Posani Krishna Murali: 'జగన్‌ది గ్రేట్ పాలిటిక్స్, చంద్రబాబుది డర్టీ పాలిటిక్స్' - తిరుమల డిక్లరేషన్ వివాదంపై పోసాని ఘాటు వ్యాఖ్యలు
Andhra News: తిరుమల కొండకు వెళ్లేందుకు జగన్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలని వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. తిరుమల డిక్లరేషన్ అంశంపై ఆయన సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
Posani Comments On CM Chandrababu: వైసీపీ అధినేత జగన్‌ది (YS Jagan) గ్రేట్ పాలిటిక్స్.. చంద్రబాబుది డర్టీ పాలిటిక్స్ అని వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ తిరుపతి కొండకు వెళ్లడానికి డిక్లరేషన్ ఎందుకివ్వాలని ప్రశ్నించారు. తిరుమల డిక్లరేషన్ వివాదంపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకొంటున్న సీఎం చంద్రబాబు.. ఒకప్పుడు అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల మద్యం అమ్మకాలు జరగడం లేదని వ్యాఖ్యలు చేసినట్లు గుర్తు చేశారు. జగన్‌ను డిక్లరేషన్ అడిగే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. ఓట్ల కోసం ఏ అఫిడవిట్ లేకుండా క్రిస్టియన్, ముస్లింల ఇంటికి వెళ్తారని.. అప్పుడు చంద్రబాబు ఎవరికైనా అఫిడవిట్ ఇచ్చారా.? అంటూ ఎద్దేవా చేశారు. తాను హిందువునని.. తాను, తన భార్యతో కలిసి మసీద్, చర్చి అన్నింటికీ వెళ్లానని.. మాకు ఎక్కడా అఫిడవిట్ అడగలేదని పేర్కొన్నారు. జగన్ ఏ పాపం చేశారని.. ఆయన్ను ఎందుకిలా హింసిస్తున్నారని నిలదీశారు.
'అక్కడ అఫిడవిట్ తీసుకున్నారా.?'
తనకు ఏ పార్టీలో కలవాలని లేకున్నా.. ఢిల్లీ నుంచి వచ్చి కలవండి అంటే బీజేపీలో కలిశానని చంద్రబాబు చెప్తున్నారని పోసాని పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రధాని మోదీని తిట్టిన ఆయన.. మళ్లీ ఢిల్లీకి వెళ్లి మోదీ, అమిత్ షాలను కలిసిన ఫోటోలను చూశామని చెప్పారు. 'చంద్రబాబు లాంటి వ్యక్తి ఉంటారనే అంబేడ్కర్ చాలా బలమైన రాజ్యాంగం రాశారు. ఇలాంటి వారి వల్ల కాస్త స్వేచ్ఛగా బతుకుతున్నాం. పార్టీలతో పొత్తు పెట్టుకునేటప్పుడు చంద్రబాబు దగ్గర అఫిడవిట్ ఎందుకు తీసుకోరు.?. తిరుమలను నాశనం చేయాలని చూస్తున్నారని, ఇది భక్తులు తెలుసుకోవాలి. చంద్రబాబు దేవుడి కంటే అతీతుడు కాదు.' అంటూ పోసాని వ్యాఖ్యానించారు.
'భక్తుల మనోభావాలు దెబ్బతీశారు'
శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే టీడీపీ ఆఫీసులో ఎన్‌డీడీబీ రిపోర్టును లీక్ చేశారని.. ఏదీ జరగకుండానే ఏదో జరిగినట్లు తీవ్ర ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అయోధ్య రామాలయం వారు ఇక్కడి విధానాలు నచ్చి ఇక్కడి నుంచి తీసుకోవడానికి ముందుకు వచ్చారన్నారు. కల్తీ లేకుండా ప్రసాదాలు, భోజనాలు అందించిన చరిత్ర టీటీడీదని.. ఇప్పుడు ఆ నమ్మకాన్ని చంద్రబాబు పోగొట్టేలా చేస్తున్నారని విమర్శించారు. 'షోకాజ్ నోటీసులో జంతువుల కొవ్వుకు సంబంధించిన అంశం లేదు. జంతువుల కొవ్వు ఉన్నట్లు ఏ రిపోర్టులోనూ చూపించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో మాదిరిగానే మా ప్రభుత్వ హయాంలోనూ ట్యాంకర్లు వెనక్కు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. బుడమేరు వరదలపై చర్చను డైవర్ట్ చేసి లడ్డూ వివాదం వైపు మళ్లించారు. తిరుమల కొండకు వెళ్లేందుకు డిక్లరేషన్ అవసరమా.?. దానిపై టీటీడీ వారు మాట్లాడాలి కానీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతుంది.' అని సజ్జల నిలదీశారు.
Also Read: Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం