Congress: తొలిసారి గాంధీభవన్‌కు పొంగులేటి, శాలువా కప్పి సత్కరించిన రేవంత్ రెడ్డి
Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిక తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి గాంధీ భవన్ కు వచ్చారు.
Congress: ఖమ్మం మాజీ ఎంపీ, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి గాంధీ భవన్ కు వచ్చారు. ఆయనకు పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ నెలలో ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో లక్షలాదిమంది కార్యకర్తలు, అభిమానుల మధ్య రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాహుల్ గాంధీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత మొదటిసారి గాంధీ భవన్ కు వచ్చిన పొంగులేటికి రేవంత్ రెడ్డి శాలువా కప్పి సత్కరించారు. పూలబొకే ఇచ్చి ఆహ్వానం పలికారు. పొంగులేటి రాకతో గాంధీ భవన్ లో కాసేపు సందడి నెలకొంది. అనంతరం రేవంత్ రెడ్డితో పొంగులేటి భేటీ అయ్యారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికల కోసం పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలనే విషయంపై చర్చించినట్లు సమాచారం.
బాధ్యతలు ఇచ్చినందుకు పొంగులేటి కృతజ్ఞతలు
ప్రచార కమిటీ కో చైర్మన్ బాధ్యతలు ఇచ్చినందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఏఐసీసీ, పీసీసీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. 'పార్టీని అధికారంలోకి తీసుకరావడానికి కష్టపడి పనిచేస్తాను. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదు. కల్వకుంట్ల కుటుంబం రాజులు పాలిస్తున్నారు. హామీ తప్పా అమలు చేయడం లేదు. పథకాలను లాంచింగ్ చేయడం తప్పా అమలు చేయడం లేదు. కేసీఆర్ పాలన వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. అధికార మదంతో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కల్వకుంట కుటుంబం ఎక్కడ ఉండేది. కేసీఆర్ దీక్ష చేస్తేనే రాష్ట్రం వచ్చిందా.. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు కేసీఆర్. ఆచరణకు, అమలుకు సాధ్యమైన హామీలనే కాంగ్రెస్ ఇస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అన్నింటిని కచ్చితంగా అమలు చేస్తుంది' అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.
'బీఆర్ఎస్ రాజకీయ కక్ష సాధింపులకు దిగుతోంది'
తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలపైనా స్పందించిన పొంగులేటి.. బీఆర్ఎస్ రాజకీయ కక్ష సాధింపులకు దిగుతోందని అన్నారు. 'నేను 20 గుంటల భూమి కబ్జా చేసానంటే ఎవరైనా నమ్ముతారా. నాపై బురదజల్లే ప్రయత్నం జరుగుతుంది. నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించా. నేను కబ్జా చేసినట్లు తెలితే.. నా భూమి మొత్తం రాసిస్తా.. యస్.ఆర్ గార్డెన్ పడగొట్టాలని చూశారు. యస్.ఆర్ గార్డెన్ కట్టి 13 సంవత్సరాలు అయింది. అప్పుడే ఎందుకు సర్వే చేయలేదు. రాజకీయ కక్ష సాధింపులకు బీఆర్ఎస్ దిగుతోంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఓకలా.. పార్టీ మారాక ఇప్పుడు ఓకలా ఉంటుంది. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ విమర్శల దాడి పెరిగిందంటేనే.. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని అర్థం' అని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ను ఓడించి తీరుతామంటూ పొంగులేటి మరోసారి ఉద్ఘాటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా తన వంతు పాత్ర పోషించడానికి ముందుకొచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తొలిసారి గాంధీ భవన్ వచ్చిన సందర్భంగా సాదరంగా ఆహ్వానించి సత్కరించడం జరిగింది.
— Revanth Reddy (@revanth_anumula) July 18, 2023
కేసీఆర్ విముక్త్ తెలంగాణలో భాగంగా శీనన్న లాంటి నాయకులు సేవలు ఎంతో అవసరం. మా… pic.twitter.com/DkbrCvaq65