Peoples Front KCR : మార్చి 3న వారణాశిలో పీపుల్స్ ఫ్రంట్ ఆవిర్భావం ? మెగా ర్యాలీ ప్లాన్ చేస్తున్న మమతా బెనర్జీ !
పీపుల్స్ ఫ్రంట్ పేరుతో దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారణాశిలో మమతా బెనర్జీ నిర్వహించే ర్యాలీలో బీజేపీ నేతలు వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల నేతలు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.
ప్రగతి భవన్‌లో కేసీఆర్ ( KCR ) చెప్పిన పీపుల్స్ ఫ్రంట్ ( Peoples Front ) దిశగా అడుగులు పడుతున్నాయి. తాను ఫోన్లో తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ తో మాట్లాడానని దేశంలోని సమాఖ్యవాదాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ( Mamata Benarjee ) ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో ఇతర ప్రాంతీయ పార్టీలు సఖ్యతగా లేవని.. ఆ పార్టీ తన దారిలో తాను వెళ్తోందన్నారు. మా దారిలో మేము వెళ్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. యూపీలో మమతా బెనర్జీ సమాజ్ వాదీ పార్టీకి ( SP ) మద్దతు తెలిపారు. ఆ పార్టీకి ఇబ్బందికరం కాకూడదని పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. కానీ మోడీ నియోజకవర్గం వారణాశిలో ( Varanasi ) భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి మూడున ఈ మెగా ర్యాలీ జరుగుతుంది.
వారణాశిలో జరగనున్న మెగా ర్యాలీకి అన్ని ప్రాంతీయ పార్టీల నేతలూ హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే మోడీపై విరుచుకుపడుతున్నారు. యూపీలో- ( UP Elections ) సమాజ్ వాదీగా మద్దతు పలుకుతారన్న ప్రచారం కూడా జరిగింది. అది నేరుగా వెళ్లి ర్యాలీలో పాల్గొని మద్దతు ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇక స్టాలిన్ ( Tamil Nadu CM Stalin ) మమతా బెనర్జీకి ఇప్పటికే మద్దతు ప్రకటించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ - గవర్నర్ మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో బెంగాల్ అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తూ బెంగాల్ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై స్టాలిన్ మండిపడ్డారు. తమిళనాడులోనూ స్టాలిన్‌కు గవర్నర్‌తో చిక్కులు ఉన్నాయి. నీట్ బిల్లును గవర్నర్ వెనక్కి పంపారు. ఇలాంటి పరిస్థితులతో గవర్నర్ వ్యవస్థకి వ్యతిరేకంగా అందరూ ఏకమయ్యే అవకాశం కనిపిస్తోంది.
త్వరలో బీజేపీయేతర సీఎంలందరూ ఢిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అలా సమావేశం అయితే ఓ ప్రాంతీయ పార్టీల కూటమికి దగ్గర దారి ఏర్పడినట్లే అనుకోవాలి.కే సీఆర్ కూడా అదే కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉంది. ఇటీవల కేసీఆర్ కూడా గవర్నర్‌తో సఖ్యతగా లేరు. రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ రాజ్ భవన్‌కు హాజరు కాలేదు. గవర్నర్ బయటకు తెలియని రాజకీయం ఏదో చేస్తున్నారని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా గవర్నర్ల వ్యవస్థపై బీజేపీయేతర సీఎంలు తొలి పోరాట కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
బీజేపీయేతర సీఎంల సమావేశం మార్చి మూడున వారణాశి ర్యాలీ తర్వాత జరుగుతుందా.. ముందు జరగుతుందా అన్నదానిపై క్లారిటీ లేదు. ఓ సారిప్రాంతీయ పార్టీల నేతలందరూ కలసి చర్చించుకుంటే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముందుగా వారణాశి ర్యాలీలో అన్ని ప్రాంతీయ పార్టీల ముఖ్య నేతలూ కలిస్తే అదే జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం అయ్యే అవకాశం ఉంది. ఆ ర్యాలీనే పీపుల్స్ ఫ్రంట్ ఆవిర్భావంగా చెప్పుకోవచ్చు.