No Permission: చంద్రబాబు సభకు అనుమతి నిరాకరణ, తెలుగుదేశం నేతల ఆందోళన
TDP Serious: ఇంకొల్లులో తెలుగుదేశం బహిరంగ సభకు అనుమతి లేదంటూ పనులు అడ్డుకున్న పోలీసులు, వైకాపా నేతలు కుట్ర చేసి అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలుగుదేశం ఆరోపణ
TDP Sabha: బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరిగే రా..కదలి రా సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై తెలుగుదేశం(TDP) నేతలు మండిపడుతున్నారు. ఓటమి భయంతోనే జగన్( Jagan) చంద్రబాబు సభకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలే పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆటంకాలు కలిగిస్తున్నారన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ జరిపి తీరతామని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు(Eluri Samba Sivarao) స్పష్టం చేశారు.
సభకు అనుమతి లేదు
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (CBN) రాష్ట్రవ్యాప్తంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రా..కదలిరా పేరిట సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలాచోట్ల బహిరంగ సభలు నిర్వహించగా ఈనెల 17న బాపట్ల జిల్లా ఇంకొల్లు(Inkollu)లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఏర్పాట్లు ప్రారంభించారు. ఇంకొల్లు -పావులూరి రహదారి పక్కనే సభ కోసం భూమినిచదును చేస్తుండగా పోలీసులు వచ్చి అడ్డుకున్నారు ఈ భూమి దేవదాయశాఖ పరిధిలో ఉందని....వారి అనుమతి లేకుండా సభ నిర్వహించడానికి వీల్లేదని తెలిపారు. దీనిపై తెలుగుదేశం(TDP) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపా నేతల కుట్రే: తెలుగుదేశం
ఇంకొల్లు-పావులూరు రహదారి పక్కన 30 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహించాలని తెలుగుదేశం నేతలు నిర్ణయించారు. ఇందులో 19 ఎకరాలు దేవాదాయశాఖ భూమి ఉండగా మిగిలిన భూమి రైతులది. వారంతా సభ నిర్వహణకు అంగీకరించారు. దేవదాయశాఖ భూమిని కౌలుకు సాగు చేసుకుంటున్న రైతులను కూడా తెలుగుదేశం నేతలు సంప్రదించగా..వారు సరేనన్నారు. దీంతో ఇక్కడ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండగా పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. కౌలు చేసుకుంటున్న రైతులతో కాకుండా దేవదాయశాఖ అధికారుల అనుమతి తీసుకోవాలంటూ మెలికపెట్టారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే సభా ఏర్పాట్లు అడ్డుకున్నారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నిర్వహణకు ముందుగానే అనుమతులు తీసుకున్నా...కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో చివరి నిమిషంలో ఇలా చేయడం ఏంటని ఆయన మండిపడ్డారు.
గతంలోనూ అడ్డంకులు
తెలుగుదేశం సభలు, యాత్రలకు అధికారపార్టీ అడ్డంకులు సృష్టించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు అడ్డంకులు సృష్టించింది. చంద్రబాబు, లోకేశ్ యాత్రలు సాగకుండా ఏకంగా ప్రత్యేకంగా జీవోనెంబర్ 1 తీసుకొచ్చింది, చంద్రబాబు కుప్పం పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంది. ఆయన ప్రచార రథాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్ట్ ల సందర్శనకు బయలుదేరితే అనుమతులు ఇవ్వలేదు. ఇక లోకేశ్ యువగళం యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. ఆయన మైకు లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు, బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దంటూ ఆటంకాలు కలిగించడంపై అప్పట్లో తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు ఇంకొల్లు సభకు అనుమతి లేదని చెప్పడంపై వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు ప్రభుత్వ స్థలంలో అనుమతి నిరాకరించడంతో ప్రైవేట్ స్థలంలో నిర్వహించుకున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా సరేసరి లేకుంటే తెలుగుదేశం నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.