Pawan Modi Meet : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు - శుక్రవారం విశాఖలో మోదీతో పవన్ భేటీ ఖరారు !
విశాఖలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. ఓ వైపు వైఎస్ఆర్‌సీపీ ..మోదీ టూర్ మొత్తం తమ కనుసన్నల్లో జరిగేలా చూసుకున్న సమయంలో మోదీ నుంచి పవన్‌కు పిలుపు రావడం ఆసక్తి రేపుతోంది.
Pawan Modi Meet : ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం అందింది. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. మోదీ అపాయింట్‌మెంట్ పవన్‌కు ఖరారయింది. శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ విశాఖ చేరుకుంటారు. పవన్ కల్యాణ్ కూడా అంతకు ముందే ప్రత్యేక విమానంలో విశాఖకు వెళ్తారు. మోదీతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. బీజేపీ నేతృత్వంలో రోడ్ షో జరగాల్సి ఉంది. ఆ రోడ్‌షోలో పవన్ కల్యాణ్ పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై స్పష్టత రాలేదు. కానీ పవన్ మాత్రం మోదీతో భేటీ ఖాయమని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా రెండు రోజుల పాటు విశాఖలో పర్యటిస్తారు.
విశాఖలో రెండు రోజుల పాటు పర్యటించనున్న పవన్ కల్యాణ్
ఇటీవల విశాఖలో జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ పంపేశారు. ఇప్పుడు ప్రధాని పర్యటనలో పాల్గొనేందుకు విశాఖ వెళ్తున్నందున పోలీసులు కూడా అడ్డుకునే అవకాశం ఉంది. బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. కానీ ఇటీవలి కాలంలో వైసీపీతో తీవ్రంగా విభేధిస్తున్న పవన్.. బీజేపీని రోడ్ మ్యాప్ అడిగారు. కానీ ఆ పార్టీ స్పందించకపోవడంతో వ్యూహం మార్చుకుంటున్నానని ప్రకటించారు. కానీ పొత్తును వదిలేస్తున్నట్లుగా ప్రకటించలేదు. కానీ బీజేపీ నేతలు మాత్రం జనసేనతో పొత్తు ఉంటుందని ఖరాఖండిగా చెబుతూ వస్తున్నారు.
బీజేపీతో పెరిగిన దూరాన్ని తగ్గించడానికే సమావేశమా?
అయితే జనసేన, బీజేపీ మధ్య సమన్వయం మాత్రం లేదు. ఇప్పటి వరకూ ఏపీలో ఏ ప్రముఖ నేత వచ్చినా పవన్ కల్యాణ్‌ను కలవలేదు. రెండు నెలల క్రితం మోదీ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చినప్పటికీ పవన్‌కు ఆహ్వానం అందలేదు. అందుకే ఈ సారి కూడా ఎలాంటి ఆహ్వానం ఉండదనుకున్నారు. కానీ పవన్‌కు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ లభించింది. దీంతో రాజకీయవర్గాల్లో కొత్త చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రధాని మోదీ పర్యటన వైఎస్ఆర్‌సీపీ నేతల కనుసన్నల్లో జరుగుతోంది. వైఎస్ఆర్‌సీపీ రంగులతో సిద్ధం చేసిన ఫ్లెక్సీల్లో మోదీ బొమ్మను పెద్దగా ముద్రించారు. బీజేపీ మార్క్ ఎక్కడా కనిపించడం లేదు. బహుశా.. ప్రధాని మోదీకి కూడా ఇలాంటి సభలో పాల్గొనడం ఇదే మొదటి సారి కావొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రధాని మోదీ పర్యటన తమ కనుసన్నల్లో జరిగేలా చూసుకుంటున్న వైఎస్ఆర్‌సీపీ
వైఎస్ఆర్‌సీపీ అధికారికంగా మిత్రపక్షం కాదు. అయితే ప్రధాని మోదీ సభ రాజకీయం కాదని.. రాష్ట్రం కోసం అని చెబుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు.. ఈ ఏర్పాట్లను ప్రభుత్వ పరంగానే చేస్తున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో మాత్రం శుక్రవారం రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలో పాల్గొనేందుకు పవన్ ను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ ఈ రోడ్ షోలో పాల్గొంటారా .. లేకపోతే ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమవుతారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ర్యాలీలో మోదీతో కలిసి పవన్ పాల్గొంటే.. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందన్న నమ్మకం కూడా బలపడుతుందని అంటున్నారు. కారణం ఏదైనా మోదీ, పవన్ భేటీ ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పులకు కారణం కానుంది.