Ambati Rambabu: 'పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహరే' - జనసేనానిపై మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు
AP Politics: తాడేపల్లిగూడెం సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కు అసలు పార్టీ నడపడమే రాదంటూ ఎద్దేవా చేశారు.
Minister Ambati Rambabu Slams Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం తాడేపల్లిగూడెం టీడీపీ - జనసేన సభలో అసలు ఏం సందేశం ఇచ్చారని.. జెండా సభకు అసలు జనాలు రాకపోవడంతోనే ఆలస్యంగా మొదలు పెట్టారని సెటైర్లు వేశారు. 'తాడేపల్లిగూడెం సభలో పవన్ షేరింగ్ గురించి మాట్లాడతారేమో అని అభిమానులు ఎదురు చూశారు. పవర్ స్టార్ అన్నారు కానీ.. పవర్ షేరింగ్ గురించి మాట్లాడలేదు. సీఎం జగన్ ను దూషించేందుకే జెండా సభ పెట్టినట్లుంది. పవన్ కల్యాణ్ సభలో కనీసం అవగాహన లేకుండా సినిమా డైలాగ్స్ కొట్టారు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానన్న పవన్.. ఇప్పుడు తనను ప్రశ్నించవద్దంటూ ఎవరిని బెదిరిస్తున్నారు.?. ఆయనకు అసలు పార్టీ నడపడమే రాదు. పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే.' అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
'నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహరే'
'పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహరే. సీఎం జగన్ ను తొక్కేస్తానంటూ ఆవేశంగా మాట్లాడారు. లేకుంటే తన పేరు పవన్ కల్యాణే కాదని అన్నారు. అవును.. ఆయన పేరు పవన్ కల్యాణే కాదు. జగన్ ను పాతాళానికి తొక్కాలంటే పవన్ ను పుట్టించిన వాళ్లు రావాలి. ఇచ్చిన మాటపై నిలబడి నాయకుడు వైఎస్ జగన్. అలాంటి జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కు లేదు. నీ జనసైనికులను అడుగు. పవన్ గొప్పో, జగన్ గొప్పో చెబుతారు. రాజకీయాల్లో పవన్ ఆటలో అరటి పండు లాంటి వారు.' అంటూ అంబటి ఘాటుగా వ్యాఖ్యానించారు.
'అప్పుడు బాధ అనిపించలేదా.?'
చంద్రబాబుని జైల్లో పెడితే బాధేసిందని పవన్ విలపించారని.. మరి వంగవీటి రాధను హత్య చేసినప్పుడు నీకు బాధ కలగలేదా.? అని అంబటి ప్రశ్నించారు. ముద్రగడను వేధించినప్పుడు బాధ కలగలేదా.? అని నిలదీశారు. కాపు సోదరులంతా పవన్ గురించి ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. 'చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు మొగుడు జగన్మోహన్ రెడ్డి. పిల్లిని సంకన పెట్టుకుని వెళ్లకూడదనే లోకేశ్ ను సభకు రానివ్వలేదు. చంద్రబాబు అన్నీ తెలిసిన వాడు కావడం వల్లే లోకేశ్ ను సభకు వద్దన్నారు. లోకేశ్ టీడీపీకి శకునం. ఆయన వచ్చిన తర్వాతే టీడీపీ ప్లాప్ అయిపోయింది.' అంటూ అంబటి సెటైర్లు వేశారు.
అటు, మంత్రులు పేర్ని నాని, రోజా, వేణుగోపాలకృష్ణ సైతం పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. పవన్ వామనుడు కాదని, శల్యుడు అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. టీడీపీ - జనసేన సభలో కేవలం సీఎం జగన్ నామస్మరణే చేశారని.. వారికి ఓట్లు ఎందుకు వేయాలో చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. సినిమా డైలాగులు బట్టీ పట్టారని.. సభలో గట్టిగా అరిచినంత మాత్రాన ఎన్నికల్లో ఓట్లు పడవంటూ మంత్రి రోజా విమర్శించారు. పవన్ చంద్రబాబుకు ఊడిగం చేస్తూ పాతాళంలోకి కూరుకుపోయారని.. సీఎం జగన్ ను విమర్శించే నైతిక హక్కు పవన్ కు లేదని అన్నారు.