Nizamabad News: నిజామాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ పదవులు మళ్లీ దక్కేనా? రేసులో ఉన్నదెవరు!
ఈ నెల 27వ తేదీతో రాజేశ్వర్ రావు ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా రాజేశ్వర్ ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం పూర్తనుంది.
ఈ నెల 27వ తేదీతో రాజేశ్వర్ రావు ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా రాజేశ్వర్ ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం పూర్తనుంది. అయితే మళ్లీ ఈ అవకాశం రాజేశ్వర్ కే దక్కనుందా...? లేక ఈ సారి జిల్లాకు ఇచ్చే ఉద్దేశ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నారా ? లేదా ? అన్న దానిపై బీఆర్ఎస్ జిల్లా పార్టీ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. రాజేశ్వర్ తో పాటు మరో నేత గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీ పదవి కాలం కూడా పూర్తవనుంది. మరో 6 నెలలల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి జిల్లాలో ఎవరికి దక్కనుంది అనే దానిపై ఆసక్తి నెలకోంది. ఇప్పటికే ఎస్సీ వర్గానికి చెందిన రాజేశ్వర్ రావుకు రెండు సార్లు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. మూడో సారి సైతం రాజేశ్వర్ కు ఇస్తారా లేక మరో నేతకు ఛాన్స్ ఇస్తారా అనే అంశంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇప్పటికే గత నెలలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో నేత వీజీ గౌడ్ ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. వీజీ గౌడ్ కు సైతం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రెండు సార్లు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కానీ గత నెల ఆయన పదవి ముగిశాక ఆయనను కొనసాగించలేదు. అంటే రాజేశ్వర్ రావుకు సైతం ఈ సారి అవకాశం ఇవ్వకపోవచ్చన్న ప్రచారం సైతం ఉంది. అసలు జిల్లాకు ఇస్తారా ? లేదా అని క్లారిటీ లేదు. ఇప్పటికే జిల్లా నుంచి చాలా మంది ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవిపై కన్నేశారు. ఎవరికి వారే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇటు సీఎం కేసీఆర్ ను కలుస్తూ... అటు జిల్లాకు చెందిన మంత్రితో పాటు ఇతర నాయకులను కలిసి ప్రసన్నం చేసుకుంటున్నారు.
ఇక నిజామాాబాద్ జిల్లాకు చెందిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ. అయితే ఇప్పటికే జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ స్థానం పోయినట్లే.... ఇక ఈ నెల 27న మరో ఎమ్మెల్సీ పదవి కాలం ముగుస్తున్న క్రమంలో ఇక ఈసారి జిల్లాకు సంబంధించిన వారికి ఇవ్వకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు.. రెండు సార్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా చేసిన ఈగ గంగారెడ్డి ఈ ఎమ్మెల్సీ పదవి కోసం విశ్వప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షపదవి బాధ్యత తర్వాత ఆ నేతకు ఎలాంటి పదవీ ఇవ్వలేదు బీఆర్ఎస్ అధిష్టానం. దీంతో ఈగ గంగారెడ్డి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పై కన్నేశారని తెలుస్తోంది. ఇప్పటికే తన మనసులో మాటను సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డిలకు చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు నిజామాబాద్ జిల్లాకే చెందిన మరో సీనియర్ నేత గతంలో పాలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన ఏఎస్ పోశెట్టి ఉద్యమంలో మొదట్నుంచి చురుగ్గా పనిచేశారు. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ఉద్యమనాదాన్ని ముందుండి నడిపించిన వ్యక్తిగా ఏఎస్ పోశేట్టికి పేరుంది. కానీ ఆయనకు నేటి్ వరకు తగిన గౌవరం దక్కలేదన్నది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కనీసం ఈ గవర్నర్ కోటాలో నైనా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందోమేనని ఆయన అనుచురులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అటు ఈగ గంగారెడ్డి, ఇటు ఏఎస్ పోశెట్టి జిల్లా పార్టీలో ఇద్దరూ సీనియర్ నేతలే... మరోవైపు బాల్కొండ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ మధు శేఖర్ సైతం ఎమ్మెల్సీ పదవి రేసులో ఉన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారు ఇంకా కొంతమంది ఉన్నారు. ఈ అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడకతప్పదు.