Telangana New Alliance : మునుగోడు ప్రయోగం సక్సెస్ - ఇక తెలంగాణలో పొత్తుల రాజకీయాలు ఖాయం !
తెలంగాణలో ఇక పొత్తుల రాజకీయాలు ప్రారంభం కానున్నాయి. వామపక్షాల సహకారం.. టీఆర్ఎస్‌కు కలసి రావడంతో ఇక ముందు వారు కలిసి పోటీ చేయనున్నారు.
Telangana New Alliance : తెలంగాణలో మాకు ఎవరితోనూ పొత్తులుండవు.. ప్రజలతోనే పొత్తులు అని కేటీఆర్ తరచూ చెబుతూంటారు. కానీ మునుగోడు ఉపఎన్నిక సీన్ మార్చేసింది. కమ్యూనిస్టులతో పొత్తులు ప్రకటించారు. తమ పయనం మునుగోడుతోనే కాదని.. ముందు ముందు కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో మునుగోడు ఉపఎన్నిక తెలంగాణలో పొత్తులకూ ఓ రూపు తెచ్చిందని అనుకోవచ్చు.
ఇప్పటి వరకూ పొత్తుల జోలికివెళ్లని టీఆర్ఎస్ !
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. 2014లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ సింగిల్ గా పోటీ చేయగా.. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయితే రాష్ట్రంలో తాజాగా పార్టీల మధ్య సమీకరణలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న వామపక్షాలు కారు పార్టీకి దగ్గరయ్యాయి. నాగార్జున సాగర్, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతు ఇచ్చాయి వామపక్షాలు. తాజాగా జరిగిన నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీకి జై కొట్టాయి.
తమ పార్టీల మధ్య సహకారం కొనసాగుతుందన్న కేసీఆర్, వామపక్షాలు
మునుగోడు లో మద్దతు ఇచ్చినందుకు కమ్యూనిస్టులుక కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు. ఈ పొత్తు మునుగోడుకే పరిమితం కాదని.. భవిష్యత్ లోనూ కొనసాగుతుందని చెప్పారు. ప్రగతిశీల శక్తులను కలుపుకుని పోతామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది. సీపీఐ, సీపీఎం కేంద్రం నేతలతో ప్రగతి భవన్ లో కేసీఆర్ చర్చలు జరిపారు. ఆ సమయంలోనే పొత్తుల అంశంపై క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. బీజేపీని అడ్డుకోవాలంటే కేసీఆర్ తో కలిసి నడవడమే మంచిదని సీపీఐ, సీపీఎం నేతలు నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. జాతీయ రాజకీయాల కోణంలోనే అదే మంచిదని...వామపపక్షాలు భావిస్తున్నాయి.
తెలంగాణలో వామపక్షాలకు మంచి బలం !
ఉమ్మడి నల్గొండ , ఖమ్మం జిల్లాలో గతంలో వామమక్షాలు బలంగా ఉండేవి. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని పలు సెగ్మెంట్లలోనూ కామ్రెడ్లకు పట్టుంది, ఉ ఎప్పుడు ఒంటరిగా పోటీ చేసి మాత్రం గెలవలేదు. 1984, 1989, 1994లో టీడీపీతో వామపక్షాలు పొత్తులో ఉన్నాయి. 2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయి. 2009లో టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసిపోటీ చేశాయి. 2014లో దేవరకొండ నుంచి గెలిచిన సీపీఐ ఎమ్మెల్యే.. తర్వాత అధికార పార్టీలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత బలహీనమయ్యారు కామ్రెడ్లు. చాలా నియోజకవర్గాల్లో కేడర్ ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఉమ్మడి, నల్గొండ జిల్లాల్లోని కొన్ని సెగ్మెంట్లలో ఆ పార్టీకి 15 వేల నుంచి 25 వేల ఓట్లు ఉన్నాయి. అందుకే పొత్తులు ఉభయపార్టీలకు పొత్తు ప్రయోజనకరం అంటున్నారు.
విపక్షాలు పొత్తుల వైపు మొగ్గు చూపుతాయా ?
తెలంగాణలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ చెబుతోంది. కాంగ్రెస్ కూడా అంతే. నిజానికి ఈ రెండు పార్టీలతో పొత్తులు పెట్టుకునే పార్టీలు లేవు. తెలుగుదేశం పార్టీకి బలం లేదు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువని భావిస్తూంటారు. ఇక బీఎస్పీ ఉంది. ప్రవీణ్ కుమార్ ఆ పార్టీలో చేరిన తర్వాత కాస్త బలం పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసే చాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. ఇతర పార్టీల్నీ ఎవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదు.