Janasena Yuva Sakti : మత్య్సకార వర్గాన్ని ఆకట్టుకునేలా జనసేనాని ప్రయత్నం - తిప్పి కొట్టేందుకు రంగంలోకి అప్పల్రాజు
ఉత్తరాంధ్రలో మత్స్యకార సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. పవన్ కు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రి అప్పల్రాజు ప్రయత్నిస్తున్నారు.
Janasena Yuva Sakti : రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఎవరు చెప్పలేం. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ముందస్తుగా రాజకీయ పార్టీలు ప్రచార పర్వానికి తెరలేపుతున్నాయి. ఏదో కార్యక్రమం పేరటి ప్రజల్లో మమేకమయ్యేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలో సిక్కోలు జిల్లాలో గంగపుత్రుల చుట్టు తాజా రాజకీయాలు జోరందుకున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ అటుయువతను, మత్య్సకారులతో మమేకమ వుతు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఆయన పర్యటనలు అధికార పార్టీని కొంత మేర కలవర పెడుతున్న తీరు లో తీర ప్రాంతవాసులను ఆకట్టునేందుకు చేస్తున్న ప్రయత్నా లు మరింత ఇరకాటంలో పెడుతున్నాయని అధికార పార్టీ కి కొంతమంది భావిస్తున్నారు.
మత్య్సకార సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు పవన్ ప్రయత్నం
తొలినుంచి మత్య్సకార సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 12న యువజన దినోత్సవం సందర్భంగా సిక్కోలు జిల్లా ఎచ్చెర్ల సిగ్మెంటులో యువశక్తి కార్యక్రమానికి సన్నద్ధమయ్యారు. ఈ మేరకు రాజకీయ వ్యవహరాల కమిటి ఇన్చార్జీ నాదేండ్ల మనోహర్ గత నెలలోనే జిల్లాలో పర్యటించి పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఎచ్చెర్ల సిగ్మెంటుకు చెందిన నేతలతో పాటు ప్రధానంగా మత్య్సకారులు పెద్ద ఎత్తున ఆ రోజు కార్యక్రమానికి హజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉత్తరాంధ్రకు చెందిన నేతలను బాధ్యతలు కట్టబెట్టారు. రాష్ట్రంలో తొలికా ర్యక్రమంగా భావించిన జనసేన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. మత్య్సకార ఓటు బ్యాంకును పదిలం చేసుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎజెండాను పవన్, మనోహర్ లు వెల్లడించారు.
మత్స్యకార యువతకే యువశక్తి భేరీలో మాట్లాడేందుకు ఎక్కువ అవకాశాలు
వలసల నివారణ, ఉపాధి మార్గాలపై అవసరమైన సూచనలు, సలహాలు కోరేందుకు వందమంది యువతీ, యువకులతో లావేరు మండలం తాళ్లవలసలో చేపట్టనున్న యువశక్తి కార్యక్రమం ద్వారా మాట్లాడించనున్నట్టు చెప్పకనే చెప్పారు. దీంతో ఈ కార్యక్రమం వాడీవేడీగా సాగనుందని వేరేగా చెప్పనక్కర్లలేదు. జనసేన యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తుంటే అధికార పార్టీ దీన్ని పరోక్షంగా అడ్డుకోవడానికి ప్రయత్నాలు మొదలేట్టిందనే విమర్శలు ఆరంభమయ్యాయి. ఇదే సందర్భంలో మత్య్సశాఖ మంత్రి డాక్టరు సీదిరి అప్పలరాజు ఆకస్మికంగా గా ఎచ్చెర్ల మండలం బుడగట్ల పాలెంలో శుక్రవారం పర్యటించారు.
హఠాత్తుగా మత్స్యకార ప్రాంతాల్లో మంత్రి అప్పలరాజు పర్యటన
అప్పలరాజు మంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన సిగ్మెంటులో మినహా మరేతర మత్య్సకార ప్రాంతాన్ని పర్యటించని అప్పలరాజు కు ఒక్కసారిగ గంగపుత్రులు గుర్తుకు రావడంపైనే చర్చ సాగుతుంది. అక్కడి మత్య్సకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గంగపుత్రుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,500 కోట్ల రూపాయలతో పోర్టులు, హర్బర్ లు నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడ మత్యకారులను ఆదుకున్న సందర్భాలు లేవన్నారు. కేవలం జగన్ వలనే తీర ప్రాంతం అభివృద్ధి సాగుతుందనేది ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. భావనపాడు పోర్టు, బుడగట్ల పాలేం ఫిస్సింగ్ హర్బర్ పనులు త్వరలో ప్రారంభించనున్నారన్నారు. యువశక్తి కార్యక్రమాన్ని ఎచ్చెర్ల సిగ్మెంట్ లోనే జనసేన చేపట్టనుండడంతోనే మంత్రి అప్పలరాజు బుడగంట్ల పాలెంలో పర్యటించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పవన్ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం
మత్య్సకారులను గతంలో ఎవరు పట్టించుకోలేదని మత్య్సకారశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పేర్కోన్నారు. బుడగట్ల పాలెంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తో కలిసి పర్యటించిన మంత్రి అప్పలరాజు పవన్ ప్యాకేజీల రాయుడంటు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రతి మాటకు ఓ రేటుంటుందని విమర్శలు గుప్పించారు. ప్యాకేజ్ ముట్టుకునేది బయటకు రాడంటు ఆరోపణలు చేశారు. డబ్బులు అందుకుంటే జేబు బరువైతేనే ప్రజలు గుర్తుకు వస్తారని ఘాటైన విమర్శలు చేశారు. నాదేండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న రోజుల్లో మత్య్సకారుడికోసం పట్టించుకున్నారా అని నిలదీశారు. చంద్రబాబు పల్లకి మోసినన్ని రోజులు వలసలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి హాయాంలో తప్ప పవన్ పొలిటికల్ కేరీర్ లో ఎప్పుడైన హార్బర్ లకు శంకుస్థాపన కార్యక్రమాలు చూశారా అని వ్యాఖ్యనించారు. జగన్ ను విమర్శించడమంటే ఆకాశాన్ని చూసి ఉమ్మివేయడే మని ఎద్దే వా చేశారు.