Roja Minister : గుళ్లు చుట్టూ తిరుగుతున్న రోజా ! మరి జగన్ కరుణిస్తారా ?
మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఆమెను జగన్ కరుణిస్తారా ?
ఏపీలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో చోటు దక్కుతుందని ఎక్కువగా ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేల్లే మొదటి వరుసలో నగరి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా ఉన్నారు. నగిరి నియోజకవర్గం శాసన సభ్యులుగా కొనసాగుతున్న ఆర్.కే.రోజాకి ఫైర్ బ్రాండ్ గా పేరొంది. తనని నమ్మి వచ్చిన వారి కోసం ఎంత వరకైనా వెళ్ళే నగరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేక స్ధానం సంపాదించుకున్నారు.
మొదటే మంత్రి పదవి ఆశించిన రోజా !
ప్రతిపక్షంలో పోరాడి .. అధికారంలోకి వచ్చినా ప్రత్యర్ధులను తన మాటలతో ఇరుకున పెట్టే ఆర్.కే.రోజా మంత్రి పదవిపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు.. వైఎస్ఆర్‌సీపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. కానీ పదవి దక్కలేదు. పెద్దిరెడ్డితో పాటుగా చిత్తూరు జిల్లాలో దళిత సామాజిక వర్గంకు చెందిన నారాయణ స్వామికి పదవులు దక్కాయి. రోజా అసంతృప్తికి గురి కావడంతో ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఈ సారి విస్తరణలో చాన్స్ ఉటుందని బుజ్జగించారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు విస్తరణ సమయం దగ్గర పడటంతో ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతున్నారు రోజా.
పెద్దిరెడ్డి సానుకూలంగా ఉంటేనే జగన్ ఇస్తారా ?
చిత్తూరు జిల్లాలో ఏ పని జరగాలన్నా పెద్దిరెడ్డి కను సైగలతోనే సాగుతాయి.. అది పార్టిలో పదవుల వద్ద నుండి చిన్న చిన్న కాంట్రాక్టుల వరకూ పెద్దిరెడ్డి ఆశీస్సులు ఉండాల్సిందే.. 2019 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పెద్దిరెడ్డి తీవ్రంగా శ్రమించారు.. అంతే కాకుండా ప్రతిపక్ష నేత సొంత నియోజకవర్గం కుప్పంలోనూ టిడిపి ఓటమి కోసం పావులు కదిపారు పెద్దిరెడ్డి.. వైసీపిలో పెద్దిరెడ్డికి ఉన్న రాజకీయ బలం కారణంగా తనను కాదని, రోజాకు మంత్రి పదవి దక్కే అవకాశమే లేదని పార్టీలో నాయకుల్లో వినిపిస్తున్న వాదన.. జిల్లా పునర్విభజన నేపధ్యంలో చిత్తూరుజిల్లాలో కలిపిన నగరి నియోజకవర్గంను తిరుపతి జిల్లాలో చేర్చినా రోజాకు సొంత సామాజిక వర్గం నుండి మాత్రం లైన్ క్లియర్ కావడం లేదు. తన వర్గానికి చెందిన నేతకే మంత్రి పదవి ఇవ్వాలని పెద్దిరెడ్డి బలంగా ఒత్తిడి తీసుకొస్తున్నారనేది ఓవైపు జరుగుతున్నా, అందుకు సమీకరణాలు చూస్తే అసలు రోజాకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డిని కొనసాగించకుండా ఇతరులకు మంత్రి పదవిలో అధిష్టానం అవకాశం కల్పిస్తే చిత్తూరు జిల్లాలో ఎవరి వైపు పెద్దిరెడ్డి చూపు పడుతుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. అయితే పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు ముగ్గురు పెద్దిరెడ్డికి వర్గీయులు. రోజాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సరైన సఖ్యత లేని కారణంగా నగిరి నియోజకవర్గంలోని వైసీపి నేతలు అందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులు కావడంతో బహిరంగంగా రోజాపై విమర్శలు గుప్పిస్తున్నారు.
రోజా ఆలయాల సందర్శన అందుకోసమేనా...??
నగిరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా మాత్రం మంత్రి పదవుల విషయంలో దేవుడిపై భారం వేసినట్లు తెలుస్తుంది.. తాజాగా నగిరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా తెలంగాణాలోని యాదాద్రి ఆలయంను సందర్శించారు.. గత రెండు రోజులుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. అటుతరువాత శ్రీకాణిపాకం వరసిద్ది వినాయకుడి సేవలో పాల్గోని దేవాలయంకు గోమాతను సైతం బహుకరించినట్లు తెలుస్తోంది.. గత నెల 17వ తేదీన త్రిపురాంతకంలోని బాల త్రిపురసుందరి దేవిని దర్శించుకుని, ప్రత్యేకాది అభిషేకాలు నిర్వహించారు రోజా.. మార్చి 11వ తేదీన విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు పొందగా,మార్చి 2వ తారీఖున శ్రీ కాళహస్తీశ్వర స్వామజ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఏదీ ఏమైనప్పటికీ సకల దేవతల ఆశీస్సులతో నగిరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజాకు రెండోవ సారి జరిగే క్యాబినెట్ విస్తరణలో అవకాశం దక్కేనా లేదా అనేది వేచి చూడాలి మరి..