Telangana Politics : హైదరాబాద్‌లో నవీన్ పట్నాయక్ - ఢిల్లీలోనే కేసీఆర్ ! ఒరిస్సా సీఎంతో భేటీకి సుముఖంగా లేరా ?
ఒరిస్సా సీఎం హైదరాబాద్‌కు వచ్చినా కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. ప్రత్యేక కార్యక్రమాలేమీ లేకపోయినా... నవీన్‌తో చర్చలు జరిపే అవకాశం ఉన్నా కేసీఆర్ హైదరాబాద్ రాకపోడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Telangana Politics : ప్రస్తుత టీఆర్ఎస్ అధినేత,కాబోయే జాతీయ పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. గత బుధవారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. నాలుగు రోజులుగా అధికారికంగా ఎవరితోనూ భేటీ అయినట్లుగా మీడియాకు సమాచారం ఇవ్వలేదు. రాజకీయ పార్టీల నేతలు మాత్రమే కాదు.. తటస్తులతో కూడా కేసీఆర్ ఎలాంటి భేటీలు నిర్వహించలేదని చెబుతున్నారు. మరో వైపు ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తెలంగాణ పర్యటనకు వచ్చారు. గతంలో ఆయనను కలిసేందుకు కేసీఆర్ భువనేశ్వర్ వెళ్లారు. ఇప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చినప్పటికీ .. కేసీఆర్ లేరు. దీంతో ఇద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశం లేదు. ఢిల్లీలో ఏ ముఖ్యమైన సమావేశం లేనప్పుడు కేసీఆర్.. ఇలాంటి అవకాశాల్ని ఎందుకు వదులుకుంటున్నారన్నది టీఆర్ఎస్ వర్గాలకూ అంతుబట్టని విషయం.
ఐదు రోజులుగా ఢిల్లీలో కేసీఆర్ !
‘‘భారతదేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేయడానికే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నా.. బీఆర్‌ఎ్‌సతో కలిసి ముందుకు సాగేందుకు దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలు ముందుకు వస్తున్నారు’’.. అని చెప్పి విజయదశమినాడు జాతీయ పార్టీ ప్రకటన చేసిన కేసీఆర్ బుధవారం ఢిల్లీకి వెళ్లారు. అప్పట్నుంచి పూర్తిగా అధికారిక నివాసానికే పరిమితమయ్యారు! ఢిల్లీలో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను బుధవారం పరిశీలించిన కేసీఆర్.. గురువారం ఆ పనులపై సమీక్ష నిర్వహించారు. భవన నిర్మాణ డిజైన్ల మ్యాపును అధ్యయనం చేసి, వాస్తు ప్రకారం పలు మార్పు చేర్పులను సూచించినట్లు తెలిసింది. ఈ 5 రోజుల్లో ఏ రాజకీయ పక్షానికి చెందిన నేతా ఆయన్ను కలవడానికి రాలేదు. రహస్య సమావేశాలు జరుగుతున్నట్లుగా కూడా టీఆర్ఎస్ వర్గాలు చెప్పడం లేదు.
పెట్టుబడుల ఆకర్షణ కోసం తెలంగాణకు ఒరిస్సా సీఎం !
ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్... తమ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ కోసంహైదరాబాద్ వచ్చారు. ఆయనకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. త్వరలో ఒడిశాలో ‘మేక్ ఇన్ ఒడిశా’ కాన్‌క్లేవ్ మూడో ఎడిషన్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సీఎం నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో సమావేశం కానున్నారు. హోటల్ తాజ్‌కృష్ణలో పెట్టుబడిదారులతో సమావేశమై పెట్టుబడులపై చర్చించనున్నారు. రెండు రోజులు ఆయన హైదరాబాద్‌లో ఉంటారు. ఓ రాష్ట్ర సీఎం మరో రాష్ట్రానికి వచ్చినప్పుడు.. ఆ రాష్ట్ర సీఎంతో మర్యాదపూర్వకంగా సమావేశం అవుతూ ఉంటారు. కానీ కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నందున అలాంటి సమావేశం జరిగే అవకాశం లేదని భావిస్తున్నారు.
నవీన్ పట్నాయక్‌తో చర్చలకైనా కేసీఆర్ హైదరాబాద్ రావొచ్చు కదా !
నవీన్ పట్నాయక్.. ఓ బలమైన ప్రాంతీయ పార్టీ నేత. ఒరిస్సాలో తిరుగులేని అధికారాన్ని నవీన్ పట్నాయక్ పార్టీ చెలాయిస్తోంది. అయితే జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ వేలు పెట్టలేదు. వరుసగా గెలుస్తూ వస్తున్నా.. ఒరిస్సా బయట రాజకీయాలు చేయాలని ఆయన అనుకోలేదు. గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల కోణంలో ఆయనతో సమావేశం అయ్యారు. 2018 ముందస్తు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వెళ్లి చర్చలు జరిపారు. కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు కేసీఆర్ మరోసారి అందర్ని కలుస్తున్నారు. చాలా మంది ప్రగతి భవన్‌కే వచ్చి కలుస్తున్నారు. అలా నవీన్ పట్నాయక్ వచ్చి కలిసే అవకాశం ఉన్నా... కేసీఆర్ వద్దనుకుంటున్నారు.
కేసీఆర్ రాజకీయాలు ఊహించని విధంగా ఉంటాయి. ఓ వైపు మునుగోడులో కీలకమైన ఎన్నికలు జరుగుతున్నా ఆయన ఢిల్లీలోనే మకాం వేశారు. ఢిల్లీలో బహిరంగంగా ఎలాంటిస మావేశాలు నిర్వహించడం లేదు. ఒరిస్సా సీఎం తెలంగాణకు వస్తారని తెలిసినా ఆయన ఢిల్లీలోనే ఉండిపోతున్నారు. ే