Pawan Traget Jagan : ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ లక్ష్యం వైసీపీకి జీరో - జగన్‌కు అధికారాన్ని దూరం చేసే మంత్రం కనిపెట్టారా ?
ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు రాకుండా చేసే లక్ష్యంతో ఉన్నారు పవన్ కల్యాణ్. జగన్ ను అధికారానికి దూరం చేయడానికి ఇదే కీలకమని భావిస్తున్నారు.
Pawan Traget Jagan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ఉభయగోదావరి జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. మామూలుగా తన యాత్రను ఆయన తిరుపతి నుంచి ప్రారంభించాలి. కానీ పొత్తుల చర్చలు..ఇతర రాజకీయ పరిణామాలు... ముందస్తు ఎన్ని ఇతర కారణాలన్నింటినీ లెక్కలేసుకుని ఉభయగోదావరి జిల్లాల్లోనే వారాహియాత్ర మొదటగా చేయాలని నిర్ణయించుకున్నారు. అన్నవరం దగ్గర నుంచి ప్రారంభించి నర్సాపురం వరకూ వచ్చారు. ప్రతీ చోటా ఆయన చెబుతున్న మాట ఒక్కటే. ఉభయగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాకూడదని. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న మాట కాదని.. ఇందులో జగన్ కు అధికారాన్ని దూరం చేసే లోతైన వ్యూహం ఉందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
వైసీపీకి ఒక్క సీటు రాకుండా చేయడమే లక్ష్యం !
గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేస్తున్న పవన్ కల్యాణ్ తన టార్గెట్ గురించి తరచూ చెబుతున్నారు. అదేమిటంటే.. గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వకుండా చేయడం. తాజాగా నర్సాపురం నేతలతో సమావేశం అయిన పవన్ కల్యామ్.. ఇదే లక్ష్యాన్ని పార్టీ నేతల మందు పెట్టారు. యుద్ధం మొదలుపెట్టినప్పుడు ముందుగా చిన్న చిన్న కోటలు కొట్టాలి.. మనం కూడా అదే బాటలో ముందుకు వెళ్ది.. ముందుగా ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ విముక్త ప్రాంతాలుగా చేద్దామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఇక్కడున్న 34 స్థానాల్లో ఒక్కటి కూడా వైసీపీ గెలవకూడదు. ఆ స్థాయిలో జనసైనికులు, జనసేన నాయకులు బలంగా పని చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్నారు. ప్రతీ చోటా పార్టీ నేతలకు ఇదే చెబుతున్నారు.
గోదావరి జిల్లాల్లో అత్యధిక సీట్లు సాధించే పార్టీకే అధికారం !
గోదావరి జిల్లాల్లో ఎవరు అత్యధిక స్థానాలు గెలిస్తే వారే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆనవాయితగా వస్తోంది. 2014లో పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికలలో అత్యధిక సీట్లు వైసీపీ గెల్చుకుంది. ఆ పార్టీలే ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఈ సారి పవన్ కల్యాణ్ .. తన పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నది కూడా గోదావరి జిల్లాల్లోనే అనుకుంటున్నారు. అందుకే .. వైసీపీకి ఒక్క సీటు రాకుండా చేసి.. అధికారానికి దూరం చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారని అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వైసీపీ విడివిడిగా పోటీ చేశాయి. ఆ సమయంలో అన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీలకు పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. అదే టీడీపీ, జనసేన కలిసి ఉంటే.. వైసీపీకి భారీ నష్టం జరిగేదన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉన్నందున.. ఆ ఓట్లన్నీ కన్సాలిడేట్ అయితే.. వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని పవన్ నమ్ముతున్నట్లుగా చెబుతున్నారు.
వ్యూహాత్మకంగానే పవన్ రాజకీయం !
పవన్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని... ఆయనకు క్లారిటీ లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కానీ.. పవన్ కల్యాణ్ .. ఎన్నికల కోసం ఉన్న అతి తక్కువ సమయాన్ని తనకు ఎక్కువ బలం ఎక్కడ ఉందో అక్కడే కేటాయించాలనుకుంటున్నారు. దాన్ని బట్టి ఆయన ఎంత క్లారిటీగా ఉన్నారో అర్థమవుతోందని అంటున్నారు. వారాహి యాత్ర రెండు నెలల పాటు ఉభయగోదావరి జిల్లాల్లో జరిగే చాన్స్ ఉంది. ఆ తర్వాత ఉత్తరాంధ్రతో పాటు కోస్తాలో జనసేనకు బలమున్న నియోజవకవర్గాల్లో పర్యటించనున్నారు. అప్పటికి పొత్తులపై క్లారిటీ వస్తుందని..అంటున్నారు. మొత్తంగా పవన్ జగన్ ను అధికారానికి దూరం చేయడానికి ఉభయగోదావరి జిల్లాల్లో జీరో చేయడమే ముఖ్యమని టాస్క్ పెట్టుకున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial