Steel Plant Issue : స్టీల్ ప్లాంట్ కోసం బిడ్‌కు తెలంగాణ రెడీ - మరి ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది?
స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనాలని ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. మంత్రి అమర్నాథ్ మాత్రం సాధ్యం కాదంటున్నారు.
Steel Plant Issue : విశాఖ ఉక్కు పరిశ్రమప్రైవేటీకరణలో భాగంగా జారీ చేసిన ఎక్స్‌ప్రె్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు రాజకీయ కదనరంగానికి వేదికగా మారింది. కేంద్ర ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని బీఆర్ఎస్ పార్టీ.. ఏకంగా బిడ్ వేసేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో అందరూ ఏపీ ప్రభుత్వం వైపు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వమే ఇలా బిడ్ వేస్తూంటే... విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని నినదించిన ఏపీ ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంటోందని ప్రశ్నించేవారు ఎక్కువగా ఉన్నారు. ఓ రకంగా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కానివ్వబోమని ప్రకటించిన వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా బిడ్డింగ్‌లో పాల్గొనాలని కోరుతున్నారు.
బిడ్డింగ్‌లో పాల్గొనాలని ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి !
స్టీల్ ప్లాంట్ మూలధనం కోసం జారీ చేసిన ఈవోఐలో ఏపీ ప్రభుత్వం కూడా పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తర్వాత ఎక్కువ డిమాండ్లు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని సొంత పార్టీ నేతలు కూడా సలహా ఇస్తున్నారు. అయితే ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రం అసలు ఏపీ ప్రభుత్వం బిడ్డింగ్‌లో పాల్గొనే చాన్సే లేదని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వమే నడపలేకపోతోందని రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడుపుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌లో పాల్గొనాలని అనుకోవడం రాజకీయమేనని గుడివాడ అమర్నాథ్ అంటున్నారు.
అవసరమైతే ప్రభుత్వమే కొంటుందని గతంలో వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రకటనలు !
పరిశ్రమల మంత్రి మీడియాతో చేసిన ప్రకటన ఎలా ఉన్నా.. అసలు ప్రభుత్వ స్పందన ఏమిటన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం జరిగినప్పుడు ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఆ పార్టీకి చెందిన ఎంపీలు కార్మికులకు పలు రకాల భరోసాలు ఇచ్చారు. కేంద్రంతో వీలైనంత వరకూ పోరాడుతామని .. అవసరమైతే స్టీల్ ప్లాంట్ ను ఏపీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. అప్పట్లో కార్మిక సంఘాలను ఢిల్లీకి తీసుకెళ్లికేంద్ర ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలు కూడా ఇప్పించిన వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కూడా ఇదేమాట అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఏపీ అధికార పార్టీ పూర్తి సైలెంట్ గా ఉంది. బిడ్డింగ్‌లో పాల్గొంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించన తర్వాత కూడా స్పందించడం లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాకే చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తాం కానీ అంతకు మించి ఏమీ చేయలేమని చెబుతున్నారు.
రాజకీయమే చేయవచ్చు కదా !
బీఆర్ఎస్ ప్రభుత్వం బిడ్డింగ్‌లో పాల్గొనాలని నిర్ణయంచుకోవడం రాజకీయమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కేవలం బీఆర్ఎస్ పార్టీని ఏపీలో విస్తరించుకోవడానికి ఆ రాష్ట్రం కోసం నిలబడ్డామని చెప్పుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌లో గెలవని విధంగా అసాధారణ రీతిలో బిడ్డింగ్ వేస్తుందని.. సహజంగానే అది తిరస్కరణకు గురవుతుందని అనుమానిస్తున్నారు. ఇదంతా రాజకీయమే అంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం కూడా తమపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టాడనికి ఇలాంటి రాజకీయమే చేయవచ్చు కదా అనే ప్రశ్నలు వైఎస్ఆర్సీపీ క్యాడర్ నుంచి వస్తున్నాయి. బిడ్ వస్తుందో రాదో తర్వాత సంగతి బిడ్ వేస్తే.. రాజకయంగా వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు.
బిడ్డింగ్ దాఖలు చేయడానికి ఈ నెల 15వ తేదీనే ఆఖరు. అంటే మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే తీసుకోవాల్సి ఉంటుంది.