Warangal Rahul Speech :ఒక్క చాన్స్ ఇవ్వండి - అది రైతు డిక్లరేషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ, బాధ్యత : రాహుల్
వరంగల్ డిక్లరేషన్ ప్రకటన కాదు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారంటీ అని రాహుల్ గాంధీ తెలిపారు. డిక్లరేషన్‌పై విస్తృత చర్చ జరపాలని సూచించారు. వరంగల్ సభలో ఆయన కీలక అంశాలపై మాట్లాడారు.
వరంగల్ రైతు సంఘర్షణ సభ వేదికగా రేవంత్ రెడ్డి ప్రకటించిన డిక్లరేషన్ కేవలం కాగితం కాదని.. అది రైతులకు కాంగ్రెస్ పార్టీ తరపున ఇస్తున్న గ్యారంటీ కార్డు అని రాహుల్ గాంధఈ ప్రకటించారు. రైతు సంఘర్షణ సభలో ప్రసంగించిన రాహుల్ డిక్లరేషన్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీ ఆందోళన తీర్చేస్తామని భరోసా ఇచ్చారు. మరోసారి డిక్లరేషన్ చదవండీ... రైతులందరితో చదివించండి.. ప్రతి అంశంపై చర్చించండి.. కాంగ్రెస్ గ్యారెంటీ అని ఇంటింటికీ తిరిగి చెప్పండి. రైతులు బలహీన పడితే తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో నడవలేదని రాహుల్ గుర్తు చేశారు. అలాంటి సందర్భంలో రైతులకు అండగా ఉండేందుకే ఈ డిక్లరేషన్ ప్రకటించాం. ఇది మీకు ధైర్యాన్ని ఇస్తుందని రాహుల్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు టీఆర్‌ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. రైతులకు, అన్ని వర్గాల వారికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ ప్రజలను ఎవరు మోసం చేస్తున్నారు... వేల కోట్లు అవినీతి చేసిందెవరూ.. దీనికి కారకులు ఎవరు, నష్టపరిచింది ఎవరూ మీరే చెప్పండని సభికులను రాహుల్ ప్రశ్నించారు. సభికుల నుంచి కేసీఆర్ అన్న నినాదాలు రావడంతో తెలంగాణను ఇంతలా మోసం చేసిన వాళ్లతో ఎలాంటి సంబంధం ఉండదని.. వారితో ఎలాంటి సంబంధం పెట్టుకోబోం అని స్పష్టం చేశారు. తెలంగాణ ఒక వ్యక్తి కోసం ఏర్పడలేదు. ప్రజల కోసం ప్రజల ఆకాంక్షల మేరకు ఎందరో త్యాగాలతో ఏర్పడింది. ఎనిమిదేళ్ల నుంచి పరిపాలన చేస్తున్న టీఆర్ఎస్ పరిపాలనలో కేవలం ఒక కుటుంబమే బాగుపడుతోందన్నారు. మిగతా వారి పరిస్థితి ఏంటని రాహుల్ ప్రశ్నించారు.
రైతుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహించాలని రాహుల్ ప్రశ్నించారు. నెలకు వెయ్యిమంది తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటున్నారని దీనిక ఎవరు సమాధానం చెప్తారన్నారు. సోనియా గాంధీ చొరవ వల్ల తెలంగాణ ఏర్పడింది. ల కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుందని తెలిసినా రాష్ట్ర ఏర్పాటు వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని నష్టం జరిగిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని రాహుల్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు సంబంధించి ప్రజల ప్రభుత్వం ... రైతుల ప్రభుత్వం.. బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించామని కానీ అది కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఉన్నారు. ఆయన సీఎం కాదు... రాజులా మారిపోయారు. రాజుకు ముఖ్యమంత్రికి తేడా ఏంటంటే... ముఖ్యమంత్రి ప్రజల సంబంధించిన వ్యక్తిగా ప్రజాస్వామ్యంగా పరిపాలన చేస్తారు. రాజు తన ప్రజల గురించి ఆలోచించలేరు.. ముఖ్యమంత్రి జనాల బాధలు వింటారు. రాజు ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోరు. తన మైండ్‌లో ఉన్నదే చేస్తారు. అందరూ పాటించాలని ఆదేశిస్తాడు. ఇదీ వీళ్లిద్దరి మధ్య తేడా అని కేసీఆర్ పాలనను విశ్లేషించారు. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు రెండు ఎన్నికల హామీలు ఇచ్చాం. రైతు రుణమాఫీ, పండించిన వరి పంటకు కనీస మద్దతు ధర కు అదనంగా బోనస్ ప్రకటించాం. ఇప్పుడు దాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. మీలో ఎవరైనా ఛత్తీస్‌గడ్ వెళ్లండి అడగండీ ఏం జరుగుతుందో... వాళ్లే చెబుతారన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం రైతుల బాధలు పట్టించుకోరు. వాళ్ల గోస ఆయనకు పట్టదు. ఆయన ఇద్దరు ముగ్గురు వ్యాపారుల మాట మాత్రమే వింటున్నారు. పత్తి, మిర్చి రైతులకు కనీసంమద్దతు అందడం లేదు. తెలంగాణ రైతులు ఆందోళన చెందవద్దు.. రాబోయే కాలంలో రెండు లక్షల రుణమాఫీ ఒకటే సారి చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ఆందోళన చెందవద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని రాహుల్ భరోసా ఇచ్చారు.
టీఆర్ఎస్ తో పొత్తుపై
తెలంగాణను ఆగం చేసిన కేసీఆర్‌తో కలిసే ప్రసక్తే లేదని వరంగల్ రైతు సంఘర్షణ వేదికగా రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇకపై ఈ ప్రశ్న ఏ కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు అడిగినా బహిష్కరిస్తామని ప్రకటించారు. వాళ్లెవరైనా ఎంత పెద్దవాళ్లైనా సరే పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్‌ఎస్, బీజేపీ నేతలతో సంబంధాలు పెట్టుకున్నా పార్టీని విడిచిపెట్టి పోవచ్చునని అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ కు అవసరం లేదని తేల్చి చెప్పారు. సిద్ధాంత పరమైన పోరాటం చేసి టీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
టీఆర్‌ఎస్ - బీజేపీ మధ్య ఒప్పందం ఉందని రాహుల్ గాంధీ ారోపించారు. పార్లమెంట్‌లో మోదీ నల్లచట్టాలు తీసుకొస్తే దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా టీఆర్‌ఎస్ మద్దతు పలికిందని గుర్తు చేారు. అందుకే ఈ రెండు పార్టీలు ఒక్కటేనన్నారు. తెలంగాణలో నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి లేదని బీజేపీకి తెలుసన్నారు. అందుకే బీజేపీ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలుసుకొని బీజేపీ, టీఆర్‌ఎస్ ఒక్కటయ్యారని రాహుల్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంత అవినీతి చేసినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా కానీ ఇతర దర్యాప్తు సంస్థల ద్వారా గానీ విచారణ చేయించడం లేదని గుర్తు చేశారు