Byreddy Siddhardha Reddy : శాప్ సమీక్షకు చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి డుమ్మా - రూమర్స్ నిజమేనా ?
కర్నూలు జిల్లా వైఎస్ఆర్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పార్టీకి...శాప్ చైర్మన్ గా బాధ్యతలకూ దూరంగా ఉంటున్నారు. కొత్త మంత్రి రోజా నిర్వహించిన సమీక్షకూ హాజరు కాలేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నరాని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాను ఎప్పటికీ జగన్ విధేయుడనేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని ఆయన మీడియా ప్రతినిధుల్ని పిలిచి చెప్పారు. కానీ ఆయన మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూర దూరంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ హోదాలో ఉన్నారు. ఇటీవలి వరకూ ఆయన శాప్ చైర్మన్‌గా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన అంటీముట్టనట్లుగా ఉన్నారు.
ఇటీవల మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో యువజన వ్యవహారాల శాఖను రోజాకు కేటాయించారు. శాప్ కూడా ఆమె మంత్రిత్వ శాఖ పరిధిలోకే వస్తుంది. శాప్ వ్యవహారాలపై తిరుపతిలో సమీక్ష ను రోజా నిర్వహించారు. ఈ సమీక్షలో అంతా తానై వ్యవహరించాల్సిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరు కాలేదు. ఈ సమీక్షకు ప్రిన్సిపల్ సెక్రటెరీ వాణిమోహన్ ,శాప్ ఎండి సహా ఇతరు అధికారులు హాజరు అయ్యారు. శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి డుమ్మా కొట్టారు. సిద్దార్థ రెడ్డి ఎందుకు రాలేదన్న అంశంపై ఎవరికీ క్లారిటీ లేదు. అయితే జరుగుతున్న పరిణామాలపై అవగాహన ఉందేమో కానీ రోజా ఈ విషయాన్ని పట్టించుకోకుండానే సమీక్ష ముగించి వెళ్లారు.
వైఎస్ఆర్‌సీపీ నేతల్లో మాత్రం ఈ అంశంపై విస్తృతంగా చర్చలు జరుగుతోంది. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడబోనని.. మీడియాను పిలిచి మరీ చెబుతున్న ఆయన అదే సమయంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరం పాటిస్తున్నారు. దీనికి కారణం తన అసంతృప్తిని పార్టీకి తెలియచేయాలనుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంది కొట్కూరు బాధ్యతలను సిద్ధార్థ్ రెడ్డి చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకా ఆర్థర్ ఉన్నారు. ఆయనకు సిద్ధార్ధరెడ్డికి సరిపడటం లేదు. ఈ క్రమంలో వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ .. సిద్ధార్థరెడ్డికి హెచ్చరికలు జారీ చేసిందని నియోజకవర్గంలో వేలు పెట్టవద్దని చెప్పిందని తెలుస్తోంది. దీంతో సిద్ధార్థరెడ్డి అసంతృప్తికి గురయ్యారని చెబుతున్నారు.
లోకేష్‌కో సిద్దార్థరెడ్డి చర్చలు జరిపారో లేదో ఎవరికీ తెలియదు. తాను మాత్రం వైఎస్ఆర్‌సీపీలోనే ఉంటానని సిద్ధార్థరెడ్డి చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం పార్టీతో పాటు శాప్ చైర్మన్‌గా విధులకు దూరంగా ఉంటున్నారు. రాజకీయంగా ఎన్నో ఆశలు ఉన్న సిద్దార్థరెడ్డి తదుపరి ఏం చేయనున్నారన్నదానిపై కర్నూలు వైఎస్ఆర్‌సీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.