TDP Master Plan : ప్రజల్లోకి భువనేశ్వరి , బ్రాహ్మణి - టీడీపీ అన్ని అవకాశాల్నీ ఉపయోగించుకోబోతోందా ?
నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ విస్తృత కార్యాచరణను రెడీ చేసుకున్నట్లగా తెలుస్తోంది.
TDP Master Plan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఊహించనంతగా మారిపోతున్నాయి. సాధారణంగా ప్రతిపక్ష నేతల అరెస్టులు, వారిపై కక్ష సాధిస్తున్నారని ప్రజలు అనుకునే వ్యవహారాలను ఎన్నికలకు ఏడాది ముంద ప్రభుత్వాలు చేయవు. తప్పని సరిగా అరెస్టులు లాంటివి చేయాల్సి వచ్చినా .. వారిపై ఉన్న అభియోగాలు, ఆధారాలు అన్నింటినీ ప్రజల్లోకి పెట్టి వీలైనంతగా చర్చ పెట్టి అప్పుడు అరెస్ట్ చేస్తారు. వేధిస్తున్నట్లుగా అరెస్ట్ చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇలాంటి పరిస్థితులు తమకు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో రాజకీయ పార్టీలకు ఓ పక్కా ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు టీడీపీ.. తమకు అలాంటి అవకాశం వచ్చినట్లుగా నిర్ణయానికి వచ్చామని ఇక ఉపయోగించుకోవాలని రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ప్రజల్లోకి భువనేశ్వరి, బ్రాహ్మణి !
ప్రజల్లోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు, లోకేష్‌లపై వేధింపులకు పాల్పడుతున్నారని.. తప్పుడు కేసులో వేధిస్తున్నారని న్యాయం మీరే చెప్పాలని వారు ప్రజల వద్దకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ పెద్దల్లో ఇప్పటికే ఓ కార్యాచరణ సిద్ధమయిందని చెబుతున్నారు. నారా లోకేష్ పైనా సీఐడీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను కూడా అరెస్ట్ చేస్తామని పరోక్షంగా చెప్పారు. ఒక వేళ అదే జరిగితే పాదయాత్ర ఆపేయాల్సి ఉంటుంది. అందుకే.. వెంటనే.. విరుగుడుగా.. భువనేశ్వరి, బ్రాహ్మణిలు తెలుగుదేశం పార్టీ తరపున రంగంలోకి దిగుతారని.. లోకేష్ ఆపేసిన దగ్గర్నుంచి పాదయాత్ర చేయడమో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడమో చేస్తారన్న వాదన వినిపిస్తోంది.
రాజకీయాల్లో సానుభూతిని మించిన గెలుపు అస్త్రం ఉండదు !
రాజకీయాల్లో పండిపోయిన అందరికీ .. సానుభూతి ని మించిన అస్త్రం ఉండదని తెలిసి. వైఎస్ చనిపోయిన తర్వాత వచ్చిన సానుభూతి వెల్లువలో వైఎస్ జగన్ తడిచి ముద్దయ్యారు. ఉపఎన్నికల్లో భారీ విజయాలు సాధించారు. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకూ ఆ సానుభూతి వేవ్ కనిపించింది. గత ఎన్నికల్లోనూ ఆయన ఒక్క చాన్స్ అని వేడుకున్నారని ఆ సానుభూతే కనిపించింది కానీ టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదన్న కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. అదే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండి.. ఇక ప్రతిపక్ష నేతలపై వేధింపులు అంటూ వారి కుటుంబసభ్యులు రోడ్డెక్కితే.. వచ్చే సానుభూతి వెల్లువ ఊహించడం కష్టమనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్లో సానుభూతి పవనాలు వీస్తే ఫలితాలు పూర్తి స్థాయిలో ఏకపక్షమవుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి తన కోసం పని చేసిన , పాదయాత్రలు.. ప్రచారాలు చేసిన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలను దూరం చేసుకున్నారు. అది కూడా చర్చకు పెట్టే అంశాలపై టీడీపీ దృష్టి పెట్టే అవకాశం ఉంది.
ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరగడం ఖాయమేనా?
రాజకీయ అధికారం ఎవరికైనా ప్రజలు ఇచ్చేదే. రాజ్యాంగం ద్వారా వచ్చేదే. ఆ అధికారాన్ని దుర్వినియోగంచ చేస్తున్నారని అనిపిస్తే.. ప్రజలు మరోసారి అధికారం అప్పగించడానికి సంశయిస్తారు. వేధింపులకు గురైన వారికి బాసటగా నిలుస్తారు. అనాదిగా వస్తున్న రాజకీయం అది. అయితే కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల ఎజెండా కాలేదు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉండేది. ఇప్పుడు ఏపీలో ఆ తరహా రాజకీయాలు వచ్చాయి. అందుకే ఏపీ రాజకీయాల్లో రానున్న రోజుల్లో కీలక మార్పులు ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి.