TS Bypoll Politics : టీఆర్ఎస్ ఓకే అంటేనే ఉపఎన్నికలు - ఈ లాజిక్ బీజేపీ మిస్సవుతోందా ?
ఉప ఎన్నికలకు బీజేపీ మాత్రమే కాదు టీఆర్ఎస్ కూడా అంగీకారం తెలిపాలి. సహకరించాలి. లేకపోతే ఉపఎన్నికలు వచ్చే అవకాశం లేదు.
TS Bypoll Politics : తెలంగాణ రాజకీయాల్లో ఉపఎన్నికలది ఓ ప్రత్యేక స్థానం ఉద్యమంలో కేసీఆర్ అనుకున్నది సాధించడానికి ఉపయోగించుకున్న ఆయుధం ఉపఎన్నికలే. ఉప ఎన్నికలతో తెలంగాణ ఉద్యమాన్ని హోరెత్తించిన కేసీఆర్ కు ఇప్పుడు అదే ఉపఎన్నికలతో కౌంటర్ ఇవ్వాలని బీజేపీ అనుకుంటోంది. ఒక్క సారిగా మూడు, నాలుగు చోట్ల ఉపఎన్నికలు జరిపి విజయం సాధించి .. సాధారణ ఎన్నికలకు భారీ వేవ్‌తో వెళ్లాలనుకుంటంది. అప్పట్లో కేసీఆర్ వ్యూహమే ఇప్పుడు బీజేపీ అమలు పరచాలనుకుంటోంది.
మూడు చోట్ల ఉపఎన్నికలకు బీజేపీ ప్లాన్ !
తెలంగాణలో బీజేపీ జనవరిలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు తీసుకు రావాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం ఖాయమయింది. అదే సమయంలో బీజేపీ కాస్త బలంగా ఉందనుకున్న మరో రెండు చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నార మొత్తం మూడు స్థానాలకు ఉపఎన్నికలు పెట్టి.. గెలిచేసి.. గాలి మొత్తం తమ వైపే ఉందని నిరూపించాలని అనుకుంటున్నారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా ఉపఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తాయి. వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లే భావిస్తారు.
టీఆర్ఎస్ ఉపఎన్నికలను కోరుకుంటుందా ?
ఉపఎన్నికలు తమకు చేటు చేస్తాయని అనుకుంటే టీఆర్ఎస్ కు ఉపఎన్నికలు అడ్డుకునే శక్తి ఉంది. ఉపఎన్నిక అనేది బీజేపీ వ్యూహం కాబట్టి టీఆర్ఎస్ బీజేపీ రాజకీయ వ్యూహంలో ఇరుక్కునే చాన్స్ లేదని కొంత మంది అంటున్నారు. ఎవరు రాజీనామాలు చేసినా ఆమోదించకుండా నాన్చి.. చివరికి ఆరేడు నెలల ముందు ఆమోదిస్తారని అప్పుడు టిట్ ఫర్ టాట్ అయినట్లు ఉంటుందని అంటున్నారు. ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ దూకుడుగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామా చేయగానే ఇలా ఆమోదించేసి ఉపఎన్నికలకు వెళ్లారు. ఎదురు దెబ్బతిన్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ అలాంటి రిస్క్ తీసుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు అనుకోవడం లేదు.
స్పీకర్ ఆమోదించకుండా సాగదీస్తే .. సమయం మించిపోతుంది !
తెలంగాణ అసెంబ్లీకి వచ్చే ఏడాది చివరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే పదిహేను నెలల వరకూ సమయం ఉంటుంది. ఆరు నెలల పదవీ కాలం ఉంటే ఎన్నికలు నిర్వహించరు. రాజీనామా చేసిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలనే కండిషన్ ఉంది. ఈ ప్రకారం చూస్తే ఏడాది పదవీ కాలం ఉన్నా ఉపఎన్నిక నిర్వహించడం కష్టమే. రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదు.. ఎవరు రాజీనామా చేసినా నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఎంత కాలం అయినా సాగదీయడానికి చాన్స్ ఉంది. అది స్పీకర్ అధికారం. ఏపీలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తే ఇంత వరకూ స్పీకర్ ఆమోదించలేదు. ఆయన పలుమార్లు కలిసినా స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకోలేదు.
ఉపఎన్నికలు మేలు చేస్తాయనుకుంటే కేసీఆర్ రెడీ !
తమ కుర్చీ కిందకు నీళ్లు తెచ్చేందుకే రాజీనామా చేస్తున్నారని అనిపిస్తే.. టీఆర్ఎస్ రాజీనామాను ఆమోదించకుడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే ఓడిపోతామనే ఉపఎన్నికలకు భయపడుతున్నారని బీజేపీ విమర్శించవచ్చు. అయితే బీజేపీ వ్యూహం ప్రకారం .. తమకే లాభిస్తుందని.. ఎన్నికలలో తామే గెలుస్తామని టీఆర్ఎస్ అనుకుంటే.. వెంటనే రాజీనామాలు ఆమోదం పొందే చాన్స్ ఉంది. అంటే బీజేపీ, టీఆర్ఎస్ పరస్పర అంగీకారంతోనే ఉపఎన్నికలు వస్తాయి. లేకపోతే రావు అనుకోవచ్చు.