(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Congress : రేవంత్ మాట చెల్లడం లేదా ? కేబినెట్ విస్తరణ ఎందుకు ఆగింది ?
CM Revanth Reddy : కేబినెట్ విస్తరణకు హైకమాండ్ బ్రేక్ వేయడం రేవంత్‌కు ఎదురుదెబ్బగా మారింది. ఆయన మాటల్ని ఏకపక్షంగా హైకమాండ్ వినడం లేదని తాజా పరిణామంతో తేలిందని ఆ పార్టీ నేతలంటున్నారు.
Revanth cabinet expansion plan halt by high command : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం, ఆధిపత్య పోరు కనిపించకుండా భారీగా ఉందని కేబినెట్ విస్తరణ ఆగిపోవడం.. పీసీసీ చీఫ్ పదవి పై ఓ అంచనాకు రాలేకపోవడం వల్ల అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్ని భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నారు. ప్రాంతాలు, వర్గాలు సమీకరణాల్ని రెడీ చేసుకుని ఐదుగురి పేర్లతో హైకమాండ్ వద్దకు వెళ్లారు. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారని అనుకున్నారు. అయితే రేవంత్ కు పోటీగా మరో ఇద్దరు సీనియర్ మంత్రులు.. కేబినెట్‌లో ఫలానా వాళ్లకు చోటు కల్పించాలంటూ.. చెరో జాబితా సమర్పించారని తెలుస్తోంది. దీంతో హైకమాండ్ అన్ని పేర్లను పక్కన పెట్టింది.
ఏకాభిప్రాయం వస్తుందేమోనని హైకమాండ్ చర్చలు జరిపినప్పటికీ రాకపోవడంతో పక్కన పెట్టేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఆశావహులతో గట్టిగా పని చేయించడానికి వాటిని తాయిలాలుగా చూపించాలని ఆరు ఖాళీలు ఉంచారు. కానీ ఇప్పుడా పధవుల భర్తి అంత తేలికగా అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఒక్క రేవంత్ చాయిస్సే కాదు. హైకమాండ్ అనుమతి కూడా ఉండాలి. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న మొత్తం ఆరు స్థానాల్లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి, రంగారెడ్డి నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్క మల్ రెడ్డి మాత్రమే గెలిచారు. తనకు చాన్సివ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. ఎంపీగా ఓడిపోతే మంత్రి పదవి ఆఫర్ తో దానం నాగేందర్ పార్టీలో చేరారు.
మరో వైపు దామోదర రాజనర్సింహ.. రెండు పేర్లు ప్రకటించేశారు. సీతక్కకు డిప్యూటీ సీఎం ఇస్తారని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ లో అలజడి రేగింది. ఇక నామినేటెడ్ పోస్టుల వ్యవహారం తేలడం లేదు. ఎన్నికలకు ముందు కొంత మందికి నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. ఇప్పటికీ జీవో రిలీజ్ చేయలేదు. వాటికే అధికారిక హోదా ఇవ్వకపోతే కొత్తవి ఎప్పుడు భర్తీ చేస్తారోనని కాంగ్రెస్ క్యాడర్ టెన్షన్ పడుతోంది. అధికారంలోకి వచ్చి నెలలు గడిచిపోతున్నాయి కానీ.. కష్టపడిన దానికి ఫలం మాత్రం దక్కడం లేదని ద్వితీయ శ్రేణి నేతలు ఫీలవుతున్నారు.
పీసీసీ చీఫ్ పోస్టుతో పాటు మంత్రి పదవుల భర్తీని కూడా కొంతకాలం ఆపాలని హైకమాండ్ నిర్ణయంచడంతో రేవంత్ రెడ్డి ఇక పాలనపై దృష్టి పెట్టనున్నారు. ఈ నెలలో ఆయన పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టాల్సి ఉంది. అందులో రుణమాఫీకి నిధులతో పాటు అనేక పధకాలు అమలు చేస్తామని నమ్మకం కలిగించే విధంగా నిధులు కేటాయించాల్సి ఉంది. ముందు ఈ గండాన్ని గట్టెక్కాలని పాలనను దారిలో పెట్టుకోవాలని హైకమాండ్ సూచనలను పాటించేందుకు రేవంత్ రెడీ అయ్యారు. అంతిమంగా రేవంత్ రెడ్డి అనుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయారని అందుకే.. ఆయన జాబితాలను కాంగ్రెస్ పక్కన పెట్టి సీనియర్ నేతల మాటలకు విలువ ఇస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం సీనియర్లకు మరింత ఉత్సాహం ఇస్తోందని అనుకోవచ్చు.