ప్రజల్లోకి నారా భువనేశ్వరి- త్వరలోనే బస్సు యాత్ర!
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి రోజున నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేయనున్నారు. ఐదో తేదీ నుంచి ఆమె ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాయి. కోర్టుల్లో కూడా చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతానికి వివిధ కోర్టుల్లో ఆయన బెయిల్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయి. అన్నీ అనుకూలించి చంద్రబాబు బయటకు వస్తే సరే సరి. లేకుంటే నేరుగా రణ క్షేత్రంలోకి దూకాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
నేడు దీక్ష
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి రోజున నారా భువనేశ్వరి దీక్ష చేస్తున్నారు. ఒక్కరోజు పాటు నిరాహార దీక్ష చేస్తున్నారు. కోర్టు నిర్ణయం అనుకూలంగా లేకపోతే ఐదో తేదీ నుంచి ఆమె ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. బస్సు యాత్ర ద్వారా గ్రామ గ్రామాన తిరిగి జరుగుతున్న అన్యాయం, చంద్రబాబు అక్రమ అరెస్టుపై తెలియజేయాలని ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ నాయకత్వం నిర్ణయించిందట.
అరెస్టు రోజు నుంచి రాజమండ్రిలోనే
చంద్రబాబు అరెస్టు అయ్యి దాదాపు 24 రోజులు అయింది. ఆయన్ని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినప్పటి నుంచి ఆమె అక్కడే ఉన్నారు. రాజమండ్రిలోనే బస చేసి ఉన్నారు. వారంలో ఒకసారి చంద్రబాబుతో ములాఖత్ అవుతున్నారు. చంద్రబాబు ఆరోగ్యం, ఇతర అంశాలపై ఆరా తీస్తున్నారు. వచ్చిన వారందర్నీ కలుస్తున్నారు. సంఘీభావం ప్రకటిస్తున్న వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
చంద్రబాబు బాగోగులు చూసుకుంటూనే టీడపీ శ్రేణులకు ధైర్యంగా నిలుస్తున్నారు. టీడీపీ చేపట్టే కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారు. ఇవాళ దీక్ష చేయబోతున్నారు. మొన్న మోత మోగిద్దాం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. సమీపంలోని దీక్షా శిబిరాలకు వెళ్లి సంఘీభావం ప్రకటిస్తున్నారు. వారికి మద్దతుగా ఉండామని భరోసా ఇస్తున్నారు. అదే టైంలో ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్నారు. గతంలో రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండే భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరూ ఇప్పుడు అందులో భాగమై పార్టీకి దన్నుగా నిలబడ్డారు.