Chandrababu Assets : నాలుగోసారి సీఎం - చంద్రబాబు అస్తులెన్నో తెలుసా ?
Chandrababu : నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేయబోతున్న చంద్రబాబు ఆస్తుల ఎంత ? ఆయనపై విపక్ష నేతలు చేసే ఆరోపణల్లో నిజం ఎంత ?
Chandrababu Assets details : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్. నాలుగో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లకు ఎదిగారని ప్రత్యర్థులు ఆరోపిస్తూంటారు. అయితే చంద్రబాబునాయుడు కుటుంబం ప్రతి ఏడాది ఆస్తుల్ని ప్రకటిస్తూ ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన నామినేషన్‌లోనూ ఆస్తుల ఆఫిడవిట్ ను ప్రకటించారు. ఆ ప్రకారం చంద్రబాబుకు ఉన్న ఆస్తులు ఇవే.
చంద్రబాబు పేరు మీద మొత్తం రూ.36.36 కోట్లు ఆస్తులు
చంద్రబాబు పేరు మీద మొత్తం రూ.36.36 కోట్లు ఆస్తులున్నాయి. వీటిలో చరాస్తులు రూ.4.80 లక్షలు, వీటిలో ఏపీ 9 జీ 393 నంబరు అంబాసిడర్ కారు కూడా ఉంది. దాని విలువ రూ.2,22,500. నిజానికి ఇప్పుడు అంబాసిడర్ కార్లు లేవు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో దీన్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంత కాలం అయినందున ఈ కారు ఇంత విలువ కట్టడం కొంచెం ఎక్కువేనని ఆటోమోబైల్ నిపుణులు చెబుతున్నారు.
గ్రాము బంగారం కూడా లేని చంద్రబాబు
తాను ఉంగరాలు, వాచీలు పెట్టుకోనని చంద్రబాబు పలు సందర్బాల్లో చెప్పారు. ఓ సందర్భంలో ఆయన వేలికి ఓ ఉంగరం కనిపించడంతో ప్లాటినం ఉంగరం పెట్టుకున్నారన్న ప్రచారం జరిగింది .కానీ అది హెల్త్ ట్రాక్ చేసే స్మార్ట్ రింగ్ అని తర్వాత తేలింది. చంద్రబాబు చెప్పినట్లుగానే ఆయనకు ఒక్క గ్రాము బంగారం కూడా లేదు. స్థిరాస్తులు రూ.36.31 కోట్లున్నాయి.
మూడున్నర కోట్ల అప్పు
కుమారుడు లోకేశ్‌తో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.3.48 కోట్లు ఇంటి రుణం తీసుకున్నారు. ఇది ఒక్కటే చంద్రబాబుకున్న అప్పు. జూబ్లిహిల్స్ లో గతంలో ఉన్న ఇంటిని కూల్చి వేసి కొత్త ఇంటిని నిర్మించారు. ఆ ఇంటి కోసం తీసుకున్న రుణానికి ఈఎంఐలు చెల్లిస్తున్నారు.
కుటుంబ సభ్యుల ఆస్తులు ఎక్కువే !
చంద్రబాబు భార్య భువనేశ్వరి ఆస్తులు రూ.895 కోట్లు. వీటిలో చరాస్తులు రూ.810.37 కోట్లు.. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లోని 2,26,11,525 షేర్ల విలువ రూ.763.93 కోట్లు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత షేర్ల విలువ అమాంతం పెరిగింది. అందుకే ఇప్పుడు ఈ షేర్ల విలువ వెయ్యి కోట్లు దాటిపోయిందని అంచనా వేస్తున్నారు. బంగారం, ఇతర ఆభరణాలు కలిపి రూ.1.40 కోట్లు. స్థిరాస్తులు రూ.85.10 కోట్లు కాగా.. అప్పులు రూ.6.83 కోట్లు. ఇందులో కుమారుడు లోకేశ్ నుంచి రూ.1.27 కోట్లు తీసుకోవడం విశేషం. భువనేశ్వరి పేరుపై కారు లేదు.
చంద్రబాబు ఆస్తులపై రాజకీయ పార్టీల నేతలు.. ప్రత్యర్థులు తరచూ విమర్శలు చేస్తూంటారు. అయితే ప్రకటించిన ఆస్తులు కాకుండా.. ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా.. చూపించిన వారికే ఇచ్చేస్తానని లోకేష్ ఆస్తులు ప్రకటించినప్పుడల్లా సవాల్ చేశారు. కానీ ఎవరూ ఇంత వరకూ నిరూపించలేకపోయారు.