఉత్సాహంగా టాస్క్ ఫోర్స్‌లు ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. ఐదు నెలల్లో వరుసగా ఐదుగురు సీనియర్ నేతలు పార్టీని వీడారు. తాజాగా కపిల్ సిబల్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి ఎస్పీ తరపున రాజ్యసభకు పోటీ పడటం ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్‌కు గుడ్ బైచెప్పిన నేతల వివరాలు.
కపిల్‌సిబల్ : ప్రముఖ న్యాయవాది, రాజకీయ వేత్త అయిన కపిల్ సిబల్ కాంగ్రెస్ అసంతృప్త నేతల్లో ఒకరిగా పేరు పొందారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ హైకమాండ్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఉదయ్ పూర్‌లో జరిగిన చింతన్ శివిల్‌పైనా విమర్శలు చేశారు. అధిష్టానం భ్రమలో కొనసాగుతోందని అన్నారు. హఠాత్తుగా ఆయన పార్టీని వీడి సమాజ్ వాదీ పంచన చేశారు.
సునీల్ జాఖడ్ : గత నెల పార్టీని వీడిన పంజాబ్ కాంగ్రెస్ యూనిట్ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్ బీజేపీలో చేరారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నిపై విమర్శలు చేశారంటూ జాఖడ్‌కు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులిచ్చింది. దీంతో ఆగ్రహించిన జాఖడ్ పార్టీకి రాజీనామా చేశారు. నాయకత్వం స్నేహితులు, శత్రువులను గుర్తించాల్సిన అవసరం ఉందని జాఖడ్ పేర్కొన్నారు. అయితే ఆయన ముందు నుంచి పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు.
హార్థిక్ పటేల్ : గుజరాత్ పాటిదార్ నేత హార్థిక్ పటేల్ ఈ నెల ప్రారంభంలో పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖలో రాహుల్‌గాంధీపై వరుస విమర్శలు చేశారు. తాను సమావేశమైనపుడు రాహుల్ మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ.. పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సమస్యల కంటే నేతలకు చికెన్ శాండ్ విచ్‌లు అందించడంలో ఎక్కువ ఆసక్తి కనబరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
అశ్వని కుమార్ : నాలుగు దశాబ్దాల అనుబంధం కలిగిన మాజీ న్యాయశాఖ మంత్రి అశ్వని కుమార్ ఫిబ్రవరిలో పార్టీని వీడారు. ఈ చర్య తన గౌరవాన్ని కాపాడుకునేందుకు తీసుకున్న నిర్ణయమని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో పార్టీ మరింత అధ: పాతాళానికి దిగజారిపోవడాన్ని చూడవచ్చని అన్నారు.
ఆర్.పి.ఎన్.సింగ్ : ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ కేంద్రమంత్రి అయిన ఆర్.పి.ఎన్ సింగ్ పార్టీనీ వీడి బిజెపిలో చేరారు. 32 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నానని.. కానీ సీనియర్ నేతలకు పార్టీలో విలువ లేదని అన్నారు. గతేడాది జితిన్ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరారు.
కాంగ్రెస్ నుంచి నేతలు ఇలా వెళ్లిపోతున్నా... పార్టీ హైకమాండ్ పెద్దగా పట్టించుకోవడం లేదు. సీనియర్లను వదిలించుకోవాలన్నట్లుగా ఉండటంతో వారిని వెనక్కి వచ్చేలా కూడా చేయడం లేదు.