TS Politics : తెలంగాణ రాజకీయాల్లో " మైండ్ గేమ్ " సీజన్ ! బీజేపీవి మాటలే.. కేసీఆర్ చేతల్లో చూపించారా ?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మైండ్ గేమ్ సీజన్ నడుస్తోంది. టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని బీజేపీ మాటలతో చెబుతూంటే...చేతలతో కేసీఆర్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ మైండ్‌గేమ్‌లో ఎవరిది పైచేయి ?
TS Politics : తెలంగాణలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. కానీ తెలంగాణ మొత్తం రాజకీయం ప్రకంపనలు ఉంటున్నాయి. జరుగుతోంది... నేరుగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకే అన్నంతగా వేడి కనిపిస్తోంది. చావో రేవో అన్నంతగా పార్టీలు తలపడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర అధికార బలాబలాల మధ్య అధికారులు బలైపోతున్నారు. వాటి మధ్య మూడో పార్టీ చిక్కిశల్యం అయిపోతోంది. అదే సమయంలో మైండ్ గేమ్ కూడా ప్రారంభమయింది. ఇందులో అయారాం.. గయారాంలు పాత్రధారులవుతున్నారు. ఎన్నికలయిన తరవాత వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం కానీ ఇప్పుడు మైండ్‌గేమ్‌లో వారే కీలకం. ఓ వైపు బీజేపీ.. మరో వైపు టీఆర్ఎస్ పోటాపోటీగా చేరికలతో మైండ్ గేమ్ ప్రారంభించాయి. ఇందులో ఎవరిది పైచేయి ?
చేరికల మైండ్ గేమ్ ప్రారంభించిన బీజేపీ !
భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ను బీజేపీలో చేర్చుకున్న తర్వాత తెలంగాణ బీజేపీ నేతల మైండ్ గేమ్ ఓ రేంజ్‌కు చేరింది. మాజీ మంత్రి బీజేపీలో చేరబోతున్నారని.. రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనం కాబోతున్నారని.. పలువురు మాజీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని.. బీజేపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత చాలా మంది బీజేపీలో చేరుతారని ఇప్పటికే తమతో పలువురు నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని లక్ష్మణ్ వంటి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. వాస్తవానికి బీజేపీ నేతలు చాలా కాలంగా ఈ చేరికల ప్రచారం చేస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్రలోనే పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. కానీ చోటామోటా నేతలు మాత్రం చేరుతూ వస్తున్నారు. టీఆర్ఎస్‌లో అసంతృప్తికి గురైన వారు కూడా బీజేపీ పిలుపునకు అంతగా స్పందించడం లేదు. కానీ బూర నర్సయ్య గౌడ్ చేరిక తర్వాత సీన్ మారిపోయింది.
రివర్స్ చేరికలతో పాటు బీజేపీ ఖాళీ అవుతుందనేలా కేసీఆర్ మైండ్ గేమ్ !
బీజేపీ నేతలు ఆడుతున్న మైండ్ గేమ్‌ను కేసీఆర్ తేలికగా తీసుకోలేదు. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్‌లో అసంతృప్తికి గురై బీజేపీకి వెళ్లిన ఇద్దరు కీలక నేతలు స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ ఇద్దరూ ఉదయం రాజీనామా చేసి మధ్యాహ్నానికి టీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. అయితే ఈ ఆకర్ష్ ప్రారంభమేనని చాలా పెద్ద పెద్ద తలకాయలు టీఆర్ఎస్‌లో చేరబోతున్నాయన్న ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు మైండ్ గేమ్ ప్రారంభించారు. ఓ ఎమ్మెల్యే కూడా వస్తారంటున్నారు. ఓ మాజీ ఎంపీతో పాటు మరికొంత మంది గతంలో కేసీఆర్‌తో సన్నిహితంగా ఉన్న వారికి ఫోన్లు చేస్తున్నారు. జరిగిందేదో జరిగిపోయింది.. ఇప్పుడు రాజకీయంగా కీలక పరిస్థితుల్లో ఉన్నామని కలసి నడుద్దామని కేసీఆర్ పిలుస్తున్నారు. దీంతో పాత టీఆర్ఎస్ నేతలంతా తిరిగి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నల్లాల ఓదెలు కూడా ఇటీవలే కేసీఆర్‌ను కలిసిన తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. బీజేపీ చేరికల వ్యూహానికి కౌంటర్ గా కేసీఆర్ రివర్స్ ఆకర్ష్ ప్రయోగించారు. ఫలితంగా బీజేపీ ఇప్పుడు ఎవరెవరు పార్టీ వీడుతారా ఉత్కంఠలో పడిపోయింది. ఇదే అదనుగా టీఆర్ఎస్ మైండ్ గేమ్ ప్రారంభించింది.ఫలానా వాళ్లు వస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో బీజేపీ టెన్షన్‌లో పడుతోంది.
ఆకర్ష్ తో తాయిలాలు అందుకున్న వారంతా పార్టీలో ఉంటారా ?
ఎన్నికల సమయంలో ఆయారాం.. గయారాంలు సహజమే. అయితే ఉపఎన్నికల సమయంలోనే ఇంత స్థాయిలో చేరికలు..జంపింగ్‌లు ఉండటం అనూహ్యమే. పార్టీలు మారుతున్న వారెవరూ ఆషామాషీగా చేరరు. తమ టైం వచ్చింది కాబట్టి గట్టి కోరికలే కోరి ఉంటారు. పార్టీలో గుర్తింపు లేదని.. కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడ లేదని అలిగి వెళ్లిపోయి తీవ్ర విమర్శలు చేసిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ వంటి వారికి .. కాదలేని ఆఫర్లు టీఆర్ఎస్ అధినేత ఇచ్చి ఉంటారు. బీజేపీలో చేరుతున్న వారికీ అంతే. ఇప్పటికైతే బాగానే ఉంటుంది.. కానీ మునుగోడు ఉపఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టం. టీఆర్ఎస్‌కు చేదు ఫలితం వస్తే .. ఇప్పుడు చేరిన నేతలకు మళ్లీ నిరాదరణే ఎదురవ్వొచ్చు. బీజేపీలో అయితే నాయకుల కొరత ఉంది కాబట్టి ... ఓడిపోయినా ఎక్కడైనా సర్దుబాటు చేయవచ్చు. మొత్తంగా చేరికల్లో అటూ ఇటూ మారుతున్న నేతలు మాత్రం.. మెల్లగా విశ్వసనీయతను కోల్పోతున్నారు.