Nitish Kumar : రాజకీయాల నుంచి తప్పుకుంటాననే శపథం నుంచి పదోసారి ప్రమాణం వరకు నితీష్ కుమార్ పొలిటికల్ జర్నీ ఇదే !
Nitish Kumar : బిహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆయన రాజకీయ ప్రవేశం, తొలిసారి సీఎంగా ఎప్పుడు అయ్యారో తెలుసుకుందాం.

Nitish Kumar : బిహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నితీష్ కుమార్ రాష్ట్ర రూపురేఖలను మార్చడమే కాకుండా సామాజిక, రాజకీయ నిర్మాణాన్ని కూడా బలోపేతం చేశారు. అందుకే ఈసారి కూడా ఆయన నాయకత్వంలో ఎన్డీఏ కూటమి 200 మార్కును దాటి అధికార పగ్గాలు చేబుడుతోంది. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం కలిగిన నితీష్ కుమార్ బిహార్‌లో ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇంతకీ ఆయన రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం.
వ్యూహాత్మక ఎత్తుగడలు, రాజకీయ చతురతకు పేరుగాంచిన నితీష్ కుమార్ ప్రయాణం గురించి చూస్తే, 1977లో తొలిసారిగా నితీష్ కుమార్ హర్నౌత్ సీటు నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నితీష్ ఓడిపోయారు. ఆ తర్వాత 1980లో నితీష్ హర్నౌత్ సీటు నుంచి పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. ఆ తర్వాత 1985లో ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాలకు స్వస్తి పలుకుతానని ప్రతిజ్ఞ చేశారు, కానీ విధి ఆయన్ని వెళ్లనీయలేదు. 1985లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 1985లో నితీష్ కుమార్ నలందా జిల్లాలోని హర్నౌత్ నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. నాలుగేళ్ల తర్వాత ఆయన బార్ లోక్ సభ సీటును గెలుచుకుని జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1990లో వి.పి. సింగ్ ప్రభుత్వంలో ఆయనను కేంద్ర వ్యవసాయ, సహకార శాఖ సహాయ మంత్రిగా నియమించారు.
1994లో ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి విడిపోయి తన సొంత మార్గాన్ని ఎంచుకున్నారు. అదే సంవత్సరం జార్జ్ ఫెర్నాండెస్‌తో కలిసి సమతా పార్టీని స్థాపించారు. 1996లో సమతా పార్టీ బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి బిహార్‌లో 6 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది.
2000లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు
నితీష్ కుమార్ 2000 సంవత్సరంలో కేవలం 7 రోజుల పాటు బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 24 నవంబర్ 2005న తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. తన పదవీ కాలాన్ని పూర్తి చేశారు. 2013లో ఆయన బీజేపీతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని వేరే దారిని ఎంచుకున్నారు. ఈ సమయంలో ఆయన 11 మంది బీజేపీ మంత్రులను పదవుల నుంచి తొలగించారు. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ పేలవమైన పనితీరు కారణంగా పదవికి రాజీనామా చేశారు.
2015లో ఆయన మహాకూటమిలో భాగస్వామ్యమై నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ పదవీకాలం స్వల్పకాలికంగానే ఉంది. ఆ తర్వాత నవంబర్ 20, 2015న ఆయన ఐదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, కానీ 2017 జూలైలో రాజకీయ సంక్షోభం కారణంగా రాజీనామా చేసి మహాకూటమి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత అదే రోజున ఆయన ఎన్డీఏలో చేరారు. ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2020లో ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో విజయం సాధించి ఏడోసారి నితీష్ ముఖ్యమంత్రి అయ్యారు.
నితీష్ కుమార్ పదవీకాలంలో అనేక రాజకీయ పరిణామాలు కొనసాగాయి. ఆగస్టు 9, 2022న ఆయన మళ్లీ బీజేపీతో సంబంధాలు తెంచుకున్నారు. ఆయన మహాకూటమిలో భాగమయ్యారు. 8వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ప్రక్రియ ఆగలేదు. జనవరి 28, 2024న ఆయన కూటమి నుంచి వైదొలిగి మళ్లీ ఎన్డీఏలో చేరారు. 2025లో ఆయన నాయకత్వంలో ఎన్డీఏ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. ఇది ఆయన పదవీ కాలంలోనే అతిపెద్ద విజయం. నితీష్ ప్రారంభంలో విద్యార్థి నాయకుడిగా జేపీ ఉద్యమంలో పాల్గొన్నారు.
నితీష్ కుమార్ నేపథ్యం
నితీష్ కుమార్ మార్చి 1, 1951న బిహార్‌లోని పాట్నా జిల్లాలోని భక్తియార్‌పూర్‌లో జన్మించారు. ఆయన తండ్రి కవిరాజ్ రామ్ లఖన్ సింగ్ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయుర్వేద వైద్యుడు. ఆయన తల్లి పేరు పరమేశ్వరి దేవి. ఫిబ్రవరి 22, 1973న మంజు కుమారి సిన్హాను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు నిశాంత్ కుమార్. నితీష్ కుమార్ భక్తియార్‌పూర్‌లోని గణేష్ హైస్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత పాట్నాలోని బిహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి 1972లో ఇంజనీరింగ్ డిగ్రీని పొందారు. ఈ సమయంలో ఆయన విద్యుత్ బోర్డులో పనిచేశారు.
జేడీయూ ఎప్పుడు స్థాపించారు
నితీష్ కుమార్ 1994లో జార్జ్ ఫెర్నాండెస్‌తో కలిసి సమతా పార్టీని స్థాపించారు, కానీ 2004లో సమతా పార్టీని జేడీయూలో విలీనం చేశారు.




















